close

శనివారం, ఆగస్టు 24, 2019

ప్రధానాంశాలు

ఇంటి వెలుగు.. స్వీయ గెలుపు

చిరుచిరు అడుగులు..

కొవ్వొత్తులు... ఇంటిల్లిపాదికి వెలుగు

●ఆర్థిక స్వావలంబనతో అతివలు●

 స్వయం ఉపాధితో ఆర్థికాభివృద్ధి

 ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్న ఆ కుటుంబాలకు మహిళలు కొండంత అండగా నిలిచారు. పైసాపైసా కూడబెట్టి స్వయం ఉపాధి వైపు మొగ్గుచూపారు. కుటుంబంలో ముఖ్య భూమిక పోషిస్తూ ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేశారు. స్వయం ఉపాధి, పొదుపు మంత్రంతో రాణిస్తూ కుటుంబాలకు ఆర్థికంగా కొండంత అండగా నిలిచారు. స్వయం ఉపాధితో రాణిస్తున్న మహిళల విజయగాథలపై ‘న్యూస్‌టుడే’ కథనం.

జిల్లాలోని పొదుపు మహిళలు చిరుతిళ్ల తయారీ, కొవ్వొత్తులు, ఆవకాయ, బొమ్మలు, పట్టువస్త్రాలు, అందమైన డిజైన్లు, చీరలు తదితర వ్యాపారాల్లో రాణిస్తున్నారు. వచ్చిన లాభాలను పిల్లల చదువులు, ఇంటికి అవసరమైన ఖర్చులకు వినియోగిస్తున్నారు. ఎమ్మిగనూరు, ఆదోని, నంద్యాల, కర్నూలు, నందికొట్కూరు, డోన్‌, గూడూరు, ఆత్మకూరు, అళ్లగడ్డ పురపాలక సంఘాల్లోని పలువురు పొదుపు మహిళలు కుటుంబాలకు వెలుగుదివ్వెగా మారారు. స్వయం ఉపాధిలో రాణిస్తూ ఆర్థికంగా ముందుడుగు వేస్తున్నారు.

చిత్రంలో కొవ్వొత్తులు తయారు చేసిన మహిళ పేరు సుమశ్రీ. ఉప్పరవీధి. భర్త శ్రీనివాసులు ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ముగ్గురు పిల్లలు ఉన్నారు. పొదుపు సంఘంలో ఆరేళ్ల కిందట చేరారు. నెలకు రూ.60 చొప్పున పొదుపును ప్రారంభించారు. గ్రూపు ద్వారా రూ.50 వేల బ్యాంకు రుణం పొందారు. గతంలో కొవ్వొత్తుల తయారీపై మెప్మా ఇచ్చిన శిక్షణను సద్వినియోగం చేసుకున్నారు. చిన్న తరహా పరిశ్రమ ఏర్పాటు చేసుకున్నారు. మైనం, కలర్స్‌, ఇతర సామగ్రిని హైదరాబాదు, కర్నూలు నుంచి నెలకు ఒకసారి కొనుగోలు చేసుకుంటున్నారు. కొవ్వొత్తుల తయారీలో పెద్దవి, చిన్నవి, వెంకటేశ్వరస్వామి, నెమలి, ఇతర ఆకృత్తులను తయారీ చేస్తున్నారు. రూ.100, రూ.50, రూ.20, రూ.10 చొప్పున అమ్మకాలు చేస్తున్నారు. ఆదోని, మంత్రాలయం, కర్నూలు తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. అన్ని ఖర్చులు పోను నెలకు రూ.10 వేలుపైగానే ఆదాయం వస్తుందని మహిళ పేర్కొన్నారు.

చిత్రంలో చిన్నచిన్న ప్యాకెట్లు ప్యాకింగ్‌ చేసిన ఈ మహిళ పేరు మహాదేవి. ఎమ్మిగనూరు పట్టణం. భర్త సురేష్‌ చిన్న వ్యాపారం చేస్తున్నారు. ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెరిగిన ధరలతో పిల్లల చదువులు, కుటుంబ ఖర్చులు అధికమయ్యాయి. ఈ పరిస్థితిలో పొదుపు సంఘంలో చేరారు. ఆరేళ్లు పొదుపు చేశారు. బ్యాంకు నుంచి రూ.50 వేల రుణ సాయం అందుకున్నారు. ఆ డబ్బుతో చిరు వ్యాపారానికి శ్రీకారం చుట్టారు. వక్కలు, లవంగాలు, యాలకులు, సొంటి ఇతర వాటిని సొంతంగా కొనుగోలు చేసుకుంటున్నారు. కర్నూలు ప్రాంతంలో కేజీల చొప్పున కొనుగోలు చేసుకొని చిన్నవిగా ప్యాకింగ్‌ చేసి అంగళ్లకు, వివిధ గ్రామాలకు సరఫరా చేస్తున్నారు. ఒక ప్యాకెట్‌ను రూ.50 చొప్పున (55 చిన్న ప్యాకెట్లు) అమ్మకం చేస్తున్నారు. చిన్నచిన్న ప్యాకెట్లు కావడంతో వ్యాపారులు సైతం ఆసక్తి చూపుత్నుట్లు మహిళ తెలిపారు. భర్తతో కలిసి వ్యాపారం చేయడంతో నెలకు రూ.10 నుంచి రూ.15 వేల వరకు మిగులుతోందని ఆమె చెబుతున్నారు.

అప్పడాలు.. కుటుంబ వెలుగు రేఖలు

చిత్రంలోని మహిళ పేరు విజయలక్ష్మి. మల్లారవీధి. భర్త దేవేంద్ర టైలరింగ్‌ పనిచేస్తున్నారు. ఇద్దరు పిల్లలను చదివిస్తున్నారు. ధరణి పొదుపు సంఘంలో 8 ఏళ్లుగా పొదుపు చేస్తున్నారు. ప్రభుత్వం రూ.50 వేల బ్యాంకు రుణాలను పంపిణీ చేసింది. కుటుంబానికి చేదోడుగా ఉండాలనే లక్ష్యంతో అప్పడాలు, చక్కిలాలు, ఇతర చిరుతిళ్లు తయారు చేస్తున్నారు. అప్పడాలను మార్కెట్‌లోని దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. ప్రతిరోజూ అప్పడాలు పెద్దవి రూ.50 ప్యాకెట్లు చొప్పున అమ్మకాలు చేస్తున్నారు. రోజు విడిచి రోజు అంగళ్లకు సరఫరా చేస్తున్నారు. నెలకు కనీసం రూ.15 వేల నుంచి రూ.20వేల అమ్మకాలు ఉంటున్నాయి. నెలకు రూ.5వేల నుంచి రూ.8 వేలు మిగులుతుందని మహిళ తెలిపారు.

ఆవకాయ తయారీలో భళా

చిత్రంలోని మహిళ పేరు మల్లేశ్వరి. ఎమ్మిగనూరులోని ఉప్పరవీధి. భర్త మల్లికార్జున ఆర్టీసీలో పనిచేస్తున్నారు. ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంట్లో పిల్లల చదువులు, పెరిగిన ఆర్థికపరమైన ఖర్చులను తగ్గించుకునేందుకు స్వయం ఉపాధి ఆలోచన చేశారు. పొదుపు ద్వారా రూ.50 వేల బ్యాంకు రుణంతో చెట్నీల తయారీని ప్రారంభించారు. ఆవకాయ చెట్నీ, గోంగూర, టమోటా, అల్లం, వెల్లుల్లి తదితర సరకులను ఎమ్మిగనూరు సంతలో కొనుగోలు చేసుకుంటున్నారు. వారం డిమాండుకు అనుగుణంగా వాటిని తయారు చేసి విక్రయిస్తున్నారు. ఆవకాయ చెట్నీ కిలో రూ.400, ఇతర చెట్నీలు రూ.200 చొప్పున ధర నిర్ణయించి మార్కెట్‌ చేస్తున్నారు. చెట్నీలు అమ్మగా ఖర్చులుపోను నెలకు రూ.6 వేలుపైగానే ఆదాయం వస్తున్నట్లు మహిళ పేర్కొన్నారు.

 

అగరొత్తులతో ఉపాధి...

చిత్రంలోని అగరొత్తులను అమ్మకానికి ఉంచిన మహిళ పేరు సరస్వతి. ముగతిపేట. భర్త అనంతరావు ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు. ఇద్దరు పిల్లలు చదువుతున్నారు. ఆర్థిక వనరులు అవసరాలకు తగ్గట్టుగా లేకపోవడంతో అగరొత్తుల తయారీకి శ్రీకారం చుట్టారు. 8 ఏళ్లగా పొదుపు మంత్రం పటిస్తూ వచ్చిన బ్యాంకు రుణంతో ఉపాధి వైపు అడుగులు వేశారు. రూ.50 వేలతో వ్యాపారానికి కావాల్సిన సరకులన్నింటినీ బెంగళూరు నుంచి నెలకు ఒకసారి తెప్పించుకుంటున్నారు. నెలకు 10 నుంచి 15 కేజీల వరకు అగరొత్తులు తయారు చేస్తూ రూ.100, రూ.50 చొప్పున ప్యాకింగ్‌ చేసి ఎమ్మిగనూరు పట్టణంలోని అన్ని దుకాణాలకు పంపిణీ చేస్తున్నారు. నెలకు వీటి ద్వారా రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు ఆదాయం వస్తుందని మహిళ పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.