close

శనివారం, ఆగస్టు 24, 2019

ప్రధానాంశాలు

మేమింతే.. పట్టించుకోమంతే..! 

కంపు కొడుతున్న  చెరువులు, కుంటలు 
ఏప్రిల్‌ తర్వాత కాలుష్యాన్ని లెక్కించని వైనం 
మారని టీఎస్‌పీసీబీ అధికారుల తీరు 
ఈనాడు, హైదరాబాద్‌

చెరువులు, కుంటలు కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయి. మురుగు, ప్రమాదకర పారిశ్రామిక రసాయన వ్యర్థాలు చేరి కంపు కొడుతున్నాయి. నగరంలోని చాలా నీటి వనరుల దగ్గరకు ముక్కు మూసుకుని వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇలాంటి తరుణంలోనూ తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి(టీఎస్‌పీసీబీ) అధికారుల తీరు మారడం లేదు. ఆ కొన్ని చెరువుల్లోనూ నీటి నాణ్యతను పరీక్షించడంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఏప్రిల్‌ నుంచి నేటి వరకు ఆ కాలుష్యం గురించి పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారు. 
దాదాపు ‘ఈ’ కేటగిరీలోనే..! 
శివారుల్లోని వాటితో పోల్చితే నగరంలోని చెరువులు, కుంటల పరిస్థితి దారుణంగా మారింది. ఎక్కడికక్కడ కబ్జాలకు గురవుతున్నా పట్టించుకునే నాథుడే కరవయ్యారు. శుద్ధి చేయకుండానే నేరుగా మురుగును వదిలేస్తున్నారు. కాసుల కక్కుర్తితో పరిశ్రమల నిర్వాహకులు ఉత్పత్తులను తయారు చేసే క్రమంలో వెలువడే ప్రమాదకర రసాయన వ్యర్థాలను గుట్టు చప్పుడు కాకుండా వదిలేసి చేతులు దులుపుకొంటున్నారు. మున్సిపల్‌ చెత్త, జంతు కళేబరాలు, ప్లాస్టిక్‌ వ్యర్థాలతో మినీ ‘డంపింగ్‌’ యార్డులుగా దర్శనమిస్తున్నాయి. కాలుష్య తీవ్రతను బట్టి చెరువులు, కుంటలను ఏ, బీ, సీ, డీ, ఈ కేటగిరీలుగా విభజిస్తారు. ‘ఏ’ కేటగిరీ కిందకు చేర్చిన చెరువుల్లో నీటిని శుద్ధి చేయకుండానే తాగేందుకు వినియోగించుకోవచ్చు. అలాంటి చెరువు లేదా కుంట మన దగ్గర ఒక్కటి కూడా లేదు. ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ జంట జలాశయాలు కూడా ‘సి’ కేటగిరీలోనే ఉన్నాయి. అంటే శుద్ధి చేసి తాగేందుకు నీటిని వాడుకోవచ్చన్న మాట. ‘ఈ’ కేటగిరీలో చేర్చారంటే ఆ చెరువు లేదా కుంటలో కాలుష్య తీవ్రత ఆందోళనకరంగా ఉందన్న మాట. నగరంలోని అధిక శాతం చెరువులు ‘ఈ’ కేటగిరీలోనే ఉండటం గమనార్హం. 

లెక్కింపులో ఎప్పుడూ నిర్లక్ష్యమే..! 
ఇప్పుడే కాదు.. ఎప్పటి నుంచో నీటి వనరులంటేనే టీఎస్‌పీసీబీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కాలుష్య కోరల్లో చిక్కుకున్న చెరువులు, కుంటలను కాపాడేందుకు చర్యలు తీసుకోవడం సంగతి పక్కన పెడితే.. నీటి నాణ్యతను క్రమం తప్పకుండా పరీక్షించేందుకు తీరిక దొరకడం లేదు. సర్వత్రా విమర్శలు వచ్చినప్పుడు హడావుడిగా ఏవో లెక్కలు వేసేసి మమ అనిపించేస్తున్నారు. పోనీ.. ఆ లెక్కలనైనా హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, నీటి పారుదల శాఖ తదితర సంబంధిత విభాగాలకు పంపించి అప్రమత్తం చేస్తున్నారా అంటే అదీ లేదు. మే, జూన్‌లో చెరువులు, కుంటల వైపు సంబంధిత అధికారులు చూడలేదు. ఏప్రిల్‌ వరకు మాత్రమే కాలుష్య తీవ్రతను గుర్తించినట్లుగా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అలా అని నీటి నాణ్యత పరీక్షలను నిర్వహించడం పీసీబీకి భారంగా మారిందా అంటే అదీ లేదు. నిధులు దండిగానే ఉండటం గమనార్హం. కాకపోతే.. పరిశ్రమలకు అనుమతులివ్వడం వరకే తమ బాధ్యత అన్నట్లుగా అధికారులు వ్యవహరిస్తున్నారు. 

20కి పైగా చెరువులు, కుంటల్లో..! 
జాతీయ నీటి నాణ్యత పర్యవేక్షణ కార్యక్రమం((ఎన్‌డబ్ల్యూఎంపీ) కింద టీఎస్‌పీసీబీ గ్రేటర్‌తో పాటు శివారుల్లోని 20కి పైగా నీటి వనరుల్లో కాలుష్య తీవ్రతను లెక్కిస్తోంది. పెద్ద చెరువు (నాచారం చెరువులు), బంజారా, హిమాయత్‌సాగర్‌, శామీర్‌పేట్‌, ప్రగతినగర్‌, లక్ష్మీనారాయణ, సరూర్‌నగర్‌, ఉమ్డా సాగర్‌, కాముని చెరువులు (శంషాబాద్‌), ఇబ్రహీం చెరువు(రాజేంద్రనగర్‌), మల్లాపూర్‌ ట్యాంక్‌, ఫాక్స్‌ సాగర్‌(జీడిమెట్ల), నూర్‌ మహమ్మద్‌ కుంట, దుర్గం చెరువు, నల్ల చెరువు, కాప్రా, అంబర్‌ చెరువులు(కూకట్‌పల్లి), హుస్సేన్‌సాగర్‌, హస్మత్‌పేట్‌, రంగథాముని చెరువు, ఉస్మాన్‌సాగర్‌, సఫిల్‌గూడ చెరువు, మీరాలం ట్యాంక్‌, లంగర్‌హౌస్‌ చెరువులో ప్రతి నెలా క్రమం తప్పకుండా నీటి నాణ్యతను పరీక్షించాలి. ఆ లెక్కల ఆధారంగా కాలుష్య తీవ్రతను అంచనా వేయాలి. ఇందుకయ్యే వ్యయంలో సగం కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ) భరిస్తుంది.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.