close

గురువారం, ఆగస్టు 22, 2019

ప్రధానాంశాలు

పాతబస్తీలో.. కత్తుల కోలాటం! 

చిన్న విషయానికే దాడులకు పాల్పడుతున్న యువకులు 
ఫలించని పోలీసుల  ప్రయత్నాలు 
చార్మినార్‌, న్యూస్‌టుడే

కక్షలతో పాతబస్తీలో యువకులు కత్తులు దూసుకుంటున్నారు. భూ తగాదాలు, ఆస్తులు, ప్రేమ వివాదాల నడుమ కత్తులతో దాడులకు సిద్ధమవుతున్నారు. కొన్ని సందర్భాల్లో చిన్న వివాదాలతో రాజుకున్న వ్యక్తిగత కక్షల్ని మొగ్గలోనే తుంచడానికి చేసే రాజీ ప్రయత్నాలు ఫలించకపోవడంతో అవి తీవ్ర రూపం దాల్చుతున్నాయి. 

కొన్ని ఘటనలు.. 
ఫలక్‌నుమా పరిధిలోని సహలీన్‌కాలనీలో ఈనెల 2న మీరాలం బీఎన్‌కే కాలనీకి చెందిన అబ్దుల్‌ సంధానీ (21)పై వ్యక్తిగత కక్షలతో మైలార్‌దేవుపల్లికి చెందిన అర్బాజ్‌(22) మరో ముగ్గురు మిత్రులతో కలిసి కత్తులతో దాడి చేశాడు. 
కాలాపత్తర్‌ ఠాణా పరిధిలోని మిశ్రీగంజ్‌ చున్నెకీబట్టీ ప్రాంతంలో ఈ నెల 9న మరో యువకుడు పాతకక్షలతో కత్తిపోటుకు గురై ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. తనువు చాలించాడు. 
ఇటీవల కాలాపత్తర్‌ పరిధిలో వ్యక్తిగత కక్షలతో కత్తులు దూసుకోవడంతో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మీరాలం బోటులో షికారుకు వెళ్లిన సందర్భంలో తమ సోదరుడిని చెరువులోకి తోసి హతమార్చాడని.. మీరాలం వాటర్‌ ఫిల్టర్‌లో డ్రైవర్‌గా పనిచేసే మహ్మద్‌ షరీఫ్‌(26) హసన్‌నగర్‌కు చెందిన మహ్మద్‌ హతుల్లా (23)పై కక్ష పెంచుకున్నాడు. 
గల్ఫ్‌కు వెళ్లి వచ్చిన తమ మిత్రుడు మోసీన్‌ అహ్మద్‌(25) తమను పట్టించు కోవడంలేదని.. గతంలో  బాకీ డబ్బుల  విషయమై తరచూ తనను అతడు వేధిస్తున్నాడని తాడ్‌బన్‌కు చెందిన ఆమేర్‌ఖురేషి అతనిపై వ్యక్తిగతమైన కక్ష పెంచుకున్నాడు. తాడుబన్‌లోని గుర్రాలశాలకు బాకీ డబ్బులు విషయం చర్చించుకుందామని మోసీన్‌ను పిలిపించి.. అతనిపై కత్తుతో ఆమేర్‌ఖురేషి దాడి చేశాడు. ఈదాడిలో మోసీన్‌ మృత్యువాతపడ్డాడు. 

భయంతోనే దాడులు 
అదనపు డీసీపీ సయ్యద్‌ రఫీక్‌ 
భూ ఆస్తుల డబ్బుల వివాదాలు, తనకు ఎదురు లేదనే అహంభావం, ప్రేమ వ్యవహారాల తగాదాలు తదితర అంశాల్లో తలెత్తిన వివాద ఘటనలు వ్యక్తిగత కక్షలుగా ఉండిపోతున్నాయి. తనపై ప్రత్యర్థి ఎక్కడ దాడులు చేస్తాడో అని కాస్త అవకాశం దొరికితే.. తమ శత్రువుల్ని అంతం చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తిగత కక్షల వివాదాలను మొగ్గలోనే తుంచడానికి పోలీసులు చట్టప్రకారం అవసరమైన చర్యలు తీసుకుంటారు. 

భరోసా కల్పించినా.. 
శాంతిభద్రతలకు విఘాతం కల్పించే ఘటనలు తలెత్తిన బస్తీల్లో దక్షిణ మండలం డీసీపీ అంబర్‌కిషోర్‌ఝా ఆధ్వర్యంలో పోలీసులు కట్టడిముట్టడి నిర్వహించి.. నిందితులను చట్టప్రకారం అణిచివేస్తామని భరోసా కల్పిస్తున్నారు. తమకు చిక్కిన రౌడీషీటర్లకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నారు. కామాటిపురా పరిధిలోని ఓ యువకుడు అక్కడి ఉస్మాన్‌బాగ్‌ పరిధిలోని శ్మశానవాటిక అడ్డాగా చేసుకుని ఇటీవల శాంతిభద్రతల సమస్యను సృష్టించాడు. దారి దోపిడీలు చేయడంతో పాటు తన గ్యాంగ్‌తో యువతను బెదిరించి.. వారి ద్విచక్రవాహనాలు లాక్కొన్నాడు. భూ వివాదాల్లోనూ తలదూర్చాడు. దీంతో పోలీసులు అతడి కార్యకలాపాలపై ఫిర్యాదులు రావడంతో అతని ముఠాలోని ఆరేడుమందిని  కామాటిపురా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రౌడీషీటర్లకు హెచ్చరికలతో కూడిన కౌన్సెలింగ్‌ నిర్వహించారు. శాంతిభద్రతలకు భంగం కల్పిస్తే.. చట్టప్రకారం ఉక్కుపాదంతో అణిచివేస్తామని రౌడీషీటర్లను ఏసీపీ అంజయ్య హెచ్చరించారు. ఈ హెచ్చరికలు రౌడీలు సృష్టించే శాంతిభద్రతల సమస్యల కార్యకలాపాలను తగ్గుముఖం పట్టించేలా చేసినప్పటికి.. వ్యక్తిగత కక్షలతో దాడులకు దిగే ఘటనలు మాత్రం ఆగడం లేదు.


 

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.