close

బుధవారం, ఆగస్టు 21, 2019

ప్రధానాంశాలు

స్వరాల వేట.. రికార్డుల పంట! 

సంగీత కళాకారుడి వినూత్న ప్రయోగాలు 
పియానోప్రదర్శనలతో అంతర్జాతీయ గుర్తింపు 
ఈనాడు, హైదరాబాద్‌

సంగీతంలో సరికొత్త ప్రయోగాలు చేస్తూ రికార్డులు, రివార్డులు సాధిస్తున్నారు... నగరానికి చెందిన డాక్టర్‌ టి.ఎస్‌.సంతోష్‌కుమార్‌ అలియాస్‌ పియానో సంతోష్‌. ప్రస్తుతం వెస్ట్‌మారేడుపల్లిలో ఉంటూ.. కళానిధి సంగీత పాఠశాలను నిర్వహిస్తున్నారు. అత్యంత వేగంగా పియానో వాయించగల సంగీత కళాకారుడిగా నిలిచారు. 
సంతోష్‌కుమార్‌ తండ్రి జయప్రకాశ్‌రావు ప్రవృత్తి సంగీతం.. ఖాళీగా ఉన్నప్పుడు హార్మోనియం, పియానోతో సాధన చేస్తూ ఆస్వాదించేవారు. అలా సంతోష్‌కుమార్‌కూ కళపట్ల ఇష్టం ఏర్పడటంతో తన తండ్రికే శిష్యుడిగా మారారు. రెండో
తరగతి చదివేటప్పుడు సరిగమలు... సంగీత పరికరాలతో పరిచయం... పదో తరగతి వచ్చేటప్పటికే వయోలిన్‌.. హార్మోనియంపై అలవోకగా స్వరాలను పలికించగల నైపుణ్యం వచ్చిందంటారు సంతోష్‌. పియానో, డ్రమ్స్‌లో 8 స్టేజ్‌లు, కర్ణాటక సంగీతం, తబలాలో నాలుగు స్టేజ్‌ల వరకూ కోర్సులు పూర్తి చేశారు. 
సమన్వయంతో... 
సంగీతాన్నే జీవితంగా భావించే సంతోష్‌ చదువును నిర్లక్ష్యం చేయలేదు. ఉపాధ్యాయవృత్తిలో ఉన్న తండ్రి పేరు నిలిపేలా గణితంలో ఎంఫిల్‌ పూర్తిచేశారు. చదువు పూర్తయ్యాక సంగీతం నేర్చుకునేందుకు లండన్‌ వెళ్లారు. ట్రినిటీ కాలేజ్‌ లండన్‌లో పియానో కోర్సు పూర్తి చేశారు. పాశ్చాత్య సంగీతమే కాకుండా భారతీయ సంప్రదాయ సంగీతంలోనూ ప్రావీణ్యత సంపాదించారు. పియానో.. డ్రమ్స్‌తో కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. స్వయంగా రూపొందించిన గీతాలతో దేశ, విదేశాల్లో పలు ప్రదర్శనలు ఇచ్చి ప్రశంసలు అందుకున్నారు. సుమారు 50కి పైగా జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు పొందారు. వాటన్నింటికన్నా పియానోను అత్యంత వేగంగా వాయించే విభాగంలో ప్రపంచ రికార్డు సాధించటం చాలా ఆనందంగా ఉందంటారు. ప్రతిరోజూ 8 గంటల పాటు సాధన చేసి, వేగాన్ని పెంచుకునేందుకు ప్రయత్నించారు. 2018లో సెకన్‌కు 47 నోట్స్‌ వేగంగా వాయించి ప్రపంచ రికార్డు సంపాదించాడు. దీన్ని గుర్తించిన జర్మనీ సంస్థ రవీంద్రభారతిలో ప్రత్యేకంగా ప్రదర్శన ఏర్పాటు చేయించింది. ఏకబిగిన రెండుగంటల పాటు పియానో, డ్రమ్స్‌తో స్వరాలను అందించి మరో రికార్డు సొంతం చేసుకున్నారు. ‘ఇరవై ఏళ్లుగా సాధన చేస్తూనే ఉన్నాను. మరింత వేగంగా పియానో వాయించాలనేది నా లక్ష్యం. స్వరాలంటే తెలియని నా భార్య పెళ్లి తర్వాత సంగీతం నేర్చుకుంది. నాకు ఇద్దరు మగపిల్లలు. వారిద్దరూ సంగీతాన్ని సాధన చేస్తున్నారు. కష్టపడటం ద్వారా ఏదైనా సాధ్యం’ అని చెప్పారు సంతోష్‌కుమార్‌.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.