close

సోమవారం, ఆగస్టు 26, 2019

ప్రధానాంశాలు

గరిట పట్టా.. వంట చేశా.. చేనేత దుస్తులకు ఫిదా అయ్యా 

మూడేళ్లలో భాగ్యనగరంలో  ఎన్నో మార్పులు 
యు.ఎస్‌. కాన్సుల్‌ జనరల్‌ కేథరిన్‌ హడ్డా 
ఈనాడు, హైదరాబాద్‌

మొక్కలు నాటే హరిత సవాలు  స్వీకరించినా.. క్రిస్టియన్లపై ఉగ్రదాడులకు నిరసనగా ముస్లిం సోదరులు చేపట్టిన నిరసనలో పాల్గొన్నా.. చేనేత ఫ్యాషన్‌ అంటూ ప్రచారం కల్పించినా.. తెలుగు సంప్రదాయ చీరకట్టులో మెరిసినా.. అది యు.ఎస్‌.కాన్సుల్‌ జనరల్‌ కేథరిన్‌ హడ్డాకే చెల్లింది. అంతేకాదు ఇక్కడి వంటకాలు నేర్చుకునేందుకు గరిట సైతం పట్టారు. 2016 అక్టోబరులో హైదరాబాద్‌ కాన్సులేట్‌ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన ఆమె గతంలో ఎవరూ చేపట్టనన్ని కార్యక్రమాలతో భారత్‌-అమెరికా సంబంధాలను బలోపేతం చేయడానికి కృషి చేశారు. పదవీకాలం ముగించుకుని వచ్చే నెలలో తిరిగి యూఎస్‌ వెళ్లబోతున్న నేపథ్యంలో భాగ్యనగరంతో ఆమె అనుబంధం, ఇక్కడి ప్రజలతో  పంచుకున్న అనుభూతులు ఆమె మాటల్లోనే.. 

హైదరాబాద్‌లో యు.ఎస్‌. కాన్సులేట్‌ కార్యాలయాన్ని ప్రారంభించి పదేళ్లవుతోంది. నాతో సహా గతంలో పనిచేసిన కాన్సుల్‌ జనరల్స్‌ ఇరు దేశాల మధ్య సాంస్కృతిక, వాణిజ్య, విద్యాపరమైన సంబంధాలు మెరుగుపర్చడంలో కృషి చేశారు. నాలుగో కాన్సుల్‌ జనరల్‌గా బాధ్యతలు నిర్వర్తించడం గర్వంగా భావించా. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాలతో అమెరికా సంబంధాలు ఈ మూడేళ్లలో మరింత మెరుగయ్యాయి. అంతర్జాతీయ వాణిజ్యవేత్తల సదస్సు, ఇండో-యుఎస్‌ భద్రతా దళాల శిక్షణ, మానవ అక్రమ రవాణాపై చైతన్యం, ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు తర్ఫీదు.. ఇలా ఎన్నో కార్యక్రమాలు జరిగాయి. 
ఇక్కడి మార్పులకు ప్రత్యక్ష సాక్షిని: మూడేళ్లలో హైదరాబాద్‌లో ఎన్నో మార్పులు వచ్చాయి. అంతర్జాతీయ స్థాయి మెట్రో రైలు ప్రారంభం, ఎస్‌ఆర్‌డీపీలో పలు పై వంతెనల నిర్మాణాలు అందుబాటులోకి వచ్చాయి. పలు అమెరికన్‌ కంపెనీలు ఇక్కడ కార్యాలయాలను విస్తరించాయి. ప్రస్తుతం 130 సంస్థల వరకు పనిచేస్తున్నాయి. ఈ అభివృద్ధికి సాక్షిని నేను. 
ఆ చిన్నారితో సంభాషణ మరిచిపోలేను: కొత్తగా వచ్చిన కాన్సుల్‌ జనరల్‌ను చిన్నారులతో ముఖాముఖి చేయించడం అనవాయితీగా వస్తోంది. నేను వచ్చిన కొత్తలో ఒక చిన్నారి తన పేరు దీప్తి అని చెప్పి బెరుకుగా నన్ను ప్రశ్నలడిగింది. తను మా అధికారి ఇంట్లో పనిమనిషి కుమార్తె. నా పదవీ కాలం ఏడాది పూర్తయిన సందర్భంలో ఆ చిన్నారి మళ్లీ కలిసింది. అప్పుడు ఎంతో ఆత్మవిశ్వాసంతో మాట్లాడటం మర్చిపోలేను. 
ఇక్కడి విశేషాలతో అక్కడ ప్రదర్శన: నాకు నచ్చిన పర్యాటక కేంద్రాలు భాగ్యనగరిలో చాలానే ఉన్నాయి. కుతుబ్‌షాహి టూంబ్స్‌ను ముందుగా చెప్పుకోవాలి. వాటి పరిరక్షణకు ఆగాఖాన్‌ అకాడమీకి యుఎస్‌ తోడ్పాటు అందిస్తోంది. గోల్కొండ కోట, చార్మినార్‌ కట్టడాలను పరిరక్షించుకోవాలి. హిమాయత్‌సాగర్‌ చెంత పక్షుల కిలకిలారావాలు, ఒడిశాలోని చిలకా సరస్సు భలే అనిపిస్తాయి. పూరీ బీచ్‌, కోణార్క్‌ ఆలయం, ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ వంటివి సందర్శించాను. అమరావతి, నాగార్జునకొండలోని బుద్ధ సర్క్యూట్‌ విశేషాలు ఆకట్టుకోవడమే కాదు... మా దేశంలో వచ్చే ఏడాది జరిగే ప్రదర్శనలో చోటు కల్పించబోతున్నాం. 
చేనేత వస్త్రాలు: కొండపల్లి బొమ్మలు, నిర్మల్‌, పోచంపల్లి చేనేత వస్త్రాలు ఆకట్టుకున్నాయి. చేనేత ఎంతో ఫ్యాషన్‌ కూడా. సందర్భానుసారంగా ఆ చీరలు కడుతుంటాను. పోచంపల్లిలోని డబల్‌ ఇకత్‌పై మనసు పారేసుకున్నాను. మచిలీపట్నం కలంకారి వస్త్రాల పనితనం అబ్బురపరుస్తుంటుంది. హైదరాబాద్‌ బిర్యానీ, హలీం రుచి చూస్తుంటా. వంటకాలు వేటికవే ప్రత్యేకం. పచ్చిపులుసు, పుదీనా కారంపొడి చేయడం నేర్చుకున్నాను. రోలులో నేనే స్వయంగా దినుసులు నూరాను. అనంతరం వీటిని అతిథులకు వడ్డించగా ఎంతో రుచిగా ఉందని మెచ్చుకున్నారు. 
తెలుగు సినిమాలు చూస్తుంటా: వీసా మౌఖిక పరీక్షలకు వచ్చే ప్రముఖులను నేను కలుస్తుంటా. తెలుగు సినిమాలు అప్పుడప్పుడు చూస్తుంటా. ‘బాహుబలి’ ముందస్తు ప్రదర్శన (ప్రివ్యూ) వీక్షించా. దర్శకుడు సుకుమార్‌ తీసిన ‘రంగస్థలం’ సినిమా కోసం వేసిన సెట్‌ గ్రామీణ ప్రాంతాన్ని కళ్లకు కట్టింది. 
పదేళ్లలో ఒక్కటే..: గత పదేళ్ల కాలంలో ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్‌ తర్వాత ఒకే ఒక చోట తప్ప కొత్త కాన్సులేట్‌ కార్యాలయాలు ఏర్పాటు చేయలేదు. ఆంధ్రప్రదేశ్‌, ఒడిశాలో ఏర్పాటు సమీప భవిష్యత్తులో లేదు. అది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ప్రస్తుతం మూడు రాష్ట్రాల్లో కలిపి 1.30 లక్షల మంది అమెరికన్‌ పౌరులు ఉన్నారు. వీరంతా వేర్వేరు కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, సెలవుల్లో సొంత రాష్ట్రానికి వచ్చిన అమెరికన్‌ పౌరసత్వం కలిగిన పిల్లలు, పర్యాటకులన్నమాట. భారత్‌ నుంచి అమెరికా వెళ్లేవారు.. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేవారు గత పదేళ్లలో పెరిగారు. అందరి అవసరాలు తీరేలా హైదరాబాద్‌లో కొత్త కార్యాలయం 2021 నాటికి సిద్ధమవుతుంది.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.