close

మంగళవారం, ఆగస్టు 20, 2019

ప్రధానాంశాలు

తాజాగా ఆహారం..రాజాలా ఆరోగ్యం! 

నగరంలో పెరుగుతున్న డయేరియా 
నిల్వ పదార్థాలతో నష్టం 
వేడివేడిగా తింటే మేలు 
జాగ్రత్తలు అవసరమంటున్న వైద్య నిపుణులు 
ఈనాడు, హైదరాబాద్‌


 

వర్షాకాలం... చిత్తడి, చల్లటి వాతావరణంలో వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువ. బ్యాక్టీరియా, వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు విజృంభిస్తుంటాయి. ఇప్పటికే నగరంలో డయేరియా కేసులు పెరుగుతున్నాయి. వాంతులు, విరేచనాలతో ఎంతోమంది ఆసుపత్రుల్లో చికిత్సల కోసం చేరుతున్నారు. గడచిన రెండు నెలల్లో వివిధ ప్రభుత్వ ఆసుపత్రులకు వేయికి పైగా ఈ తరహా కేసులు వచ్చాయి. నగరంలోని ఫీవర్‌ ఆసుపత్రికి రోగులు వరుస కడుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లే వారిని పరిగణనలోకి తీసుకుంటే ఈ సంఖ్య ఇంకా ఎక్కువే. ఈ కాలంలో తీసుకునే ఆహారం... ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావం చూపుతుందని పోషకాహార, వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అనారోగ్యానికి కారణమయ్యే కలుషిత ఆహారం విషయంలో అప్రమత్తంగా ఉండటంతోపాటు వ్యాధి నిరోధక శక్తి పెంచే తిండి తినాలి. వానాకాలంలో సాధ్యమైనంత వరకు తాజాగా... వేడిగా ఆహారాన్ని తీసుకోవాలి. ఈ కాలంలో తేమ వల్ల గాలిలో వైరస్‌, బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటాయి. నిల్వ ఆహారం, బయట పదార్థాలు, ఫ్రిజ్‌లో పెట్టినవి తింటే అనారోగ్యం ఖాయం. ప్రధానంగా డయేరియా, టైఫాయిడ్‌, వివిధ రకాల అలర్జీలను ఇవి కలుగజేస్తాయి. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, బాలింతలకు ఎక్కువ ప్రమాదం పొంచి ఉంటుంది.

శుచిగా... శుభ్రంగా 

సరైన ఆహారంతో ఆరోగ్యం కాపాడుకోవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. ఆకుకూరలు, కాయగూరలు, పండ్లను ఇంటికి తెచ్చాక చిటికెడు ఉప్పువేసి నీటిలో శుభ్రంగా కడిగి వినియోగించాలి. ఏ రోజుకారోజు తాజా ఆకు కూరలు, కూరగాయలు, పండ్లు తెచ్చుకోవడం మంచిది. యాపిల్‌, అనాస, బత్తాయి, నారింజ, దానిమ్మ తీసుకోవడం వల్ల సి విటమిన్‌ పుష్కలంగా అందుతుంది. ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.

 బుజ్జాయిలు... 

బయట కొని తెచ్చిన ఆహారాన్ని పిల్లలకు పెట్టొద్దు. కాచి వడ పోసిన నీటినే తాగాలి. పిల్లలకు శుభ్రతను అలవాటు చేయాలి. ఆటలాడుకుని వచ్చిన వెంటనే సబ్బుతో చేతులు కడుక్కునేలా చూడాలి. పిల్లలకు పెట్టే ఆహారంలో క్యారెట్‌, ఆకుకూరలు, గ్రీన్‌ ఆపిల్‌, బొప్పాయి, స్ట్రాబెర్రీ లాంటివి చేర్చాలి. వీటితో ఎ, సి విటమిన్లు పుష్కలంగా అందుతాయి.  ఆహారాన్ని బాగా ఉడకబెట్టి, వేడిగా తినిపించాలి. 

యువత, ఉద్యోగార్థులు

కళాశాలలు, కార్యాలయాలకు వెళ్లే వారిలో చాలామంది బయటి ఆహారం తినేందుకు ఆసక్తి చూపుతుంటారు. మసాలా, జంక్‌ఫుడ్స్‌, శీతల పానీయాలు బాగా తీసుకుంటారు. ఎక్కడపడితే అక్కడ నీళ్లు తాగడం వల్ల వైరల్‌, బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్ల బారిన పడుతుంటారు. డయేరియా, టైఫాయిడ్‌ సోకుతాయి. ఇంటి ఆహారానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. మిరియాలు, అల్లం, వెల్లుల్లిని విరివిగా తీసుకుంటే జీర్ణశక్తి మెరుగవుతుంది.  వేడివేడి రసాలు తాగడం మంచిది. ఎక్కువ మసాలాలు, నూనె పదార్థాలు లేకుండా బలవర్థక తిండి తినాలి.

వృద్ధులు...

వ్యాధి నిరోధక శక్తి క్షీణించడం వల్ల పెద్ద వయసు వారు తరచూ రోగాల బారిన పడుతుంటారు. పసుపు, అల్లం, వెల్లుల్లి, మిరియాలు తదితరాలు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. చికెన్‌, గుడ్డు, కాయ, తృణ ధాన్యాలు, శనగలు, బొబ్బర్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల విటమిన్లు, ప్రొటీన్లు శరీరానికి అందుతాయి. కాకరకాయలు, మెంతులు, వెల్లుల్లి... ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడతాయి. చల్లని వాతావరణం కారణంగా చాలామంది ఈ కాలంలో నీళ్లు తాగడానికి ఇష్టపడరు. దప్పిక కాకపోయినా తగినన్ని నీళ్లు తీసుకోవడం చాలా అవసరం. 

మహిళలు... 

వంట చేసేటప్పుడు శుభ్రత పాటించడంతో పాటు తమ ఆరోగ్య పరిరక్షణకూ మహిళలు ప్రాధాన్యం ఇవ్వాలి.  ఇంట్లో మహిళలు కుటుంబ సభ్యులంతా తిన్నాక చల్లారిన పదార్థాలను తీసుకుంటూ ఉంటారు. దీని వల్ల ఆరోగ్యపరమైన ఇబ్బందులు తప్పవు. అందరితోపాటు వేడివేడిగా తింటేనే మేలు. సి విటమిన్‌ ఎక్కువగా ఉండే పండ్లు, హెర్బల్‌టీ, గ్రీన్‌ టీ, అల్లం టీ, మిరియాలు, తేనె తీసుకుంటే చర్మం పొడిబారకుండా మెరుస్తూ కనిపిస్తుంది.  మసాలాలు, వేపుళ్లు, నూనె పదార్థాలకు దూరంగా ఉంటే మంచిది.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.