close

సోమవారం, ఆగస్టు 26, 2019

ప్రధానాంశాలు

విశ్వాస పరీక్షపై కుమార పద్మవ్యూహం 

● వాయిదాలపై వాయిదా చివరికేది ఫలితం?

● మిత్రుల వ్యూహాలతో తీవ్ర గందరగోళం

● మౌనాన్ని ఆశ్రయించిన కమలనాథులు

● గవర్నర్‌ లేఖలపై భిన్న స్వరాలు

ఈనాడు డిజిటల్‌, బెంగళూరు: ఎందరు ఎన్ని గడువులు విధించినా స్పీకర్‌ నిర్ణయమే అత్యున్నతమని సుప్రీంకోర్టే తేల్చి చెప్పిన నేపథ్యంలో కర్ణాటక విధానసభలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. విశ్వాస తీర్మానానికి గవర్నర్‌ దఫాలుగా ఆదేశించినా స్పీకర్‌ రమేశ్‌కుమార్‌ ఆ అంశంపై చర్చకు తావిచ్చి- ఓటింగ్‌ను ముందుకు జరుపుతూ చాణక్యం ప్రదర్శించడం శుక్రవారం పలు ప్రశ్నలను సృష్టించింది. సభాపతి జాతీయ స్థాయిలో తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేశారు. మూడుసార్లు తన సందేశాలు, ఆదేశాలతో సభలో చర్చనీయాంశంగా మారారు. దేశ అత్యున్నత న్యాయస్థానం, రాష్ట్ర ప్రథముడి ఆదేశాలపై కోటి ఆశలతో సభలో ఎంతో వినమ్రత పాటించిన ప్రతిపక్ష భాజపాకు శుక్రవారం కాస్త ఊరట లభించింది. ఎవరు చెబితే సభకు శిరోధార్యమో.. ఆయనే విశ్వాస పరీక్షపై పెదవి దాటి సూచన ఇవ్వటంతో రెండు వారాల కర్ణాటక సంక్షోభానికి తెరపడే అవకాశం సమీపంలో ఉన్నట్లేనని ఓ అంచనా. మధ్యలో రాష్ట్రపతి పాలన, విధానసభ రద్ధు.వంటి ప్రక్రియలు చర్చకు వచ్చినా వచ్చే సోమవారం ఇన్ని రోజుల ఉత్కంఠ తొలగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇటు చర్చలు.. అటు మంతనాలు

గురువారంతో పోలిస్తే శుక్రవారం సభ కాస్త నెమ్మదిగానే సాగిందనే చెప్పాలి. పార్టీల ఎత్తుగడలు మాత్రం లోలోపల బుసకొడుతూనే ఉన్నాయి. పాలక పక్షాలు చర్చలతో కాలయాపన చేస్తున్నట్లు కనిపించినా తమ హక్కులు, సభ్యుల పరిరక్షణలో భాగంగా శ్రమించినట్లే. ముఖ్యమంత్రి కుమారస్వామి శుక్రవారం తన వాణిని కాస్త పెద్దగానే వినిపించారు. ఓ సమయంలో విశ్వాస పరీక్షకు సిద్ధమని ప్రకటించినట్లు స్పందించారు. అంతలోనే తేరుకుని నేనింకా చాలా మాట్లాడాలంటూ లక్ష్యమేమిటో చెప్పకనే చెప్పారు. తనతో పాటు సహచరుల చర్చలకు అవకాశం కల్పించాలని స్పీకర్‌కు విన్నవించి, సభ కొనసాగింపు సంకేతాలు పంపారు. గురువారం సభలో గర్జించిన మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డి.కె.శివకుమార్‌ శుక్రవారం అంతగా సందడి చేయలేదు. సహ సభ్యులకే అవకాశమిస్తూ చర్చల పర్వం కొనసాగేందుకు పరోక్షంగా సహకరించారు. సీనియర్లు.. హెచ్‌.కె.పాటిల్‌, కృష్ణభైరేగౌడ, జేడీఎస్‌ సభ్యుడు శివలింగేగౌడ తదితరులు సభలో చర్చలు, డిమాండ్లు, రాజ్యాంగ నిబంధనలపై సుదీర్ఘ చర్చలకు దారి తీసేలా చేశారు. మరో వైపు మంత్రి రేవణ్ణ సైతం తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై వివరణ ఇచ్చే అవకాశాన్ని కల్పించాలని స్పీకర్‌కు పదేపదే విన్నవించారు.

గవర్నర్‌.. వైదాలగాల్సిందే..

శుక్రవారం చర్చల్లో గవర్నర్‌ వజూబాయి వాలా పెద్ద చర్చగా మారారు. ఆయన ముఖ్యమంత్రికి పంపిన ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమంటూ కాంగ్రెస్‌ సభ్యులు పెద్ద ఎత్తున డిమాండ్‌ చేయగా ప్రతిపక్ష భాజపా మాత్రం అవసరమైతే గవర్నర్‌ జోక్యం చేసుకున్న సందర్భాలు దేశ రాజకీయాల్లో ఉన్నాయని సమర్థించుకున్నారు. కానీ ఈ సారి ముఖ్యమంత్రి నేరుగా గవర్నర్‌పై ఆరోపణలు గుప్పించటం సభను కుదిపేసింది. ఎమ్మెల్యేల రాజీనామాలకు గవర్నర్‌ సహకారం ఉందని ముఖ్యమంత్రి నేరుగా ఆరోపించటం చర్చగా మారింది. వెంటనే పాలకపక్షాల సభ్యులు గవర్నర్‌ వైదొలగాలంటూ నినదించారు.

అంతా సంయమనమే

ప్రతిపక్ష సభ్యులు శుక్రవారం మరింత అప్రమత్తంగా వ్యవహరించారు. సభా వ్యవహారాలపై రాజ్‌భవన్‌ కన్ను ఉందన్న కారణంతో భాజపా సభ్యులు ఎంతో సంయమనాన్ని పాటించారు. ప్రతిపక్ష నేత యడ్యూరప్ప కేవలం ఒక్కసారి మాత్రమే మైకును అందుకోవటం గమనార్హం. కమలదళ సీనియర్లు మాధుస్వామి, బసవరాజ బొమ్మై మాత్రమే శుక్రవారం కాస్త ప్రతిస్పందించారు. పాలకపక్ష సభ్యులు ఆపరేషన్‌ కమలపై నేరుగా ఆరోపణలు చేశారు. అసమ్మతి ఎమ్మెల్యేలతో భాజపా నేతలున్న చిత్రాలను స్పీకర్‌కు అందించిన సందర్భంగానూ ఏమాత్రం స్పందించకపోవటం ఆ పార్టీ ఎంత పకడ్బంధీగా ప్రవర్తిస్తుందో తెలిసేలా చేసింది. అర్ధరాత్రి అయినా ఫర్వాలేదు.. ఓటింగ్‌ కావాల్సిందే అంటూ పట్టుబట్టినా.. స్పీకర్‌ ఇచ్చిన భరోసాతో సోమవారానికి సభ వాయిదా పడినా మరింత సహనాన్ని పాటించారు.

నేను క్షేమం

● కొందరు వ్యక్తులు నన్ను దారి తప్పించి, ముంబయికి తరలించారనే వదంతి సరికాదు. అత్యవసర పనిమీద చెన్నై వెళ్లాలనుకునే సమయంలో హృదయభాగంలో నొప్పిరావడంతో ఓ వైద్యుడి సూచనతో నేనే ముంబయికి చేరుకుని చికిత్స పొందుతున్నా. -శ్రీమంత్‌పాటిల్‌, కాగెవాడె ఎమ్మెల్యే

గౌడ మంత్రాంగం

విశ్వాస పరీక్ష వేళ అనుసరించాల్సిన మంత్రాంగంపై ముఖ్యమంత్రి కుమారస్వామి చివరికి.. తన తండ్రి, మాజీ ప్రధాని దేవేగౌడపై ఆధారపడ్డారు. శుక్రవారం ఉదయమే పద్మనాభనగరలో ఉన్న గౌడ నివాసానికి చేరుకున్న కుమార గంట సేపు ఏకాంతంగా చర్చించి, పలు సూచనలు పొందారు. అనంతరమే ఆయన సభలో తన వాగ్దాడిని మునుపెన్నడూ లేనంతగా పెంచారు.

కమల దృక్పథం

కుమార ఎత్తులకు పైఎత్తులు వేస్తూ.. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు భాజపా నేతలు విధానసౌధలోనే కార్యతంత్రం రూపొందించారు. ‘సంయమన’ మంత్రంతో మిత్రపక్షాలను ఎదుర్కొని- అధికారపక్షంగా అవతరించాలని సభ్యులు ఏక నిర్ణయానికి వచ్చారు. నిరసనలో భాగంగా రాత్రంతా సభలోనే విశ్రమించిన కమలనాథులు.. పట్టు వీడకుండా శుక్రవారం రాత్రి సభాపర్వాన్ని నిరంతరంగా కొనసాగేలా పథక రచన చేశారు.

డబ్బు ఎర : మా మిత్ర పక్ష ఎమ్మెల్యేలను భాజపా నేతలు కొనుగోలు చేశారు. వారందరినీ ముంబయికి తరలించి బంధించారు. వారికి ఎలా ఎరవేశారో.. సాక్ష్యాలు ఇవిగో. ఈ చిత్రాలు చూడండి. మా నేతలతో భాజపా నేతల సమావేశ చిత్రాలే కుట్రను బహిర్గతం చేస్తాయి. - సభలో ముఖ్యమంత్రి కుమారస్వామి

అధ్యక్షా.. విశ్వాస పరీక్ష మాటేంటి.. అంటూ సభలో గట్టిగా నిలదీస్తున్న యడ్యూరప్ప

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.