close

సోమవారం, ఆగస్టు 26, 2019

ప్రధానాంశాలు

ఇష్టం + వ్యాపకం + ప్రేమ = వ్యవసాయం

ఇది వృత్తి కాదు జీవనం అంటున్న విద్యావంతులు

భీమవరం అర్బన్‌, న్యూస్‌టుడే

వరి పొలాలు

 

పూర్వం దాదాపుగా అన్ని వర్గాల ప్రజలు వ్యవసాయం చేసేవారు. అంతే కాదు తమ వారసులను కూడా ఈ రంగంపై ఆధారపడేలా చేసేవారు. ప్రస్తుతం కంప్యూటర్‌ కాలం నడుస్తోంది. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు తమ పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తున్నారు. ఇప్పటి తరాల వారు వ్యవసాయం అంటే ఏమిటో కూడా తెలియని స్థితికి వెళ్లిపోతున్నారు. ఒకప్పుడు ఎంతో ఇష్టంగా వ్యవసాయం చేసిన వారు తమ పొలాలను కౌలుకు ఇచ్చి ఇతర రంగాలవైపు మళ్లారు. ప్రస్తుతం 90 శాతం వ్యవసాయం కౌలు రైతులే చేస్తున్నారు. కానీ తాము దానికి భిన్నమని నిరూపిస్తున్నారు... భీమవరం ప్రాంతానికి చెందిన పలువురు రైతులు. తమ పొలాలను వారే సొంతంగా సాగు చేస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఉన్నత చదువులు చదువుకున్నా వ్యవసాయమంటే మాకు ప్రాణం అంటూ పొలాల బాట పట్టారు.

ఈ రంగంపై మక్కువతో

వ్యవసాయంపై చిన్నతనం నుంచి ఉన్న మక్కువ కారణంగా ఉద్యోగ అవకాశం వచ్చినా అటుగా వెళ్లలేదు. బీఈడీ విద్యనభ్యసించాను. అంత చదివి ఉద్యోగం చేయకుండా వ్యవసాయం ఏమిటన్నారు. అయినా నేను వెనక్కి తగ్గలేదు. కానీ వ్యవసాయం చేస్తూనే రోజూ సాయంత్రం వేళల్లో కొన్నేళ్లపాటు ట్యూషన్లు చెప్పాను. ప్రస్తుతం 10 ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేస్తున్నాను. వ్యవసాయం చేయడంలో ఉన్న సంతోషం మాటల్లో చెప్పలేం. నిత్యం పచ్చని పొలాలు, మొక్కల మధ్య పని చేయడం ఎంతో ఆహ్లాదంగా సంతృప్తిగా ఉంటుంది.

- చిల్లిముంతల శ్రీనివాసు, రైతు చినఅమిరం.

పది మందికీ పని... వేయి మందికి ఆహారం

నేను పద్దెనిమిది ఎకరాల్లో వరిసాగు చేస్తున్నాను. లాభమా..నష్టమా అనేది ఇప్పటి వరకు చూడలేదు. వ్యవసాయం చేయడం వల్ల పదిమందికి పని కల్పిస్తున్నా... వేల మందికి ఆహారం అందిస్తున్నా అనే సంతృప్తితో ముందుకు సాగుతున్నాను. నాలాంటి ఎంతో మంది రైతులు ఇప్పటికీ ప్రేమతో వ్యవసాయం చేస్తున్నారు. నేను న్యాయవిద్యను అభ్యసించినా వ్యవసాయంపై ఉన్న మక్కువతో ఈ రంగంలో స్థిరపడ్డాను. పచ్చని పొలాల మధ్య గడిపితేనే రోజు గడిచినట్లుగా ఉంటుంది. కూలీల కొరత వల్ల చాలా సందర్భాల్లో ఇబ్బంది పడ్డాం. ముఖ్యంగా ఉపాధిహామీ పథకం వల్ల కూలీల కొరత తీవ్రంగా పెరిగిపోయింది. యంత్రాల రాక వల్ల కొంత మేలు జరిగిందనే చెప్పాలి. లేదంటే కూలీలు లేక వ్యవసాయం మరింత తగ్గిపోయి ఉండేది.

- భోగిరెడ్డి నాగేశ్వరరావు, రైతు, దిర్సుమర్రు.

వ్యవసాయ ఆధారిత దేశం

మొదటి నుంచి మనది వ్యవసాయాధారిత దేశం. ఏ రంగంలో ఉన్నవారైనా ఆహారం లభించాలంటే వ్యవసాయ రంగం బాగుండాలి. ఎన్నో వ్యయప్రయాసలను తట్టుకుంటూ వ్యవసాయం చేస్తున్న రైతులకు అందరూ అండగా నిలవాలి. ముఖ్యంగా ప్రభుత్వాలు సరైన గిట్టుబాటు ధర కల్పించాలి. ఏడాది పొడవునా కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోతే వ్యవసాయం ఎలా చేయగలరనే విషయం ఆలోచించాలి. కొన్నిదేశాల్లో మొదటి ప్రాధాన్యం వ్యవసాయానికే ఇస్తారు. నేను 15 ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేస్తున్నాను.. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కువ సమయం పొలంలోనే గడుపుతాను. డిగ్రీ చదువుకున్నాను. ఉద్యోగం చేసుకునే అవకాశం వచ్చినా వద్దనుకున్నాను. కారణం అందరికీ అన్నం పెట్టే వ్యవసాయమంటేనే మక్కువ.

- కొత్తపల్లి సుబ్బారాయుడు, రైతు, గునుపూడి.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.