close

బుధవారం, ఆగస్టు 21, 2019

ప్రధానాంశాలు

ఓఆర్‌ఆర్‌ వరకు..‘భాగ్యం’

 కార్పొరేషన్ల ఏర్పాటుతో విశ్వనగరం దిశగా..
 ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి అడుగులు
మహానగరం నిర్మాణానికి పెరిగిన అవకాశాలు
ఈనాడు, హైదరాబాద్‌

మహానగర విస్తరణకు నగరం చుట్టూ ఏడు నగరపాలక సంస్థల ఏర్పాటు ఊపిరి పోసింది. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి మార్గం సుగమమైంది. నిర్మాణ రంగం కొత్త పుంతలు తొక్కనుంది. పరిశ్రమలు, వాణిజ్య భవనాలు నలుమూలలకు విస్తరిస్తాయి. తాగునీటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. మురుగునీటి వ్యవస్థ తన పరిధిని విస్తరించుకుంది. వాటితోపాటు ప్రజారవాణా పరుగులు తీయాల్సిన అవశ్యకత ఏర్పడుతుంది. మౌలిక సౌకర్యాలు మెరుగుపడి విశ్వనగరం కలలు సాకారం అవుతాయి. ఇలాంటి మరెన్నో కొత్త మార్పులకు కార్పొరేషన్ల ఏర్పాటు నాంది కానుంది. దేశంలోని మెట్రో నగరాల్లో హైదరాబాద్‌ తిరుగులేనిదిగా ఎదిగేందుకు అవకాశాలు పెరిగాయి.

హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థ(జీహెచ్‌ఎంసీ) పరిధి 625చ.కి.మీ. ప్రస్తుత నగర జనాభా 1.2 కోట్లు. కానీ ఇదే పూర్తి నగరం కాదు. గ్రేటర్‌ సరిహద్దు వరకు మాత్రమే. అసలైన నగరం మరో 2వేల చదరపు కిలోమీటర్ల వెలుపలి వరకు ఇప్పటికే విస్తరించింది. అక్కడ పంచాయతీలు, మున్సిపాలిటీల రూపంలో పాలన సాగుతోంది. పూర్తిగా అని చెప్పలేకపోయినా.. జీహెచ్‌ఎంసీ బయట చాలా వరకు ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి లేదనే చెప్పాలి. అధికారులు, సిబ్బంది కొరతతో అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయి. ఆక్రమణలను నియంత్రించే యంత్రాంగం కరవైంది. కింది స్థాయి సిబ్బంది ఉన్నతాధికారులను చెప్పుచేతల్లో పెట్టుకుని.. నకిలీ నిర్మాణ అనుమతులు మంజూరు చేయడం, పన్ను వసూళ్లను పక్కదారి పట్టించడం, ఆక్రమణలను ప్రోత్సహించడం, ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడం వంటి ఘటనలు అనేకం వెలుగు చూస్తేనే ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో మురుగునీటి పారుదల వ్యవస్థ నామమాత్రంగా ఉంది. తాగునీటి సరఫరాలోనూ స్థానిక అధికార యంత్రాంగం కొంత వరకే సఫలమవుతోంది. అన్నింటికీ మించి నిధుల్లేక ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి పనులు అంతంతమాత్రంగా ఉన్నాయి. సరైన రోడ్లు లేవు. వరద నీటి కాలువలు కనిపించవు. వాటన్నింటినీ పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోంది. ఇటీవలే గ్రామపంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చిన సర్కారు, అంతలోనే పురపాలక సంస్థలకు నగరపాలక సంస్థలుగా పదోన్నతి ఇచ్చింది. ప్రస్తుతం నడుస్తోన్న వార్డుల విభజన, ఇతరత్రా సమస్యలు త్వరలో పరిష్కారం అవుతాయని, అనంతరం అభివృద్ధి పట్టాలెక్కుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
నిధుల కేటాయింపులకు భరోసా..
నగరపాలక సంస్థ ఏర్పాటైతే అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపులు సులువు అవుతాయి. పాలక మండలి, స్థాయి సంఘం, మేయర్‌, కమిషనర్లకు వేర్వేరు స్థాయిల్లో అభివృద్ధి పనులను ఆమోదించే వెసులుబాటు ఉంటుంది. ఆదాయ పెంపు కోసం, పారిశుద్ధ్యం మెరుగయ్యేందుకు, సరైన రోడ్ల గురించి పాలక మండలిలో చర్చలు జరుగుతాయి. సర్కారు కార్పొరేషన్ల ఏర్పాటు విషయంలో నిర్ణయం తీసుకున్నట్లే, అధికారుల నియామకాల్లోనూ వేగంగా స్పందిస్తే కొత్త కార్పొరేషన్లలో మార్పు తప్పక కనిపిస్తుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
జవహర్‌నగర్‌ ముందున్న సవాళ్లు..
ప్రభుత్వ భూముల్లో ఏర్పాటైన కాలనీలే నేటి నగరపాలక సంస్థ ఏర్పాటుకు బీజం వేశాయి. సుమారు 333 ఎకరాల్లో 28 వార్డులతో విస్తరించిన జవహర్‌నగర్‌లో 2లక్షల వరకు జనాభా ఉన్నారు. పంచాయతీగా ఏర్పాటైన నాటి నుంచే స్థానికంగా అనేక సమస్యలు ఉన్నాయి. చెత్త డంపింగ్‌యార్డు వాటిలో ప్రధానమైనది. కలుషిత భూగర్భ జలాలు, మౌలిక సౌకర్యాల కొరత స్థానికులను వేధిస్తున్నాయి. కార్పొరేషన్‌ ఏర్పాటుతో ఆయా సమస్యలు తగ్గుముఖం పట్టేనా అని స్థానికులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం స్థానికంగా ఉన్న 33వేల నిర్మాణాల ఆస్తిపన్ను, ఇతర మార్గాల ద్వారా పురపాలక సంస్థకు దాదాపు రూ.33 కోట్ల ఆదాయం వస్తుంది.
పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం..
బండ్లగూడ జాగీర్‌లో(22వార్డులు) ప్రభుత్వ భూములు వృథాగా ఉన్నాయని, వాటిలో ఐటీ పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని ఏడాదిన్నర క్రితం అప్పటి పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. అనంతరం మళ్లీ ఆ విషయం చర్చకు రాలేదు. అయినప్పటికీ ఓఆర్‌ఆర్‌కి కూతవేటు దూరంలో ఉన్న బండ్లగూడ పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలమని, నివాస, వాణిజ్య సముదాయాలకు స్వర్గధామమని అధికారులు చెబుతున్నారు. తాగునీటి సరఫరాను మెరుగుపరిస్తే అధునాతన నగరంగా అవతరిస్తుందంటున్నారు. ప్రస్తుత జనాభా 1.5లక్షలుకాగా, 32చ.కి.మీల విస్తీర్ణంలో 22,881 నిర్మాణాలున్నాయని, పురపాలక సంస్థ వార్షిక ఆదాయం రూ.20కోట్లు అని గుర్తుచేస్తున్నారు.
వడివడిగా అడుగులేస్తోన్న నిజాంపేట..
నగరంలో కలిసిపోయిన నిజాంపేట అభివృద్ధివైపు వడివడిగా అడుగులేస్తోంది. పురపాలక సంస్థ నుంచి నగరపాలక సంస్థగా పదోన్నతి పొందినట్లే.. నిధుల కేటాయింపు, ఆదాయం పెంపుతో అభివృద్ధిని ఉరకలెత్తిస్తుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంతంలో సగటున ఒక్కో చదరపు కిలోమీటరుకు రూ.కోటి ఆదాయం వస్తుందని, మౌలికసౌకర్యాలు మెరుగుపడితే ఆదాయవనరులు మరింతగా వృద్ధి చెందుతాయని అంటున్నారు. 33వార్డులున్న నిజాంపేటలో 2.5లక్షల మంది నివసిస్తున్నారు. కొత్తగా ఏర్పాటైన కార్పొరేషన్ల అన్నింటికంటే అధికంగా నిర్మాణాలు 52,500 ఉన్నాయి. పురపాలకసంస్థ వార్షిక ఆదాయం రూ.29 కోట్లు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, జలమండలి, జీహెచ్‌ఎంసీతో సమన్వయం చేసుకుంటూ రోడ్లు, తాగునీటి వసతి, భవన నిర్మాణ రంగాన్ని అభివృద్ధి చేసుకుంటామని అధికారులు చెబుతున్నారు.
మీర్‌పేట స్వరూపం మారాలి..
మీర్‌పేట, జిల్లెలగూడ పురపాలక సంస్థలను కలిపి ప్రభుత్వం మీర్‌పేట కార్పొరేషన్‌గా ఏర్పాటు చేసింది. దాంతో వార్డులు 46కు పెరిగి జనాభా 1.65లక్షలకు పెరిగారు. నిర్మాణాలు 20,200కు పెరిగాయి. దాంతో అరకొరగా ఉన్న సౌకర్యాలు మరింత అధ్వానంగా మారాయి. రహదారులు కుంచించుకుపోయాయి. ప్రధాన నీటి వనరులైన పెద్దచెరువు, మంత్రాల చెరువు, సందెన చెరువులు కాలుష్య కాసారంలా మారాయి. పార్కులు లేవు. అవసరమైన తాగునీటిలో 30శాతమే సరఫరా అవుతుంది. అది కూడా మూడు రోజులకోసారి నీళ్లు ఇస్తున్నారు. ప్రస్తుత పురపాలక సంస్థ 1,604 ఎకరాల్లో విస్తరించి ఏడాదికి రూ.11.2 కోట్ల ఆదాయం ఆర్జిస్తుందని, నగరపాలక సంస్థ కొలువుదీరితే.. తమ ప్రాంతం కష్టాల నుంచి గట్టెక్కుతుందని స్థానికులు ఆశిస్తున్నారు.
తూర్పున రయ్‌ రయ్‌..
వరంగల్‌ జాతీయ రహదారికి ఓవైపు ఉండే పిర్జాదిగూడ(26వార్డులు)లో 1.22 లక్షల జనాభా ఉన్నారు. సుమారు 23 వేలకుపైగా ఉన్న నిర్మాణాల ఆస్తిపన్ను, ఇతర మార్గాల ద్వారా రూ.30 కోట్ల ఆదాయం వస్తుంది. జాతీయ రహదారికి మరోవైపు 20.53 చ.కి.మీలలో విస్తరించిన బోడుప్పల్‌(28వార్డులు)లో 1.6 లక్షల జనాభా ఉంటుందని అంచనా. 26 వేలకుపైగా నిర్మాణాలుండగా, ప్రస్తుత పురపాలక సంస్థ వార్షిక ఆదాయం దాదాపు రూ.30కోట్లుగా ఉంది. ప్రభుత్వం నగరాన్ని తూర్పు దిశలో విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకోవడంతో.. ఈ రెండు నగరపాలక సంస్థలకు ప్రాముఖ్యత పెరగనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. స్థిరాస్తి వ్యాపారం పెరుగుతుందని, మౌలిక సౌకర్యాల కల్పనకు సర్కారు అధిక నిధులు కేటాయిస్తుందని ఆశిస్తున్నారు.
వాటిని వదిలేయడం వెనుక?
ఏప్రిల్‌, 2019లో పురపాలక సంస్థలుగా అవతరించిన నిజాంపేట, పిర్జాదిగూడ, మీర్‌పేట, జల్‌పల్లి, బడంగ్‌పేట, బండ్లగూడ, జవహర్‌నగర్‌ ప్రాంతాలు, చాలా కాలం కింద పురపాలక సంస్థగా ఏర్పడిన బోడుప్పల్‌ సర్కారు తాజా నిర్ణయంతో నగరపాలక సంస్థలుగా పదోన్నతి పొందాయి. అయినప్పటికీ ఇబ్రంహీంపట్నం, రాజేంద్రనగర్‌, తదితర మహేశ్వరం శాసనసభ నియోజకవర్గాలతోపాటు ఇతర ప్రాంతాల్లో పురపాలక సంస్థలు అలాగే కొనసాగుతున్నాయి. వాటిని కూడా కొత్తగా ఏర్పాటైన నగరపాలక సంస్థలతో కలిపి ఉండాల్సిందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నగరంలో మమేకమైన మణికొండ, నార్సింగి పురపాలక సంస్థలపై సర్కారు నిర్ణయం తీసుకోకపోవడంలో లోగుట్టు తెలియట్లేదంటున్నారు.
రూపుమారేనా..
ఆదిభట్ల టీసీఎస్‌ కంపెనీ, నిర్మాణంలోని ఇతర ప్రత్యేక ఆర్థిక మండళ్లకు బడంగ్‌పేట సమీపంలో ఉంటుంది. ఐటీ ఉద్యోగులు చాలా వరకు బడంగ్‌పేట, నాదర్‌గుల్‌ ప్రాంతాల్లో నివాసం ఉంటారు. స్థానిక రహదారులు, తాగునీటి వసతి మాత్రం దారుణంగా ఉన్నాయి. మురుగు బయటకు వెళ్లే దారి లేదు. నీటి కుంటల్లో జమ అవుతుంది. మురికివాడలు వెలుస్తున్నాయి. ఇరుకైన రహదారులతో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతున్నాయి. శంషాబాద్‌ విమానాశ్రయానికి, ఓఆర్‌ఆర్‌కు సమీపంలో ఉన్న బడంగ్‌పేట కార్పొరేషన్‌గా అవతరించడంతో ఆయా దీర్ఘకాల సమస్యలు తగ్గుముఖం పడతాయని అధికారులు చెబుతున్నారు. 75 చ.కి.మీలలో విస్తరించిన బడంగ్‌పేటలో(32వార్డులు) జనాభా 1.5 లక్షలుండగా, ఆదాయం రూ.12 కోట్లుగా ఉంది.

 శాస్త్రీయంగా అభివృద్ధి జరుగుతుంది...
- ఎస్‌.శ్రీనివాసరెడ్డి, జెడ్సీ, జీహెచ్‌ఎంసీ, బడంగ్‌పేట మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి

శివారు గ్రామాల్లో జనాభా విపరీతంగా పెరుగుతోంది. 2011లో 30వేల మంది నివసించిన ప్రాంతంలో ఇప్పుడు లక్షన్నరకుపైగా జనం ఉన్నారు. ఆ మేరకు మౌలిక సౌకర్యాలను మెరుగు పరచాలంటే ప్రణాళిక అవసరం. శాస్త్రీయంగా నిధులను వెచ్చించాలి. వాటిని దృష్టిలో ఉంచుకుని సర్కారు పురపాలక సంస్థలను కార్పొరేషన్లుగా మార్చింది. దాని వల్ల కేంద్ర ప్రభుత్వ పథకాల ఫలాలు, 14వ ఆర్థిక సంఘం నిధులు సమకూరుతాయి. కార్పొరేషన్లు స్వతహాగా నిధులు సమీకరించుకుని ఆర్థిక క్రమశిక్షణతో ఆదాయ వనరులను మెరుగు పరుచుకుంటాయి. కొత్త పురపాలక చట్టంతో అవినీతికి అడ్డుకట్టపడి, నాణ్యమైన పాలన ప్రజలకు చేరువ అవుతుంది. కార్పొరేషన్ల మధ్య సమన్వయం కుదురుకుని నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది.

 

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.