close

సోమవారం, ఆగస్టు 26, 2019

ప్రధానాంశాలు

జాతరొచ్చింది!

నేడు తొలి బోనం సమర్పించనున్న మంత్రి తలసాని

బన్సీలాల్‌పేట్‌, న్యూస్‌టుడే: ఆషాఢమాస బోనాలకు సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి ఆలయం సిద్ధమైంది. ఉత్సవాల్లో తొలిరోజు ఆదివారం తెల్లవారుజామున 4గంటల నుంచే ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ కుటుంబ సభ్యులు మహాకాళికి తొలి బోనం, వెండి తొట్టెలు సమర్పించనున్నారు. మాజీ ఎంపీ కవిత బోనం తీసుకొస్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, నేతలు, ఆయా రంగాల ప్రముఖులు అమ్మవారిని దర్శించుకోనున్నారు.

శుక్రవారం మినీ జాతర రోజు ప్రారంభమైన భక్తుల రద్దీ అర్ధరాత్రి ఆలయం మూసే వరకూ కొనసాగింది. శనివారం తెల్లవారుజాము నుంచే ఆలయ పరిసరాలు జాతరను తలపించాయి. జనరల్‌ బజార్‌, టొబాకో బజార్‌, ఎంజీ రోడ్డు, ఆర్పీ రోడ్డు, బాటా నుంచి క్యూలైన్లు ఏర్పాట్లు చేశారు. రంగురంగుల పువ్వులతో ప్రధాన ముఖద్వారం నుంచి ఆలయం వరకూ అలంకరించారు. గుడి ఆవరణలో క్యూలైన్లను కోల్‌కతా బృందాల సాయంతో ముస్తాబు చేయిస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఎక్కడికక్కడ సూచిక బోర్డులు అమర్చారు. మాతాంగేశ్వరీ వద్ద బోనం సమర్పించేలా ఏర్పాట్లు చేశారు. వీఐపీల దర్శనం కొనసాగుతున్న సమయంలోనూ సర్వదర్శనానికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు.

బోనాలతో భారీ ఊరేగింపు
సికింద్రాబాద్‌ సిటీ లైట్‌ కూడలి, ఆదయ్యనగర్‌ నుంచి ఆదివారం మధ్యాహ్నం మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ నేతృత్వంలో డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు ముఖ్య అతిథిగా భారీ ఊరేగింపు ప్రారంభం కానుంది. ఒగ్గు డోలు, డప్పు వాద్యాలు, సుమారు 600 మంది కళాకారులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. 1008 మంది మహిళలు బోనాలతో తోడుగారా మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత అమ్మవారికి బోనం సమర్పించనున్నారు. ఈ ఊరేగింపులో బంగారు బోనాన్ని భక్తులందరూ తిలకించేలా ఎత్తయిన వాహనంలో తీసుకురానున్నారు. ఆర్పీ రోడ్డు పెద్దమ్మ గుడి, సికింద్రాబాద్‌ బాటా, సుభాష్‌రోడ్డు మీదుగా మహాకాళి ఆలయానికి చేరుకోనుంది. కళాకారుల సమన్వయ బాధ్యతలను సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, వరంగల్‌, నల్గొండ, సిద్దిపేట, మెదక్‌, రంగారెడ్డి జిల్లాల నుంచి కళాకారులు పాల్గొననున్నట్లు హరికృష్ణ తెలిపారు.

అమ్మ సన్నిధిలో నేడు
* 4.00గంటలకు - ఆలయం తెరుస్తారు.
* 4.05- మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తొలి బోనం, వెండి తొట్టెల సమర్పణ.
* 4.10 నుంచి సర్వ దర్శనం ప్రారంభం.
* మధ్యాహ్నం 3.30- మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత బోనం సమర్పణ.
* రాత్రి 8.00- ఉప సభాపతి పద్మారావుగౌడ్‌ ఆధ్వర్యంలో ఫలహార బండ్ల ఊరేగింపు.

దివ్య మంగళ స్వరూపం...
మహాకాళి అమ్మవారు బంగారు కిరీటం, వజ్రాల ముక్కుపుడక, వజ్రాల బొట్టు, బంగారు కాసుల దండ, లక్ష్మీలాకెట్టు, మంగళసూత్రాలతో దివ్యమంగళ స్వరూపిణిగా ఆదివారం భక్తులకు దర్శనమివ్వనున్నట్లు పూజారులు తెలిపారు. ఒక చేతిలో కుంకుమ భరిణ, మరో చేతిలో బంగారు ఖడ్గంతో సింహవాహినీగా అలంకరించనున్నారు. గర్భగుడిలో అమ్మవారి మండపంలో రంగురంగుల పూలతో సర్వాంగ సుందరంగా అంతరాలయాన్ని ఇప్పటికే తీర్చిదిద్దారు.

వెండి ఫలహార బండి సిద్ధం
రెజిమెంటల్‌బజార్‌: ఆదివారం నిర్వహించనున్న ఫలహార బండ్ల ఊరేగింపు కోసం ఉపసభాపతి పద్మారావుగౌడ్‌ వెండి ఫలహార బండి సిద్ధం చేయిస్తున్నారు. పుణె, ముంబయి నుంచి కళాకారులను పిలిపించి రథాన్ని వెండి తొడుగులతో అలంకరిస్తున్నారు. మహాకాళిని దర్శించుకునేందుకు ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులు రానున్నారు. అనంతరం సమీపంలోని ముత్యాలమ్మ అమ్మవారిని కూడా ముఖ్యమంత్రి దర్శించుకోనున్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.