close

మంగళవారం, ఆగస్టు 20, 2019

ప్రధానాంశాలు

సరిహద్దులు దాటిన సంపద 

 నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు

 తమిళనాడుకు యథేచ్ఛగా తరలుతున్న గ్రావెల్‌

 

కొండను తవ్విన దృశ్యం

పొరుగింటి పుల్లకూర రుచి అన్న చందంగా.. తమిళనాడు వ్యాపారులు ఆంధ్రాలోని ఆస్తులపై కన్నేశారు.. ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు.. అక్కడి వ్యాపారులకు రాష్ట్రంలోని అధికారుల అండదండలు తోడుకావడంతో ఏపీలోని సంపద యథేచ్ఛగా తరలిపోతోంది.. అక్రమ రవాణా నివారణకు అధికారులు చర్యలు తీసుకున్నాం..అని చెబుతున్నా..మా పని మాదే అన్నట్లు వ్యాపారులు గ్రావెల్‌ రవాణా చేస్తున్నారు. అనుమతిచ్చిన కొండ మట్టిని ఆయా రాష్ట్రాల అవసరాలకే ఉపయోగించాలి. కానీ విజయపురంలో ఇందుకు విరుద్ధంగా తమిళనాడుకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.

న్యూస్‌టుడే, పుత్తూరు: తమిళనాడు సరిహద్దులో ఉన్న విజయపురం మండలం నుంచి గత కొన్ని నెలలుగా గ్రావెల్‌ అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా అధికారులు అనుమతులు ఇచ్చేయడంతో.. వ్యాపారులు ప్రకృతి సంపదను కొల్లగొట్టే పనిలో పడ్డారు. తమిళనాడు, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో గ్రావెల్‌ క్వారీలు పొంది..తమిళనాడుకు తరలించి ఆదాయం గడిస్తున్నారు. ఫలితంగా జిల్లాలో భూగర్భ జలమట్టం పడిపోతోంది. వర్షాలు పడిన సమయంలో కొండలు, గుట్టలు నీటిని నిలువరించడం వల్ల భూగర్భజలాలు పెరిగేవి. అవి కాస్త నేడు కనుమరుగవుతూ భఫూగర్భ జలమట్టాలు అడుగంటిపోతున్నాయి.

నీటి కష్టాలు తప్పవు

ప్రస్తుతం విజయపురం మండలంలో గ్రావెల్‌ క్వారీకి ఇచ్చిన కొండ నుంచి వచ్చే నీటి ద్వారా సుమారు ఏడు చెరువులు నిండుతున్నాయి. నీటిని నిలువరించేందుకు అక్కడక్కడ చెక్‌డ్యామ్‌లు ఏర్పాటు చేశారు. గ్రావెల్‌ క్వారీ నిర్వహించడం వల్ల భవిష్యత్తులో ఈ ప్రాంతంలో నీటి కష్టాలు తప్పవని ప్రజలు వాపోతున్నారు.

నివాసా ప్రాంతాలున్నా...

విజయపురం గ్రామ రెవెన్యూ లెక్క దాఖలాల్లో సర్వే నంబరు 173లో 779.94 ఎకరాల కొండ ఉంది. దీనిపై పక్క రాష్ట్రం వారి కన్ను పడింది. తమిళనాడు సరిహద్దున ఉండడంతో గ్రావెల్‌ క్వారీ కోసం దాదాపు 15 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే ఇద్దరికి అనుమతులు వచ్చాయి. అనుమతులు పొందిన వారు యథేచ్ఛగా ప్రకృతి సంపదను తమిళనాడుకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. క్వారీకి సమీపంలో ఎలాంటి నివాస ప్రాంతాలు లేవని అధికారులు ధ్రువీకరించడం గమనార్హం.కానీ సమీపంలోనే అమ్మగుంట, అమ్మగుంట ఎస్టీ కాలని ఉంది. కిలోమీటరు పరిధిలో రెవెన్యూ కార్యాలయం, పోలీస్‌స్టేషన్‌, ఉన్నత పాఠశాల ఉన్నాయి. అయినా అధికారులు అనుమతులు ఇవ్వడం గమనార్హం.

కొండను తవ్వి... దారి ఏర్పాటు చేసి..

క్వారీకి అనుమతులు ఇచ్చే సమయంలో అన్ని సక్రమంగా ఉన్నాయో..లేదో అధికారులు పరిశీలించాలి. క్వారీ నిర్వహించడం వల్ల భవిష్యత్తులో ప్రకృతికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. అవేమీ లేకనే అనుమతులు ఇచ్చారనే విమర్శలున్నాయి. ఎక్కడైన క్వారీ ఇవ్వాలంటే కింది నుంచి తవ్వుకుంటూ వెళ్లాలి. అదే విజయపురంలో అనుమతి ఇచ్చిన క్వారీ కొండపైన ఇచ్చారు. దీంతో కొండను తవ్వి దారి ఏర్పాటు చేశారు.

తమిళనాడులో ..

తమిళనాడు రాష్ట్రంలో ఇసుక, గ్రావెల్‌ ఇష్టానుసారంగా తీస్తే ఒప్పుకోరు. అక్కడ అక్రమంగా ఇసుక తరలించినా, గ్రావెల్‌ తీసుకెళ్లినా క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తారు. దాంతో ఇక్కడి క్వారీ యజమానులతో ఒప్పందం కుదుర్చుకుని తమిళనాడుకు తరలిస్తున్నారు. ఇప్పటికే ఇసుక మొత్తం తరలించడంతో సమీప గ్రామాల్లో భూగర్భజలాలు పడిపోయాయి. ప్రస్తుతం కొండలను కూడా వదలడం లేదు. భవిష్యత్తులో మరింత ప్రమాదం పొంచి ఉంది.

అఖిలపక్షం ఆధ్వర్యంలో పోరాటం..

ప్రస్తుతం ఇచ్చిన కొండను తవ్వితే విజయపురం మేజర్‌ పంచాయతీలో అన్ని కష్టాలేనని.. వెంటనే రద్దు చేయాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో అప్పటి కలెక్టర్‌ ప్రద్యుమ్నను కలిసి వినతి పత్రం అందజేశారు. ఎన్నికలు.. రావడం.. రాష్ట్రంలో నూతన ప్రభుత్వ ఏర్పడటం.. కలెక్టర్‌ బదిలీపై వెళ్లడంతో వినతి మరుగున పడింది. అఖిలపక్షం నేతలు మాత్రం క్వారీని రద్దు చేసే వరకు ఉద్యమిస్తామని చెబుతున్నారు.

విజయపురం మండలం నుంచి నారాయణపురం, కనకమ్మసత్రం మీదుగా తమిళనాడుకు నిత్యం ఓ క్వారీ నుంచి 50 ట్రిప్పులు, మరో క్వారీ నుంచి 30 ట్రిప్పులు వెళ్తున్నాయి. ఒక్కో ట్రిప్పు తమిళనాడులో రూ.3,500 నుంచి రూ.4వేలకు విక్రయిస్తున్నారు. దూరాన్ని బట్టి ధరను నిర్ణయించి తరలిస్తున్నారు. ఖర్చు రూ.1500 వరకు అవుతుంది. ట్రిప్పునకు రూ.2వేల వరకు ఆదాయం వస్తున్నట్లు సమాచారం.

ఇక ఎవరికీ అనుమతులు ఇవ్వం..

గతంలో పనిచేసిన తహసీల్దార్లు గ్రావెల్‌ క్వారీకి అనుమతి ఇచ్చారు. ఇకపై ఎవరు దరఖాస్తు చేసుకున్నా అనుమతులు ఇవ్వం. ప్రస్తుతం ఉన్న క్వారీ వల్ల భవిష్యత్తుల్లో ఇబ్బందులు ఉన్నట్లు ఉన్నతాధికారులకు నివేదించాం. వారే రద్దు చేయాలి. తమ చేతుల్లో ఏమీ లేదు.

-గిరిరాజు, తహసీల్దార్‌, విజయపురం

విజయపురం మండలంలో గ్రావెల్‌ క్వారీ నిర్వహిస్తున్న కొండ ఇదే

మరిన్ని వార్తలు

ప్రయోగంలో నిర్లక్ష్య ఫలితం!

శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని పరీక్షల కార్యాలయంలో సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి వెలుగుచూసింది. వారి నిర్వాకంతో ఏకంగా 250 మందికి పైగా విద్యార్థులు బాధితులుగా మిగిలిపోయారు. వివరాల్లోకి వెళితే.. ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో ఎస్వీయూ అనుబంధ డిగ్రీ కళాశాలల్లో డిగ్రీ రెండో సెమిస్టర్‌ పరీక్షలు జరిగాయి. పరీక్షలకు సంబంధించిన ప్రాక్టికల్‌ మార్కులను ఆయా కళాశాలల యాజమాన్యాలు ఎస్వీయూకు పంపితే.. వాటిని థియరీ పరీక్షల మార్కులతో కలిపి తుది ఫలితాలను విడుదల చేయాల్సి ఉంటుంది. జిల్లావ్యాప్తంగా ఎస్వీయూ అనుబంధ కళాశాలల నుంచి ప్రాక్టికల్‌ మార్కులు వచ్చాయి. కొన్ని కళాశాలల

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.