close

గురువారం, ఆగస్టు 22, 2019

ప్రధానాంశాలు

విద్యార్థులకు ఆనందవరం

 ఏకాగ్రతను పెంచే కృత్యాలతో నూతన ఒరవడి

 ఒత్తిడి లేని విద్యే ఆనందవేదిక లక్ష్యం..!

 
శ్రీనగరంలో విద్యార్థులతో కృత్యం చేయిస్తున్న ఉపాధ్యాయుడు

 

ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఒత్తిడి లేని, విలువలతో కూడిన ఆనందకరమైన విద్యను అందించేందుకు రూపొందించిన ఆనంద వేదిక కార్యక్రమాలను రోజూ ఉదయం ప్రార్థన ముగిసిన వెంటనే మొదటి పీరియడ్‌లో 30 నిమిషాల పాటు నిర్వహిస్తున్నారు.

● సోమవారం మైండ్‌ఫుల్‌ యాక్టివిటీ, మంగళ, బుధవారాల్లో కథా సమయం, గురు, శుక్రవారాల్లో కృత్య సమయం, శనివారం వ్యక్తీకరణ అంశాలపై కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.● నాలుగు స్థాయిల్లో పాఠ్యాంశాల రూపంలో బోధన కొనసాగుతోంది. ఒకటో స్థాయిలో 1, 2, రెండో స్థాయిలో 3, 4, 5,మూడో స్థాయిలో 6, 7, 8, నాలుగో స్థాయిలో 9, 10 తరగతులు ఉండేలా విభజించారు.

సరదా సంభాషణతో ప్రారంభం

కొత్త విధానంలో ఉపాధ్యాయులు తరగతి గదిలోకి రాగానే విద్యార్థులతో సరదాగా సంభాషిస్తున్నారు. వారికి కథలు చెబుతూ కుశల ప్రశ్నలు వేస్తూ ఏకాగ్రత పెంచే కృత్యాలకు అలవరుస్తున్నారు. ఓ అంశాన్ని విద్యార్థులకు వివరిస్తూనే అందులోంచి బోధనను ప్రారంభిస్తున్నారు. ప్రేమ, వాత్సల్యం, గౌరవం, విధేయత, నమ్మకం, సానుభూతి, అభినందన, ఏకత్వం, నిజాయతీ -జ్ఞానం, అంగీకారం వంటి తొమ్మిది విలువలపై నాలుగేసి చొప్పున కథలు చెప్పడం, కథలకు సంబంధించిన కృత్యాల ద్వారా విద్యార్థుల నుంచి ప్రతిస్పందన రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.

‘అనగనగా ఓ రాజు’.. ‘తాబేలు కుందేలు పోటీ’.. ‘ఆవుపులి కథ’... ‘పేదరాశి పెద్దమ్మ’.. తదితర కథలు జీవిత సత్యాలను బోధిస్తాయి. నీతి, సృజనాత్మకతలను పెంచుతాయి. ఇంట్లో తాతయ్య, నానమ్మలు చెప్పిన నీతి కథలు చిన్నారుల మనసుల్లో చెరగని ముద్ర వేసేవి. తద్వారా సత్ప్రవర్తన, మంచీ చెడుల విశ్లేషణకు ఎంతగానో దోహదపడేవి. ప్రస్తుతం పాఠశాలల్లో, ఇళ్లల్లో అలాంటి వాతావరణం కనుమరుగయ్యింది. చదివిన పాఠాలే మళ్లీ మళ్లీ చదవడం, రాసిన పాఠ్యాంశాల మీదే తరచూ పరీక్షలు రాయడం, మార్కులు, ర్యాంకుల వేటలో ఉరుకులు, పరుగులు తీస్తున్నారు. గ్రేడుల పోటీలో తమ అందమైన బాల్యదశను విద్యార్థులు ఆందోళన, ఒత్తిళ్ల మధ్యనే దాటేస్తున్నారు. ఈ తరహా వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో ‘ఆనంద వేదిక’ పేరిట ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. విద్యతో పాటు ఆదర్శ నడవడిక, సేవాతత్పరత, నాయకత్వ లక్షణాలను పెంచి విద్యాప్రగతికి బీజాలు వేస్తున్నారు. ఏకాగ్రతను పెంచే కృత్యాలతో నూతన ఒరవడిని సృష్టించడం... ఒత్తిడి లేని విద్యే ఆనంద వేదిక లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.

- న్యూస్‌టుడే, మహానంది

 

విద్యార్థుల్లో ఆసక్తి పెరిగింది - శ్రీనివాసరాజు ఉపాధ్యాయుడు

కాలక్షేపంగా కథలు నేర్చుకోవడం, చదవడమే కాకుండా కథలో దాగి ఉన్న నీతి సూత్రాన్ని మేము తెలుసుకుంటున్నాం, వారికి నేర్పుతున్నాం. బయట జరిగే ఎన్నో విషయాలు, సామాజిక అంశాలు ఆకట్టుకుంటున్నాయి. వ్యక్తీకరణకు తోడ్పడే అంశాలతో ఆలోచనా సామర్థ్యం, యోగాతో ఆరోగ్యం చేకూరుతాయి.

తరగతులను పర్యవేక్షిస్తున్నాం - రామసుబ్బయ్య, మండల విద్యాధికారి మహానంది మండలం

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెంచడంతో పాటు నైతిక విలువలను నేర్పించేందుకు ఆనంద వేదిక తోడ్పడుతుంది. విద్యార్థులు ఉత్సాహంగా తరగతులకు హాజరవుతున్నారు.

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.