close

శనివారం, ఆగస్టు 24, 2019

ప్రధానాంశాలు

పెరిగిన హోదా.. తీరని వ్యథ

సిబ్బంది కొరతతో పురపాలికలో ఇబ్బందులు

బాలాజీనగర్‌లో కొరవడిన పారిశుద్ధ్య నిర్వహణ

పరిగి, న్యూస్‌టుడే: మేజర్‌ పంచాయతీ నుంచి పురపాలక సంఘంగా స్థాయి పెరిగినా సమస్యలు మాత్రం నిత్యం ప్రజలను వేధిస్తూనే ఉన్నాయి. సిబ్బంది కొరత కారణంగా పౌర సేవలకు తీరని విఘాతం కలుగుతోంది. కనీసం ఉన్నవారు కూడా విధులకు సక్రమంగా హాజరు కాకపోవడంతో రానురాను సమస్యలు మరింత జటిలంగా మారుతున్నాయి. పరిగి మున్సిపాలిటీగా మారి ఏడాది గడిచినా పట్టణ సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. స్థానికంగా నెలకొన్న సమస్యలపై ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం...

గతంలో 9వార్డులు ఉండగా పెరిగిన ఓటర్లను దృష్టిలో ఉంచుకుని 15వార్డులకు పెంచారు. మున్సిపల్‌ కమిషనర్‌గా తేజిరెడ్డికి పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించారు. కానీ సిబ్బంది నియామకంలో జరుగుతున్న జాప్యం పట్టణాభివృద్ధికి తీరని శాపంగా మారింది. ప్రస్తుతం వికారాబాద్‌లో పనిచేస్తున్న పట్టణ అభివృద్ధి ఇంజినీరు వికారాబాద్‌తో పాటు పరిగి, శంకర్‌పల్లి పురపాలక సంఘాలకు అదనపు బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. టౌన్‌ప్లానింగ్, బిల్డింగ్‌ సిబ్బందిదీ అదే పరిస్థితి. సీనియర్‌ అకౌంటెంట్‌ ఎవరూ లేరు. స్థానికంగా సమస్యలు తీరాలంటే రెగ్యులర్‌ ఇంజినీరుతో పాటు టౌన్‌ ప్లానింగ్‌ సూపర్‌వైజర్‌ పోస్టులను తక్షణం భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. పట్టణ జనాభా 18,241 మంది ఉండగా 17,139 మంది ఓటర్లు ఉన్నారు. ప్రధాన పంచాయతీ నుంచి హోదా పెరుగుతున్న సమయంలో పట్టణ వాసులు సంతోషించారు. మౌలిక సదుపాయాలు సమకూరి తమ సమస్యలు తీరుతాయని ఆశించినా పరిష్కారంలో మాత్రం విపరీత తాత్సారం జరుగుతోంది.

గీతాంజలి రోడ్డులో తవ్వి వదిలేసిన పైప్‌లైన్‌

పారిశుద్ధ్యం అస్తవ్యస్తం

పట్టణంలో పారిశుద్ధ్యం, నీటి సరఫరా వ్యవస్థలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. ఎన్నికల నేపథ్యంలో అధికారులు అదనపు భారంతో వాటివైపు దృష్టి సారించడం లేదు. వాస్తవానికి 500 జనాభాకు ఒక పారిశుద్ధ్య సిబ్బంది నియామకం జరగాలి. కానీ ప్రస్తుతం కేవలం సగానికి సగం మంది మాత్రమే సిబ్బంది ఉండటంతో సమస్య తీరడం లేదు. పట్టణంలో వివిధ రకాలుగా మున్సిపాలిటీకి ఏటా రూ.1.20కోట్లు ఆదాయం రావాల్సి ఉండగా గత ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.75లక్షలు వసూలయ్యాయి. సిబ్బందిని పూర్తిస్థాయిలో నియమిస్తే అనేక సమస్యలు పరిష్కారమయ్యే అవకాశముందని పట్టణ వాసులు భావిస్తున్నారు. పారిశుద్ధ్య లేమితో అవస్థలు పడుతున్నామని మరింత మందిని నియమించి అవస్థలు తీర్చాలని కోరుతున్నారు. పట్టణంలో నిత్యం సుమారు 6 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుండగా కేవలం 4 ట్రాక్టర్లు మాత్రమే సేకరించి తరలిస్తున్నారు. పూర్తిస్థాయిలో పనులు జరగక ప్రజారోగ్యానికి హాని కలుగుతోంది. బీసీ కాలనీ, మార్కెట్‌ యార్డు రోడ్డు కాలనీ వాసులు నీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు మౌలిక సదుపాయాల కల్పన పట్ల దృష్టి సారించాలని పురపాలిక ప్రజలు కోరుతున్నారు.


 

సమస్యల పరిష్కారానికి కృషి

-జి.తేజిరెడ్డి, పురపాలక కమిషనర్‌

పట్టణంలో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాం. ఎక్కడైనా పారిశుద్ధ్య నిర్వహణ లోపిస్తే తక్షణం మా దృష్టికి తీసుకురావాలి. లేదా కార్యాలయంలోని ఫిర్యాదుల పుస్తకంలో నమోదు చేస్తే వెంటనే స్పందించేందుకు ప్రయత్నిస్తాం. ఉన్న సిబ్బందితో సమస్య రాకుండా శ్రమిస్తున్నాం. మిషన్‌ భగీరథ పనులు కూడా సకాలంలో పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. పూర్తిస్థాయి సిబ్బంది వస్తే అభివృద్ధికి మరింత అవకాశం కలుగుతుంది.



 

 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.