close

బుధవారం, ఆగస్టు 21, 2019

ప్రధానాంశాలు

హతవిధీ.. ‘సంక్షేమ నిధి’

● రూ.27 కోట్లు ఏడాదిగా ఖాతాల్లోనే

● అభివృద్ధికి నోచని గనుల గ్రామాలు ●

దృష్టి సారిస్తేనే ప్రయోజనం

న్యూస్‌టుడే, తాండూరుగ్రామీణ

గనుల ప్రభావిత గ్రామాల అభ్యున్నతికి జిల్లా ఖనిజ సంక్షేమ నిధి (డీఎమ్‌ఎఫ్‌) నుంచి భారీగా నిధులు దక్కాయి. ఏడాది అనంతరం వాటి వినియోగంపై ప్రజాప్రతినిధులు, అధికారులు చర్చించారు. పలు కార్యక్రమాల అమలుకు కార్యాచరణ రూపొందించారు. దీనిని ఆచరణలో పెడితే సమస్యలు పరిష్కారం కావడమే కాకుండా.. వసతులు సమకూరనున్నాయి. జిల్లాకు మంజూరైన రూ.27 కోట్ల డీఎమ్‌ఎఫ్‌ నిధులపై ‘న్యూస్‌టుడే’ అందిస్తున్న కథనం.

జిల్లాలో వికారాబాద్‌, తాండూరు, పరిగి, కొడంగల్‌ నియోజకవర్గాల్లోని 18 మండలాల పరిధిలో దాదాపు 4,909 ఎకరాల విస్తీర్ణంలో ఖనిజ సంపద నిక్షిప్తమై ఉంది. తాండూరు నియోజకవర్గంలోని తాండూరు, బషీరాబాద్‌ మండలాల్లో నాపరాయి, పెద్దేముల్‌, ధారూరు, వికారాబాద్‌ మండలాల పరిధిలో సుద్ద నవాబుపేట, పూడూరు, మోమిన్‌పేట, కొడంగల్‌, బొంరాస్‌పేట, దౌల్తాబాద్‌, పరిగి, దోమ ఎర్రమట్టి, కంకర నిక్షేపాలు విస్తారంగా ఉన్నాయి. యాలాల మండలంలో సహజ వనరు ఇసుక పదుల ఎకరాల్లో విస్తరించి ఉంది. వీటి తవ్వకాల ద్వారా పొరుగు రాష్ట్రాలు, విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇక్కడి సహజ సంపద కారణంగా ఏకంగా ఐదు సిమెంటు కర్మాగారాలు, వెయ్యికిపైగా నాపరాయి నునుపు పరిశ్రమలు, పదిహేనుకుపైగా సుద్ద పరిశ్రమలు కొనసాగుతున్నాయి. ఈక్రమంలో నిక్షేపాల తరలింపుతో గనుల శాఖ ద్వారా ప్రభుత్వానికి ఏటా దాదాపు రూ.100 కోట్ల దాకా ఆదాయం సమకూరుతోంది. ఇందులో నుంచి కొంత మొత్తాన్ని ఖనిజ గ్రామాలు, గనుల నిర్వహణ, రవాణాతో ప్రభావితమయ్యే పల్లెల అభివృద్ధికి కేటాయించారు.

రెండు విడతల్లో..

గతేడాది జిల్లాకు రెండు విడతలుగా ఖనిజ సంక్షేమ నిధి రూ.27 కోట్లు మంజూరయ్యాయి. వీటిలో 60 శాతం నిధులను గనుల ప్రభావిత గ్రామాల్లో విద్య, వైద్యం, పర్యావరణం, పారిశుద్ధ్యం, మహిళా స్త్రీ శిశు సంక్షేమం, మౌలిక సదుపాయాల కల్పన వంటి కార్యక్రమాలకు వెచ్చించాల్సి ఉంది. మిగిలిన 40 శాతం నిధులతో రహదారులు, మురుగు కాల్వల నిర్మాణం వంటి పనులకు ఖర్చు చేయాలి. అప్పట్లో జిల్లా గనుల శాఖ అధికారి శామ్యూల్‌ జాకబ్‌ ఆధ్వర్యంలో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధుల ద్వారా ప్రతిపాదనలు తయారీకి శ్రీకారం చుట్టారు. ఈక్రమంలో కొన్నిచోట్ల సిమెంటు రహదారులు, మురుగుకాల్వలను నిర్మించారు. సుమారు రూ.కోటి వరకు వెచ్చించారు. అంతలో సదరు అధికారి బదిలీపై వెళ్లారు. సంక్షేమ నిధి కార్యకలాపాలను పర్యవేక్షించే తాండూరు గనుల శాఖ కార్యాలయంలో కొనసాగుతున్న విభాగాన్ని వికారాబాద్‌కు తరలించారు. వరుస ఎన్నికలు జరగడంతో అప్పటి నుంచి వీటి వినియోగం గురించి పట్టించుకోలేదు.

సచివాలయంలో సమాలోచనలు

జిల్లాకు మంజూరైన ఖనిజ సంక్షేమ నిధి వినియోగంపై ఇటీవల హైదరాబాద్‌లోని సచివాలయంలో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ పి.మహేందర్‌రెడ్డి, పాలనాధికారి అయేషా, జిల్లాలోని ఎమ్మెల్యేలు చర్చించారు. వివిధ కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించారు. కరణ్‌కోటలో ప్రాథమిక ఆరోగ్యం ఏర్పాటుకు తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ప్రతిపాదించారు. పదివేల జనాభా ఉన్న గ్రామంలో ప్రభుత్వ ఆస్పత్రి అందుబాటులోకి తేవడంతో ఇక్కడి ప్రజలకు వైద్య సదుపాయం చేరువకానుంది. కాలుష్య నివారణకు పట్టణంలో మొక్కలు నాటేందుకు, పార్కులను అభివృద్ధి చేసేందుకు ఖరారు చేశారు. ఇదే రీతిలో గనులు, సిమెంటు కర్మాగారాలున్న గ్రామాల్లోనూ కాలుష్య నివారణ చర్యలు చేపట్టాల్సి ఉంది. నిధులను సద్వినియోగం చేసి గ్రామాలను ప్రగతి పథంలో నడిపించాలని ప్రజలు కోరుతున్నారు.

నియోజకవర్గాల్లోనూ నిర్వహిస్తే..

ఈ నిధులతో చేపట్టాల్సిన పనుల గురించి నియోజకవర్గంలోనూ సమావేశం నిర్వహిస్తే మేలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయా గ్రామాలకు సంబంధించి ప్రజాప్రతినిధుల విజ్ఞప్తులను, ప్రజల అవసరాలను పరిగణనలోకి తీసుకుని ప్రణాళికలు అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇక్కడి గ్రామాలకు కేటాయించిన నిధులను ఆయా గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యం లేకుండా ఖర్చు చేయడంతో ఉపయోగం లేకుండాపోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి కార్యక్రమాలను రూపొందించి ఆచరణలో పెట్టాలని ప్రజలు విన్నవిస్తున్నారు. తాండూరు మండలంలో అత్యధికంగా 13 గ్రామాలకు ఏకంగా రూ.14 కోట్లు మంజూరయ్యాయి. వీటిలో మూడు గ్రామాలకు దక్కిన నిధులు ఇలా..

ఎమ్మెల్యే ప్రతిపాదనలతో పనులు

మనోహర్‌రావు, ఈఈ, పంచాయతీరాజ్‌ శాఖ.

డీఎమ్‌ఎఫ్‌ నిధులతో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల గురించి ఎమ్మెల్యేలు ప్రతిపాదనలు సమర్పించాల్సి ఉంది. వాటిని జిల్లా పాలనాధికారి ఆమోదించాక తర్వాత పనులు కొనసాగిస్తాం. గనులున్న గ్రామాలతోపాటు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితమయ్యే గ్రామాల్లో స్థానిక ఎమ్మెల్యేల ప్రతిపాదనల మేరకు పనులు చేయాల్సి ఉంది. పాలనాధికారి ఆమోదం అనంతరం సివిల్‌ పనులను మొదలుపెడతాం. దీనికి మరో నెలరోజుల సమయం పట్టే అవకాశముంది.

 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.