close

శనివారం, ఆగస్టు 24, 2019

ప్రధానాంశాలు

మహానగరంలో మృగాళ్లు!

 బాలికలపై కొనసాగుతోన్న దారుణాలు
 నిత్యం ఏదో ఒక ప్రాంతంలో అలజడి
 అత్యాచారాలు.. అపహరణలతో ఆందోళన
ఈనాడు, హైదరాబాద్‌

రాజధాని నగరంలో బాలికల భద్రత ప్రశ్నార్థకమవుతోంది. ఏదో ఓ మూల అత్యాచారాలు, హత్యలు, అపహరణలతో అలజడి రేగుతోంది. ఆదివారం ఒక్కరోజే సైదాబాద్‌, ఆసిఫ్‌నగర్‌ ప్రాంతాల్లో దారుణాలు చోటు చేసుకున్నాయి. అంతకుముందు రోజే మేడ్చల్‌ శివారులో దారుణమైన స్థితిలో ఓ బాలిక మృతదేహం లభ్యమైంది. అదను కోసం పొంచి చూస్తున్న మృగాళ్లు.. ఏమాత్రం అవకాశం చిక్కినా కాటేసేందుకు సిద్ధంగా ఉంటున్నారు. తెలియని వ్యక్తులు చిన్నారులకు చాక్లెట్లు ఆశచూపి అపహరించేందుకు ప్రయత్నం చేస్తుండగా.. పరిచయం ఉన్న వ్యక్తులు ఏదో కారణం చూపి వెంట తీసుకెళ్లి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తరచూ వెలుగుచూస్తున్న దారుణాల నేపథ్యంలో బాలికల తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పిల్లలను ఒంటరిగా బయటికి పంపకుండా చూసుకోవాల్సిన బాధ్యతను గుర్తుచేస్తోంది.

మద్యం మత్తులో అపహరణయత్నం

ఆసిఫ్‌నగర్‌ ఠాణా పరిధిలోని కిషన్‌నగర్‌ ప్రాంతానికి చెందిన ఇద్దరు బాలికలను సలీమ్‌ అనే ప్రబుద్ధుడు ఆదివారం అపహరించేందుకు యత్నించాడు. మద్యం మత్తులో ఉన్న సలీమ్‌ బాలికల్ని వెంట తీసుకెళ్తుండటాన్ని గుర్తించిన స్థానికులు ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పాడు. దీంతో కోపోద్రిక్తులైన స్థానికులు అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

సినిమా చూపిస్తామని అత్యాచారం

సైదాబాద్‌ ఠాణా పరిధిలో శనివారం సాయంత్రం దారుణం చోటు చేసుకుంది. సింగరేణి కాలనీకి చెందిన ఇద్దరు బాలికలకు సినిమా చూపిస్తామని చెప్పి ఇద్దరు యువకులు వెంట తీసుకెళ్లారు. సినిమాకు ఇంకా అరగంట సమయం ఉందని, మాట్లాడుకుందామని చెప్పి సమీపంలోని పాడుబడిన బంగ్లా సెల్లార్‌లోకి తీసుకెళ్లారు. ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక అరుపులు విని ఘటనాస్థలికి చేరుకున్న స్థానికులు ఆ ఇద్దరు యువకుల్ని చితకబాది పోలీసులకు అప్పగించారు.

మేడ్చల్‌లో బాలిక దారుణహత్య

మేడ్చల్‌ ఠాణా పరిధిలో బాలిక(14) మృతదేహం శనివారం బహిర్గతం కావడం కలకలం రేపింది. మొహం చెక్కేసి.. కనుగుడ్లు బయటికి వచ్చి.. చెవి తెగిపడిన స్థితిలో కనిపించింది. దర్యాప్తులో అదే ప్రాంతంలోని కూలీ కుటుంబానికి చెందిన బాలికగా గుర్తించారు. శుక్రవారం ఇంటి నుంచి అదృశ్యమై దారుణస్థితిలో విగతజీవిగా కనిపించడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆమెపై అత్యాచారం జరిగిందా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

చాక్లెట్లు కొనిస్తానని నగల చోరీ

గుంటూరుకు చెందిన వెగ్నం అనురాధ(30) పాఠశాలల సమీపంలో మాటువేసి పిల్లలను అపహరించడమే పనిగా పెట్టుకొంది. కాళ్ల పట్టీలు, ముక్కు పోగులు, చెవిదుద్దులు, బంగారు గొలుసులు ధరించిన బాలికలు కనిపిస్తే వారిని మాటల్లోకి దింపేది. తాను వారి బంధువునని చెప్పి చాక్లెట్‌ కొనిస్తానని వెంట తీసుకెళ్లేది. అదను చూసి ఆభరణాలను తీసుకొని ఉడాయించేది. ఇలా గత మార్చి నుంచి నాలుగు నెలల కాలంలో హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో 25 మంది బాలికల నుంచి నగలను కాజేసింది. నగర కమిషనరేట్‌ పోలీసులు శుక్రవారం ఆమెను అరెస్ట్‌ చేశారు.

నానమ్మ దగ్గరికి తీసుకెళ్తానని చెప్పి..

ఓ బాలికను వెంట తీసుకెళ్తూ అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని మొయినాబాద్‌ మండలం చిలుకూరు గ్రామంలో గత బుధవారం స్థానికులు అడ్డగించారు. ఆరా తీయగా ఆ వ్యక్తి చెప్పిన సమాధానం నమ్మశక్యంగా లేకపోవడంతో చితకబాదారు. బాలికను ఆమె నానమ్మ దగ్గరికి తీసుకెళ్తానని చెప్పి కార్వాన్‌కు చెందిన కమ్రుద్దీన్‌ స్కూటీపై 20 కి.మీ.ల దూరంలోని చిలుకూరు వద్దకు తీసుకొచ్చాడని తేలింది. అంత దూరం ప్రయాణించిన తర్వాత ఎక్కడికి తీసుకెళ్తున్నాడో తెలియక భయాందోళనకు గురైన బాలిక కేకలు వేయడంతో కమ్రుద్దీన్‌ బండారం బయటపడింది. అతడిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.