close

గురువారం, ఆగస్టు 22, 2019

ప్రధానాంశాలు

ఆస్తిపన్ను మదింపు.. అవినీతి కంపు!

ఖజానా వెలవెల.. బిల్‌ కలెక్టర్ల జేబులు కళకళ
సర్కిళ్లలో ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్ల అరాచకం
కాకిలెక్కలతో యజమానులను భయపెట్టి వసూళ్లు
ఈనాడు, హైదరాబాద్‌

బల్దియాలో ఆస్తిపన్ను మదింపు ప్రక్రియ అవినీతిమయంగా మారింది. అత్యధిక శాతం బిల్‌కలెక్టర్లు (బీసీ), ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్లు (టీఐ) సహాయకులను నియమించుకుని వసూళ్లకు తెగబడుతున్నారు. ఒక్కో బీసీ, టీఐల కింద కనీసం 5 నుంచి 10 మంది ప్రైవేటు వ్యక్తులు పనిచేస్తున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. యజమానులు ముడుపులు ఇవ్వకపోతే భారీమొత్తం పన్ను విధించడం, ఇదేంటని ప్రశ్నిస్తే మరో మూడేళ్లు వెనక్కెళ్లి జరిమానాలు వేయడం చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ ఆదాయానికీ వాళ్లే గండి కొడుతున్నారు. అక్రమ వసూళ్లతో బల్దియా ఆదాయానికి గండి పడుతుండగా సిబ్బంది జేబులు  కళకళలాడుతున్నాయి. పలువురు బీసీలు, టీఐలు, సర్కిల్‌ మేనేజర్ల ‘వసూళ్ల’ ఆదాయం సగటున నెలకు రూ.10 లక్షలకుపైగా ఉంటుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఆదాయం తక్కువే..: జీహెచ్‌ఎంసీ పరిధిలో 1.5 కోట్ల మంది నివసిస్తున్నారు. అధికారికంగానే 15 లక్షల నిర్మాణాలున్నాయి. అనధికారికంగా మరో 5 లక్షలు ఉండొచ్చని అంచనా. బల్దియాకు ఆస్తిపన్ను రూపంలో ప్రస్తుతం రూ.1,600 కోట్ల ఆదాయం వస్తుంది. వందల సంఖ్యలో ఐటీ సంస్థలు, భారీగా షాపింగ్‌మాల్స్‌, మెరుగైన మౌలిక సౌకర్యాలున్న గ్రేటర్‌లో ఆస్తిపన్ను ఆదాయం అంత తక్కువ  వస్తుందంటే నమ్మలేని పరిస్థితి ఉంది. అందుకు పలువురు బిల్‌ కలెక్టర్లు, ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్లే  కారణమని క్షేత్రస్థాయి పరిస్థితులు చెబుతున్నాయి.

సర్వేను ఆసరా చేసుకొని.: బల్దియా రెవెన్యూ విభాగం రూ.1,200 నుంచి రూ.లక్షలోపు ఆస్తిపన్ను చెల్లిస్తున్న నిర్మాణాలన్నింటినీ సర్వే చేయాలని నిర్ణయించింది. దాన్ని అదునుగా చేసుకుని బీసీ, టీఐలు వ్యూహం పన్నారు. మొదట యజమానులకు నోటీసులిచ్చి అంచనాగా రూ.లక్షకుపైగా పన్ను వస్తుందని చెబుతున్నారు.   రూ.లక్ష పన్ను అనగానే చాలామంది యజమానులు బేరసారాలకు దిగుతున్నారు. అడిగినంత లంచం ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు’ అని ఫిర్యాదుదారులు వాపోతున్నారు. వాళ్లపై ఫిర్యాదు చేద్దామంటే సర్కిల్‌ ఉపకమిషనర్లు అవినీతి సిబ్బందికి వత్తాసు పలుకుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కొలతలు తీశారంటే కళ్లు తిరగాల్సిందే..:  నగరం అంతకంతకూ విస్తరించడంతో  కొన్ని పాత నిర్మాణాల్లో వ్యాపార కార్యకలాపాలు సాగుతున్నాయి. తదనుగుణంగా ఆస్తిపన్ను పెరగాలి. వాస్తవ పన్ను విలువను చెల్లించేందుకు యజమానులూ సిద్ధంగా ఉన్నారు.  టీఐ, బీసీలు పునర్‌ మదింపు పేరుతో యజమానులకు పగలే చుక్కలు చూపిస్తున్నారు. టేపు చేతిలో ఉంది కదా అని ఇష్టానుసారం కొలతలు తీసుకుంటున్నారు. విస్తీర్ణాన్ని పెంచేసి పాత భవనాలకూ ఎ-కేటగిరీ (అధునాతన భవనాలు) ధరలు వేస్తున్నారు. దాంతో ఆస్తిపన్ను లక్షకుపైగా పెరుగుతోంది. యజమానులకు సిబ్బంది చేసిన మాయాజాలం  తెలియక లంచాలు ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు.

మరింతగా పెంచుతున్నారు..: ఆస్తిపన్ను మదింపులో ఒక్కసారి పన్ను విలువ అధికంగా పడిందంటే దాన్ని సవరించాలని కోరుతూ యజమాని అర్జీ పెట్టుకోవాలి. దాన్ని సంబంధిత ఉపకమిషనర్‌ తిరిగి అదే టీఐలకు పంపిస్తారు. ఇంకేముంది నాపైనే ఫిర్యాదు చేస్తావా అంటూ సిబ్బంది బాధితులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. సవరణ పేరుతో రెండోసారి మరింతగా పన్ను పెంచుతోన్న ఉదంతాలు  లెక్కకు మించి ఉన్నాయి.

పర్యవేక్షణ కరవు..: రెవెన్యూ విభాగం ఆగడాలపై ఉన్నతాధికారులకు అవగాహన ఉండట్లేదు. క్షేత్రస్థాయిలో జరుగుతోన్న దోపిడీ, బాధితుల ఫిర్యాదుల గురించి కేంద్ర కార్యాలయం పట్టించుకోవట్లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఉపకమిషనర్లు, జోనల్‌ కమిషనర్లు సైతం బీసీ, టీఐలకే మద్దతుగా నిలుస్తుండటంతో ఆస్తిపన్ను మదింపు పూర్తిగా అవినీతిమయమైంది. ప్రైవేటు వ్యక్తులూ అడ్డగోలుగా నోటీసులిస్తూ అందినకాడికి దండుకుంటున్నారు.

వసూళ్లు.. విలాసాలు..: 2016 ఫిబ్రవరి 6న అర్ధరాత్రి మాదాపూర్‌ ఖానామెట్‌ ప్రాంతంలో ముజ్రా పార్టీలో అమ్మాయిలతో నృత్యాలు చేస్తూ 8 మంది జీహెచ్‌ఎంసీ సిబ్బంది అడ్డంగా దొరికిపోయారు. అంత జరిగినా పన్నుల విభాగం సిబ్బంది తీరు మార్చుకోలేదు. ఏటా పది మందికిపైగా బీసీలు, టీఐలు అనిశా దాడుల్లో  చిక్కుతుండటమే అందుకు నిదర్శనం. ‘మంగళవారం దొరికిన మల్కాజిగిరి టీసీ దుర్గాదాస్‌ పెద్దసంఖ్యలో ప్రైవేటు వ్యక్తులను నియమించుకుని భారీగా వసూళ్లకు పాల్పడుతున్నాడు. మామూళ్ల రూపంలో వచ్చిన డబ్బుతో వారంతా విలాస జీవితానికి అలవాటు పడుతున్నారు. మందు, చిందు అంటూ తిరుగుతుంటారు. అందుకు సంబంధించిన ఫొటోలు విచారణలో వెలుగు చూశాయి’ అని ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌ ఒకరు ‘ఈనాడు’కు తెలిపారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.