close

బుధవారం, ఆగస్టు 21, 2019

ప్రధానాంశాలు

అక్రమాల ‘మందిరం’

ఠాగూర్‌ ఆడిటోరియం అభివృద్ధి పనుల్లో అవినీతి
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిబంధనలకు నీళ్లు
ఈనాడు, హైదరాబాద్‌

ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని కొన్ని పనుల్లో అవినీతి పాళ్లు అధికంగా కనిపిస్తున్నాయి. వర్సిటీలోని కొందరు ఉన్నతాధికారులు యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘించి నిధులు దారి మళ్లించారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. వర్సిటీలోని సమావేశ మందిరం ఆధునికీకరణ విషయంలో రూ.లక్షల నిధులు దారి మళ్లించి అనుకూలమైన వారికి పనులు అప్పగించారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఆదేశాలను ఏ మాత్రం పట్టించుకోలేదు. ఆడిటోరియంలో వసతులు కల్పన పేరిట రూ.50లక్షల సొమ్మును పక్కదారి పట్టించినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఠాగూర్‌ ఆడిటోరియాన్ని ఆధునికీకరించాలని అధికారులు గతేడాది నిర్ణయించారు. ఇటీవల స్నాతకోత్సవం ఇదే ఆడిటోరియంలో నిర్వహించారు. దీని ఆధునికీకరణ కోసం రూ.3.22కోట్ల రూసా నిధులను కేటాయించారు. ఇందులో రూ.1.07కోట్లతో వర్సిటీ భవనాల విభాగం తరఫున వివిధ పనులు చేశారు. మిగిలిన రూ.2.15కోట్లతో వర్సిటీ ఉన్నతాధికారులు గుత్తేదారుల ద్వారా పనులు చేయించారు. ఇందులో రూ.64.50 లక్షలతో ఏసీ పనులు, రూ.1.02కోట్లతో ఇంటీరియర్స్‌, వాల్‌ ప్యానెలింగ్‌, ధ్వని నియంత్రణ పనులు, మరో రూ.50.75 లక్షలతో ఆడియో, వీడియో పరికరాల ఏర్పాటు వంటి పనులు చేపట్టారు. గుత్తేదారులకు అప్పగించిన పనులను నిబంధనలకు విరుద్ధంగా ఆన్‌లైన్‌ టెండరు పిలవకుండా కట్టబెట్టేశారు. వాస్తవానికి యూనివర్సిటీలో రూ.లక్షకు మించి ఏ పని చేపట్టినా.. ఆన్‌లైన్‌ టెండరు పిలవాలి. వర్సిటీ అధికారులు మాత్రం ఇవేమీ పట్టించుకోలేదు. కేవలం పనుల వివరాలు ఓయూ వెబ్‌సైట్‌లో ఉంచి వాటికి ఆమోదం ఇచ్చేశారు. యూనివర్సిటీ బిల్డింగ్‌ విభాగం తరఫున ఏసీ పనుల నిర్వహణకు రూ.40లక్షలతోనే అంచనా వేసి కొటేషన్‌ తీసుకువచ్చారు. కానీ గుత్తేదారులకు మాత్రం రూ.64.50లక్షలకు అప్పగించారు. ఇలా ఒక్క ఏసీ పనుల విషయంలోనే రూ.24 లక్షల మేర అధికంగా ధర నిర్ణయించి నిధులు కొల్లగొట్టారు. మిగిలిన రెండు పనులు విషయంలోనూ ఇదే తరహాలో అధిక ధరలకు కట్టబెట్టడం ద్వారా రూ.50-60లక్షల వరకు వర్సిటీ సొమ్ము దుర్వినియోగమైందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.

టెండరు.. లోపాల పుట్ట
వాస్తవానికి జీవో నం.94(1.7.2003) ప్రకారం ఈఈకి రూ.50 లక్షలలోపు, ఎస్‌ఈకి రూ.50లక్షల నుంచి రూ.5కోట్లలోపు, ఈఎన్‌సీకి రూ.5కోట్లకుపైగా పనులకు ఆమోదం తెలిపేందుకు అవకాశం ఉంది. అలాగే ఈఈ ఆమోదం తెలిపిన పనులకు కచ్చితంగా ఎస్‌ఈ నుంచి స్క్రూటినీ చేయించాకే టెండర్లు పిలవాలని ఉత్తర్వుల్లో స్పష్టంగా ఉంది. అలా చేయకపోతే పనులు చేపట్టేందుకు వీల్లేదు. కానీ, వర్సిటీ పెద్దలు మాత్రం ఈ నిబంధనను తుంగలోతొక్కారు. ఆడిటోరియం ఆధునికీకరణకు ఉద్దేశించిన మూడు పనులు కూడా రూ.50లక్షలు మించే ఉన్నాయి. వీటన్నింటిని ఈఈ ఇచ్చిన ఎంసీతోనే చేపట్టేశారు. టెండరు కమిటీలో ఎస్‌ఈ ఉండాలి. కానీ ఎస్‌ఈని పక్కన పెట్టి పనులను పంచేశారు. అలాగే జీవో నం.94 ప్రకారం రూ.2కోట్లు దాటిన టెండర్లను.. ప్రభుత్వ టెండరు విభాగం కమిషనర్‌(సీవోటీ)కి పంపించాలి. సాంకేతిక, ధరల పట్టిక విషయంలో ఆమోదం పొందాల్సి ఉంటుంది. దీన్ని కూడా పాటించలేదు. పనుల వివరాలను కేవలం ఓయూ వెబ్‌సైట్‌లో ఉంచారు. వాస్తవానికి వర్సిటీ నిబంధనల ప్రకారం రూ.లక్ష దాటితే కచ్చితంగా ఆన్‌లైన్‌ టెండరు పిలవాల్సి ఉంది. దీనివల్ల టెండర్లలో తక్కువకు కోట్‌ చేసిన వ్యక్తులకు పనులు అప్పగించేందుకు వీలుంటుంది. దీనివల్ల నిధులు భారీగా మిగులుతాయి. అదీగాక ఆన్‌లైన్‌ టెండర్లు పిలిచినప్పుడు 5శాతం తక్కువకు కోట్‌ చేసిన వారికే పనులు దక్కుతాయి. అదే మొత్తానికి లేదా అంతకంటే ఎక్కువగా కోట్‌ చేస్తే ఆన్‌లైన్‌లో కొటేషన్లు తిరస్కరణకు గురవుతాయి. ఇవేమీ పట్టించుకోకుండా ఏకపక్షంగా తమకు అనుకూలమైన గుత్తేదారులకు పనులు కేటాయించేశారు. పనుల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధరలను అనుసరించకుండా మొత్తంగా చెల్లింపులు జరిపేశారు. నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు జరిగినప్పటికీ డివిజనల్‌ అకౌంట్స్‌ విభాగం అడ్డు చెప్పకుండా బిల్లులు మంజూరు చేసేసింది. ఈ వ్యవహారంపై ఆడిట్‌ విభాగం తరఫున సమగ్ర దర్యాప్తు చేయించాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.

అక్రమాలకు బీజం ఇలా..
అభివృద్ధి పనుల నిర్వహణకు గతేడాది ఫిబ్రవరిలో వర్సిటీలోని బిల్డింగ్‌ విభాగానికి సాంకేతిక ఆమోదం ఇచ్చారు. తర్వాత ఎలాంటి సమాచారం లేకుండానే ఆ విభాగం నుంచి పనులను తప్పించి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ విభాగానికి బదిలీ చేశారు. ఇందుకు సరైన కారణం చూపకుండానే పనుల బదలాయింపు జరిగినప్పటికీ ఆడిట్‌ జనరల్‌ విభాగం తరఫున ఉన్న ఫైనాన్స్‌ అధికారి నుంచి ఎలాంటి అభ్యంతరం పెట్టకపోవడం విశేషం. ఇక్కడే అక్రమాలకు బీజం పడింది. పనులకు కనీసం కన్ఫర్మిటీ సర్టిఫికెట్‌ సైతం రాలేదు. బిల్డింగ్‌ విభాగం ఈఈ నుంచి కొలతల సర్టిఫికెట్‌(ఎంసీ) తీసుకుని ఆమోదముద్ర వేసేశారు. ఈ విషయంలో సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌(ఎస్‌ఈ)కి సమాచారం ఇవ్వాల్సి ఉన్నా.. ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. వర్సిటీకి చెందిన ఓ కీలక వ్యక్తి కనుసన్నల్లోనే అక్రమ వ్యవహారం నడిచినట్లు స్పష్టమవుతోంది.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.