close

గురువారం, ఆగస్టు 22, 2019

ప్రధానాంశాలు

సైబర్‌ నేరస్థులకు సందివ్వద్దు!

సామాజిక మాధ్యమాల వినియోగంలో అప్రమత్తత తప్పనిసరి
‘అంతర్జాలం రక్షణాత్మక వినియోగం’పై నిపుణుల సూచనలు
ఈనాడు, హైదరాబాద్‌

సైబర్‌ నేరాలపై సైబర్‌క్రైమ్‌ పోలీసులు కేసులు నమోదు చేసి, నిందితులను జైళ్లకు పంపుతున్నా ఆ నేరాలు తగ్గడం లేదు. పైగా ఇంకా పెరుగుతున్నాయి. దేశంలో ప్రతి పది నిమిషాలకో సైబర్‌ నేరం నమోదవుతోంది.  వీటిని నియంత్రించేందుకు పోలీసు శాఖ అవగాహన సదస్సులతో ముందుకు సాగుతోంది.

సైబర్‌ నేరాలను నియంత్రించడం, అంతర్జాల సురక్షిత వినియోగం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై హైదరాబాద్‌ ‘షి’ బృందాలు ‘ఆన్‌లైన్‌ సేఫ్టీ వర్క్‌షాప్‌’ పేరుతో ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించాయి. కళాశాలల విద్యార్థినులు, యువతులు, మహిళల కోసం ప్రత్యేకంగా దీనిని ఏర్పాటు చేశాయి. వక్తలు మాట్లాడుతూ.. సైబర్‌ నేరాలు పెరుగుతున్నాయంటే మనం అపరిచితులకు అవకాశాలు ఇస్తున్నామని అర్థం చేసుకోవాలన్నారు. అంతర్జాల వినియోగం అవసరమేనని, విజ్ఞానం పేరుతో సామాజిక మాధ్యమాలను విపరీతంగా వినియోగిస్తున్నామని తెలిపారు. స్మార్ట్‌ఫోన్‌లేనిదే జీవితం లేదన్న చందంగా పిల్లలు ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వీయ నియంత్రణ, అప్రమత్తత వల్ల బాధితులుగా మారకుండా ఉండొచ్చని సూచించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ సైబర్‌ నిపుణులు, ఇంటర్నెట్‌, మొబైల్‌ అసోసియేషన్‌ ఇండియా కన్సల్టెంట్‌ రక్షిణ్‌ టండన్‌ పరిమితంగా అంతర్జాలం వినియోగం, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, గూగుల్‌, వాట్సాప్‌లలో రక్షణ పద్ధతులను దృశ్యరూప ప్రదర్శన ద్వారా వివరించారు. హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ వి.అంజనీ కుమార్‌, అదనపు సీపీలు షిఖాగోయల్‌, అనిల్‌ కుమార్‌, మురళీ కృష్ణ, సంయుక్త కమిషనర్‌ అవినాష్‌ మహంతి, అదనపు డీసీపీ బారి, ఏసీపీ నర్మద ఇతర పోలీసు అధికారులు, వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.

అమ్మా, నాన్న మాటలు అక్షరసత్యాలు
అవినాష్‌ మహంతి, సంయుక్త కమిషనర్‌

ఇంటర్నెట్‌, యూట్యూబ్‌, స్మార్ట్‌ఫోన్లు లేని కాలంలో అమ్మానాన్న చిన్నపిల్లలకు జాగ్రత్తలు చెప్పేవారు. అపరిచితులు ఇచ్చిన పదార్థాలు తీసుకోవద్దని, తెలియని వారు పిలిస్తే వెళ్లవద్దని సూచించేవారు. సరిగ్గా నలభై ఏళ్ల తర్వాత పెద్దలు చెప్పిన విషయాలు ఇప్పటి తరం పిల్లలకూ అవసరమవుతున్నాయి. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో అపరిచితులను నమ్మితే వారే మోసం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాలు వాడే ముందు అమ్మానాన్న మాటలు గుర్తుపెట్టుకోవాలి.

ఓ యువకుడు 500 మందిని మోసం చేశాడు
షిఖా గోయల్‌, అదనపు సీపీ

ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌ ఖాతాలున్నాయని చాలామంది విద్యార్థినులు గర్వంగా భావించవచ్చు. వాటిని సమాచారం, విజ్ఞానం కోసం ఉపయోగిస్తే అవగాహన పెరుగుతుంది. ఛాటింగ్‌, ఇతర భావోద్వేగాలకు ఉపయోగిస్తే బాధితుల్లా మారిపోతాం. యుక్తవయస్సుకు వచ్చిన అమ్మాయిలు విచక్షణతో ఉండాలి. రెండేళ్ల క్రితం విద్యార్థినులను బ్లాక్‌మెయిల్‌ చేస్తున్న ఓ ఇంజినీరింగ్‌ యువకుడిని అరెస్టు చేశాం. అతడు 500 మంది విద్యార్థినుల ఫొటోలు, వ్యక్తిగత వివరాలు సేకరించి వాటిని అసభ్యకరంగా చిత్రీకరించి అంతర్జాలంలో ఉంచుతానంటూ బెదిరించి డబ్బు వసూలు చేసుకుంటున్నాడు. అపరిచితుడికి ఫొటోలు పంపించినందుకు సదరు విద్యార్థినులు ఇలా మూల్యం చెల్లించారు.

నేరస్థులను పట్టుకోవడానికి సైబర్‌ పెట్రోలింగ్‌
అంజనీ కుమార్‌, సీపీ, హైదరాబాద్‌

సైబర్‌ నేరాలు పెరుగుతున్నాయ్‌... ఎందుకంటే మన వ్యక్తిగత వివరాలు సైబర్‌ నేరస్థులకు తెలియడమే. మనం ఏం చేస్తున్నామన్నది వారికి తెలుసు. ఎక్కడుంటున్నాం? ఎలా ఉంటున్నాం? మన బ్యాంకు ఖాతాలో ఎన్ని నగదు నిల్వలున్నాయ్‌? అన్న వివరాలు వారి వద్ద ఉన్నాయి. మనం జొమాటో, స్విగ్గీ ద్వారా ఇంటికి తెప్పించుకునే బిర్యానీ వివరాలూ వారికి తెలిసిపోతాయ్‌. అందుకే సైబర్‌ నేరస్థులు పరోక్షంగా మనల్ని శాసిస్తున్నారు. మనల్ని దెబ్బకొట్టేందుకు అంతర్జాలంలోనే కుట్రలు చేస్తున్నారు. ఇలాంటి నేరస్థుల పనిపట్టడానికి సైబర్‌ పెట్రోలింగ్‌ చేస్తున్నాం. నేరం జరగకముందే జాగ్రత్త పడేందుకు సైబర్‌ నేరాలపై అవగాహన పెంచుకుందాం. 

మీకూ, మీ చిత్రాలకూ రక్షణ: 
రక్షిత్‌ టండన్‌, సైబర్‌ నిపుణులు

‘మా ఫొటోను అంతర్జాలంలో ఉంచారు. అశ్లీల వీడియోలో నేనున్నానం’టూ విద్యార్థినులు, యువతులు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. వాస్తవానికి మనమే మన ఫొటోలు ఇతరులు వినియోగించేందుకు అవకాశమిస్తున్నాం. మనమే మన వ్యక్తిగత సమాచారం సైబర్‌ నేరస్థులకు ఉచితంగా ఇస్తున్నాం. పబ్‌జీగేమ్‌లు, టిక్‌టాక్‌ వీడియోలు, వాట్సాప్‌ చిత్రాలు ఇలా ప్రపంచానికి మన వివరాలు బహిర్గతం చేస్తున్నాం. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌, గూగుల్‌లో మీకు, మీ చిత్రాలకు రక్షణ చర్యలున్నాయి. మీ ఫొటోను ఇతరులెవ్వరూ తీసుకోకూడదనుకుంటే అందుకో ఐచ్ఛికం ఉంది. మీ చిత్రాలు మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే చూడాలనుకుంటే అందుకూ పద్ధతులున్నాయి. మీ బ్యాంక్‌ ఖాతాల వివరాలు, యూపీఐలు, ఇతర వివరాలు అంతర్జాలంలో ఉంచకూడదు. వీడియోకాల్‌లో మాట్లాడేప్పుడూ జాగ్రత్తలు తీసుకోవాలి. సైబర్‌ నేరాలంటే దొంగకు మనమే తాళమిచ్చి దోచుకో అని చెప్పడమే.

 


 

అప్రమత్తతతో అంతర్జాల అడుగులు!
పోలీసు శాఖ ఆధ్వర్యంలో విద్యార్థినులకు సూచనలు

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: ప్రతిరోజూ అంతర్జాలం వేదికగా జరుగుతున్న ఆకృత్యాలకు ఎందరో బాలికలు బలవుతున్నారు. అవగాహన లోపం, ముందుజాగ్రత్త చర్యలు పాటించకపోవడంతో సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుతున్నారు. దీనిపై అవగాహన కల్పించేందుకు నగర పోలీసు శాఖ సదస్సు నిర్వహించింది. నగరంలోని వివిధ కళాశాలల విద్యార్థినులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సదస్సుపై అభిప్రాయాలు ‘ఈనాడు’తో పంచుకున్నారు.

విషయ నిపుణులు చెప్పడం బాగుంది:  శివాణి ప్రియ

ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న సైబర్‌ మోసాలన్నీ తెలిసినవే.. కానీ అంతర్జాలంలో వచ్చే ఆకర్షణీయ ప్రకటనలు చూసి అందులో చిక్కుతున్నారు. వీటిపై అవగాహన కల్పించేందుకు ఇలాంటి సదస్సులు నిర్వహించడం అవసరం. బయటి వ్యక్తులు ఇలాంటివి చెబితే నమ్మలేం. పోలీసుల ఆధ్వర్యంలో విషయ నిపుణులు చెప్పడం వల్ల విశ్వాసం కలుగుతోంది. మహిళా కోణంలో ఆలోచించి, మమ్మల్ని భాగం చేయడం మంచి విషయం.

కొత్త విషయాలు నేర్చుకున్నాం..: స్పందన

సదస్సు ఎంతో ఉపయోగకరంగా ఉంది. అవగాహన లోపంతోనే సైబర్‌ సమస్యలు కొని తెచ్చుకుంటున్నాం. ఇలాంటి కార్యక్రమాల ద్వారా మార్పు వస్తుంది. కొత్త విషయాలు తెలుసుకున్నాం. ఇన్నాళ్లూ సామాజిక మాధ్యమాలు వాడటమే కానీ వాటి వల్ల ఇబ్బంది ఏంటో ఇప్పుడే తెలుస్తోంది. ఇకపై అప్రమత్తంగా ఉంటాం.

జాగ్రత్తలు తెలసుకున్నాం..:  శ్రీలేఖ

సదస్సులో రంజిత్‌ టాండన్‌ చెప్పిన తీరు బాగుంది. అంతర్జాలంలో ఎదురవుతున్న సమస్యలు, బాధితుల గాథలు, మోసగాళ్ల తీరును దృశ్య రూపకంగా వివరించడం వల్ల ఓ అవగాహన ఏర్పడింది. సైబర్‌ నేరగాళ్లకు చెక్‌పెట్టే దారుల్ని చూపించారు. అంతర్జాలంలో ఎలా అప్రమత్తంగా ఉండాలో నేర్చుకున్నాం.

మేమూ అవగాహన కల్పిస్తాం.. శ్రావణి

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి అవగాహన సదస్సులు అవసరం. ప్రత్యేకంగా విద్యార్థినుల కోణంలో వారికి సామాజిక మాధ్యమాల్లో ఎదురయ్యే సమస్యలను స్పష్టంగా వివరించారు. ఇక్కడ నేర్చుకున్న విషయాలను మా స్నేహితులకూ తెలుపుతాం. మా మిత్రులెవరు సైబర్‌ మోసాలకు గురవకుండా మా వంతు బాధ్యత నిర్వర్తిస్తాం.

పరిమితులు తెలుసుకున్నాం.. రియా

చాలా రోజులుగా సామాజిక మాధ్యమాలు వాడుతున్నాం. కానీ వ్యక్తిగత సమాచారం గోప్యంగా ఉంచుకోవడం, సైబర్‌ నేరస్థులకు మన వివరాలు తెలియకుండా జాగ్రత్తపడటం తెలియదు. ప్రత్యక్షంగా నిపుణుల ద్వారా పరిమితులు అర్థం చేసుకున్నాం.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.