close

బుధవారం, ఆగస్టు 21, 2019

ప్రధానాంశాలు

ఆనంద్‌బాగ్‌ ఆర్యూబీ ఆలస్యంపై రచ్చరచ్చ

తెరాస.. భాజపా నేతల బాహాబాహీ
ఇద్దరికి తీవ్రగాయాలు.. కేసులు నమోదు

ఈనాడు, హైదరాబాద్‌, మల్కాజిగిరి, న్యూస్‌టుడే: ఆనంద్‌బాగ్‌ ఆర్యూబీ ప్రాంతం సోమవారం రణరంగంగా మారింది. అసంపూర్తి పనుల విషయమై తెరాస, భాజపా నేతలు దాడులకు దిగడంతో ఇద్దరు బాజపా నేతలకు తీవ్రగాయాలయ్యాయి. ఒకరి కాలు విరింది. మరొకరి ముక్కు పగిలింది. రెండు పార్టీల నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆర్యూబీ సమస్యను పరిష్కరించి పనులు వేగం పెంచేందుకు సోమవారం ఆనంద్‌బాగ్‌ ఆర్యూబీ వద్ద అధికారులు ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, జోనల్‌ కమిషనర్‌ రఘుప్రసాద్‌, పట్టణ ప్రణాళిక విభాగం సర్కిల్‌ అధికారి నర్సింగ్‌రావు కార్పొరేటర్లు శ్రీదేవి, శిరీషారెడ్డి, జగదీష్‌గౌడ్‌, నర్సింగ్‌రావు, జితేంద్రనాథ్‌ హాజరయ్యారు. ఆర్యూబీ పనులకు సహకరించి తమ ఇంటి స్థలాలను అప్పగించిన పదిమందిని సన్మానించేందుకు, అప్పగించని వారిని బుజ్జగించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే మైనంపల్లి మాట్లాడుతున్న సమయంలో అదే ప్రాంతంలో ఉన్న భాజపా ఆందోళనకారులు.. ఆరేళ్లుగా పనులు జరుగుతున్నా పూర్తి కాకపోవటంపై నిరసన వ్యక్తం చేశారు. తెరాస ప్రభుత్వ వైఖరి వల్లనే పనులు ఆలస్యం అవుతున్నాయని ప్లకార్డులు ప్రదర్శించడంతో అక్కడే ఉన్న తెరాస నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపా నేతలపై దాడులకు పాల్పడ్దారు. ఈ దాడిలో భాజపా స్వచ్ఛభారత్‌ సర్కిల్‌ కమిటీ కన్వీనర్‌ బక్క నాగరాజు తీవ్రంగా గాయపడ్డారు. సీనియర్‌ నాయకుడు శ్రీనివాస్‌ కాలు విరిగింది. మరి కొంతమందికి  గాయాలయ్యాయి. వెంటనే వారిని మల్కాజిగిరిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారిని ఎమ్మెల్సీ రాంచందర్‌రావు పరామర్శించారు. ఈ దాడులపై కార్పొరేటర్లు పోలీసులకు ఫిర్యాదు చేయగా తెరాస నేతలపై పోలీస్‌స్టేషన్‌లో భాజపా ఫిర్యాదు చేసింది.

ఆర్‌యూబీపై అఖిలపక్ష సమావేశం 2న
ఆనంద్‌బాగ్‌ రైల్వే వంతెన నిర్మాణం ఒకడుగు ముందుకు.. పదడుగులు వెనక్కిలా మారింది. ఇరువైపులా రైల్వే లైన్ల కింద డక్‌లు ఏర్పాటు చేసి రైల్వే శాఖ వంతెన నిర్మించింది. వంతెనకు అనుసంధానంగా నిర్మిస్తున్న సర్వీసు రోడ్ల విషయంలోనే చిక్కులు వచ్చాయి. స్థానికుల నివాసాలను కొంతవరకూ స్వాధీనం చేసుకోవాలి. దాదాపు 30 ఆస్తులు సేకరించాల్సి ఉండగా జీహెచ్‌ఎంసీ అధికారులు విఫలమయ్యారు. 9 మంది కోర్టుకెక్కారు. దీనిపై ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు స్థానికులతో మంగళవారం సమావేశం ఏర్పాటు చేయగా భాజపా కార్యకర్తలు నిరసన తెలపడం.. వారిపై తెరాస నాయకులు దాడులు చేయడంతో రసాభాసగా మారింది. దీంతో వచ్చేనెల 2న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. బాధితులకు తాను స్వయంగా రూ.50 లక్షలు, కార్యకర్తల ద్వారా మరో రూ.50 లక్షలు సేకరించి మొత్తం రూ.కోటి పరిహారం తమవంతుగా ఇస్తామని ప్రకటించారు.

కావాలనే రెచ్చగొట్టారు: ఎమ్మెల్యే మైనంపల్లి
రాజకీయాలకతీతంగా పనుల పూర్తికి ప్రయత్నిస్తుంటే భాజపా ఇలా చేయడం విచారకరం. స్థలాలు కోల్పోతున్న బాధితులకు ప్రభుత్వపరంగా కాకుండా పార్టీపరంగా రూ.కోటి సహాయం అందిస్తున్నాం. ఇందుకు భాజపా సహకరించకుండా కావాలనే రెచ్చగొట్టడం తగదు. కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో ఉన్నా ఇక్కడి అభివృధ్ధికి ఎమ్మెల్సీ రాంచందర్‌రావు చేసింది శూన్యం. ఆర్యూబీ సమస్యను పరిష్కరించాలనే చిత్తశుద్ధి వారికి ఉంటే వచ్చే ఆగస్టు 2న నిర్వహించే సమావేశానికి హాజరై సహకరించాలి.

అహంకార పూరిత దాడి: ఎమ్మెల్సీ రాంచందర్‌రావు
తెరాస నేతలు అధికార గర్వంతో మా కార్యకర్తలపై దాడులు చేశారు. గతంలో మండలి సమావేశంలో ఆర్యూబీ పనుల ఆలస్యంపై పలుమార్లు అడిగినా అప్పటి మంత్రి కేటీఆర్‌ ఎలాంటి సమాధానం ఇవ్వలేకపోయారు. ఆరేళ్లుగా స్థానికులు, వాహనదారులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో వారికీ తెలుసు. అయినా సమస్యను పరిష్కరించడంలో తాత్సారం చేస్తున్నారు. అడిగితే దాడులకు పాల్పడుతున్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.