close

గురువారం, ఆగస్టు 22, 2019

ప్రధానాంశాలు

ఆమెకు బస్సు దొరకడం గగనం..!

తగ్గుతున్న మహిళా ప్రత్యేక సిటీ బస్సులు
ఐటీ కారిడార్‌లో కానరాని ఆర్టీసీ సేవలు

ఈనాడు - హైదరాబాద్‌:  మహిళలకోసం ప్రత్యేకంగా నడుపుతున్న సిటీ బస్సులలో ఆర్టీసీ కోత పెడుతోంది. అన్ని రంగాల్లో మహిళా ఉద్యోగుల సంఖ్య పెరుగుతోంది. ఐటీ రంగం విస్తరించిన తర్వాత వీరి సంఖ్య గణనీయంగా పెరిగింది. వీరికి రక్షణగా షీ టీమ్స్‌ వచ్చాయి. వారి ప్రయాణానికి షీ క్యాబ్స్‌ పరుగులు పెడుతున్నాయి. కాని ఆర్టీసీ ప్రత్యేక బస్సులు మాత్రం కనిపించడం లేదు. నగరం ఎటు చూసినా 50 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న సమయంలో ప్రస్తుతం రోడ్డెక్కుతున్న 3550 బస్సులు నగర ప్రయాణికుల అవసరాలను తీర్చలేకపోతున్నాయి. కోటి మంది దాటిన నగర జనాభాకు కనీసం 8 నుంచి 9 వేల బస్సులు ఉండాలి. దశాబ్దం క్రితం కేటాయించిన మహిళా ప్రత్యేక బస్సులు మినహా ఇటీవల వాటిని పెంచాల్సిన అవసరాన్నే ఆర్టీసీ పట్టించుకోలేదు. కిక్కిరిసిన బస్సులు ఎక్కలేని పరిస్థితుల్లో ప్రైవేటు రవాణావైపు మళ్లుతున్నా ఆర్టీసీ పట్టించుకోవడం లేదు. సీట్ల రంగు మార్చి 33 శాతం వారికి కేటాయిస్తున్నాం అనుకుంటున్నారు. పెరుగుతోన్న మహిళా ఉద్యోగుల సంఖ్య మేరకు ప్రత్యేక బస్సులను పెంచాల్సిన అవసరాన్ని గుర్తెరగడం లేదు. కనీసం కార్యాలయాల వేళ ప్రత్యేకంగా మహిళా బస్సులను నడపడంలో ఆర్టీసీ అలసత్వం ప్రదర్శిస్తోంది. సచివాలయం, బీఆర్‌కే భవన్‌, గాంధీభవన్‌, టెలిఫోన్‌ భవన్‌, ఎన్‌జీవో కాలనీ, మెహిదీపట్నం, ఎల్‌బీనగర్‌, వనస్థలిపురం, సచివాలయ కాలనీ, సికంద్రాబాద్‌ ప్రాంతాలకే ఇవి పరిమితమయ్యాయి.

ఐటీ కారిడార్‌కు ప్రత్యేక బస్సులే లేవు..
గచ్చిబౌలి, కొండాపూర్‌, మాదాపూర్‌, సైబరాబాద్‌, జూబ్లీహిల్స్‌తో పాటు.. నగరం చుట్టూ నివాస ప్రాంతాలు వెలిసాయి. ఇలా కొత్త మార్గాల్లో బస్సుల సంఖ్య పెంచాల్సింది పోయి.. దశాబ్దకాలం క్రితం నడుపుతున్న బస్సులతోనే ఆర్టీసీ అధికారులు సరిపెడుతున్నారు. ఐటీ కారిడార్‌ను కలుపుతూ 127, 222ఎల్‌ రూటు నంబర్లతో తిరుగుతున్న బస్సుల మార్గంలో తమకు ప్రత్యేకంగా నడపాలని మహిళలు డిమాండ్‌ చేస్తున్నారు. నగరంలో మొత్తం 22 ప్రత్యేక బస్సులు వీరికి కేటాయించారు. ఇవి 44 ట్రిప్పులు తిరుగుతున్నాయి. బస్సులు సరిపడా లేవని ఇటీవల ఈ సంఖ్యను 36కు కుదించారు. ఇప్పుడవీ  సరిగా తిరగడం లేదని మహిళలు ఫిర్యాదు చేస్తున్నారు.

విద్యార్థినుల అవస్థలు...
పాఠశాలలు, కళాశాలల సమయాల్లో విద్యార్థినులు అవస్థలు పడుతున్నారు. మహిళా ఉద్యోగులే కాకుండా.. ఇటీవల నగరంలో వివిధ పనులమీద, షాపింగ్‌లకు వెళ్లే అతివల సంఖ్య పెరిగింది. ఆర్టీసీ బస్సులో 40-45 సీట్లు ఉంటే.. 13 సీట్లే మహిళలకు కేటాయిస్తుండడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం సాయంత్రం వేళల్లో మొత్తం 42 ట్రిప్పులు ప్రత్యేక బస్సులు నడుపుతున్నా.. అవి ఎవరికీ కానరావడం లేదని మహిళా ప్రయాణికులు వాపోతున్నారు.

2010 తర్వాత మరి ఆలోచించలేదు..
ఎన్‌జీవో కాలనీ, మల్కాజిగిరి, కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు, జీడిమెట్ల, లంగర్‌హౌస్‌, సికింద్రాబాద్‌ నుంచి సచివాలయం, అసెంబ్లీ, బూర్గుల రామకృష్ణారావు భవనం, నాంపల్లికి ప్రత్యేకంగా ఈ బస్సులు నడుస్తున్నాయి. ఇవి 2010 కాలంలో నిర్ణయించిన రహదారులు. ప్రస్తుతం ఔటర్‌ రింగు రోడ్డు చుట్టూ అనేక కాలనీలు వెలిసాయి. మరి ఈ మార్గాల్లో మహిళలకు ప్రత్యేక బస్సులను వేయాలనే ఆలోచనే ఆర్టీసీ చేయడంలేదు. వివిధ ప్రాంతాల నుంచి సచివాలయానికి 20 బస్సులను నడుపుతున్నట్టు ఆర్టీసీ అధికారులు చెబుతున్నా.. వీటి సంఖ్య గణనీయంగా పడిపోయిందని ఆయా మార్గాల్లో తిరిగే మహిళా ప్రయాణికులే ఫిర్యాదు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.