close

బుధవారం, ఆగస్టు 21, 2019

ప్రధానాంశాలు

పుట్టినరోజు జూజేలు!

కేకులు... కేకలు... కేరింతలు
వినూత్న రీతిలో జంతువులకు సంబరాలు
- ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌

జంతుజాతి విశిష్టతను, ప్రాముఖ్యతను జనానికి తెలపడానికి నగరంలోని నెహ్రూ జంతు ప్రదర్శనశాల సిబ్బంది వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చిన జంతువులను పరిరక్షించటమే కాకుండా ఏటా వాటికి పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తున్నారు. అందులో జంతు ప్రేమికులను భాగం చేస్తున్నారు. 2015లో అప్పటి జంతు ప్రదర్శనశాల సంచాలకులు చంద్రశేఖర్‌రెడ్డి ఈ విధానానికి శ్రీకారం చుట్టారు.  జంతువులను ప్రత్యేక శ్రద్ధతో ముస్తాబు చేసి... వాటికి ఇష్టమైన ఆహారం అందిస్తూ పుట్టినరోజులను ఘనంగా నిర్వహిస్తున్నట్లు  జూ ప్రజాసంబంధాల అధికారి హనీఫ్‌ తెలిపారు.

గజ‘రాణి’కి ప్రత్యేకంగా

పక్క చిత్రంలోని ఏనుగు పేరు రాణి. 1938 అక్టోబరు 6న జన్మించింది. నగరంలో నెహ్రూ జంతు ప్రదర్శనశాల ఏర్పాటయ్యాక అప్పటి నిజాం 1968లో ఈ ఏనుగును బహూకరించారు. నాలుగేళ్లుగా రాణి పుట్టినరోజును ఘనంగా నిర్వహిస్తున్నారు. మావటిల సహకారంతో రాణిని అందంగా ముస్తాబు చేసి సందర్శకుల నడుమ కేకు కోయిస్తుంటారు. సాధారణ కేకు కాకుండా రాగులు, బెల్లంతో ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నారు. జూలో అత్యంత పెద్ద వయసున్న జంతువు రాణి.

కొండముచ్చు శివ... రైనో రాము

కొండముచ్చు శివ వయసు 33 ఏళ్లు. ఇక్కడే పుట్టింది. సెప్టెంబరు 24, 2015న జన్మించిన రైనోకు రాము అని పేరు పెట్టారు. వీటికీ వేడుకలు చేస్తున్నారు. కొన్నేళ్ల కిందట సౌదీ యువరాజు నగరానికి వచ్చినప్పుడు జూను సందర్శించారు. ఆయన తిరిగి వెళ్లి, సౌదీ నుంచి ఓ ఆఫ్రికన్‌ జాతికి చెందిన సింహాన్ని జూకు బహుమతిగా పంపించారు. ఇక్కడికి వచ్చే సమయానికి దాని వయసు రెండేళ్లు. ఇప్పుడు 8 ఏళ్లు. జూలో అబ్దుల్లా అని పిలుచుకునే చిరుత వయసు పన్నెండేళ్లు. సౌదీ వైల్డ్‌లైఫ్‌ అథారిటీ వారు దీన్ని బహుమతిగా ఇచ్చారు. ఆ సింహం... ఈ చిరుత... రెండూ ఎంచెక్కా పుట్టిన రోజు వేడుకలను జరుపుకొంటున్నాయి.

సుజీ... చింపాంజీ

ఈ 33 ఏళ్ల చింపాజీ పేరు సుజీ. ప్రతి ఏటా జులై 7న ఈ చింపాజీ పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తున్నారు జూ సిబ్బంది. సహారా గ్రూప్‌ సంస్థలు సుజీని జూకు బహుమతిగా అందించాయి. చింపాంజీ జూకు వచ్చిన రోజును పరిగణనలోకి తీసుకుని పుట్టినరోజుగా చేస్తున్నారు. ఇష్టమైన పండ్లతో గూడును ముస్తాబు చేసి ఇటీవల వేడుకలు నిర్వహించారు.

చిట్టి సింహాలు ఈ ఏడాదే..

కింది చిత్రంలో ఉన్న చిట్టి సింహాలు పుట్టి ఏడు నెలలవుతోంది. రెండింటికీ ఈ ఏడాది వేడుకలు నిర్వహించనున్నారు. వీటి తల్లి అదీశన, తండ్రి మాధవ. సంబరాల నిర్వహణకు ఇప్పటి నుంచే ప్రణాళికలు మొదలెట్టారు అధికారులు.

ప్రాముఖ్యతను తెలిపేందుకు..
- ఎన్‌.క్షితిజ, ఐఎఫ్‌ఎస్‌, క్యూరేటర్‌, నెహ్రూ జూపార్కు

ప్రజలకు మూగజీవాల ప్రాముఖ్యతను తెలిపేందుకే ఈ వేడుకలు నిర్వహిస్తున్నాం. జంతు పరిరక్షణలో ప్రతిఒక్కరినీ భాగం చేయడంతో పాటు వాటిపై ప్రేమను పెంచేందుకూ ఇవి ఉపయోగపడతాయి. జంతు ప్రదర్శనశాలలో ఉన్న ప్రతి మూగజీవానికీ కాకుండా సందర్శకులను ఆకట్టుకునే వాటికే వేడుకలు చేస్తున్నాం. పుట్టిన తేదీ నమోదై ఉంటే అదే రోజు చేస్తాం. లేకపోతే అవి జూలో అడుగుపెట్టిన రోజును పరిగణనలోకి తీసుకుంటున్నాం.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.