close

ఆదివారం, ఆగస్టు 25, 2019

ప్రధానాంశాలు

మీ ఇంటికి వచ్చేశాం..మీ వస్తువు తెచ్చేశాం

కొరియర్‌బాయ్‌ల పేరిట ఫోన్‌ చేసి బురిడీ
ఖాతాకు నగదు బదిలీ చేయించుకొని మోసం
‘ఓఎల్‌ఎక్స్‌’ మోసాల్లో భరత్‌పూర్‌ నేరస్థుల నయా పంథా
ఈనాడు, హైదరాబాద్‌

తక్కువ ధరకే వాహనాలు విక్రయిస్తున్నామని ఆశ చూపి డబ్బులు కొట్టేసే ఘరానా ముఠాల లీలలకు అంతు లేకుండా పోతోంది. ఈ-కామర్స్‌ వెబ్‌సైట్లలోని ప్రకటనల్లో తమను తాము ఆర్మీ అధికారులుగా చెప్పుకొంటూ బురిడీ కొట్టిస్తున్న భరత్‌పూర్‌ ముఠాలు తాజాగా నయా పంథాను ఎంచుకొంటున్నాయి. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన వస్తువు లేదా వాహనాన్ని ఇంటి వద్దకు తీసుకొచ్చామని కొరియర్‌బాయ్‌ల రూపంలో ఫోన్లు చేస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో ప్రకటనదారు పేరుతో ఫోన్‌ చేసి తాము సూచించిన ఖాతాకు ఆన్‌లైన్‌లో నగదు బదిలీ చేసిన మరుక్షణమే కొరియర్‌బాయ్‌ వస్తువును అప్పగిస్తాడని చెప్పి నమ్మిస్తున్నారు. అలా నగదు బదిలీ చేయించుకొని వెంటనే మొహం చాటేస్తున్నారు. ఈ తరహా మోసాలు తాజాగా పెరుగుతున్న నేపథ్యంలో సైబరాబాద్‌ పోలీసులు ఓఎల్‌ఎక్స్‌ సంస్థకు ఇటీవలే నోటీసులు జారీ చేయడం గమనార్హం.

ప్రకటనల్లో ఆర్మీ దుస్తులతో దగా
సెకండ్‌హ్యాండ్‌లో వస్తువులను కొనేందుకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న ఓఎల్‌ఎక్స్‌, క్వికర్‌ తరహా ఈ-కామర్స్‌ వెబ్‌సైట్లనే మోసగాళ్లు అడ్డాగా చేసుకుంటున్నారు. ముఖ్యంగా రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌ జిల్లా డీగా, టోడా గ్రామాల్లోని పలు తండాలకు చెందిన మోసగాళ్లే ఈ వ్యవహారాన్ని నడుపుతున్నారు. ఆర్మీ అధికారుల పేరిట నకిలీ గుర్తింపు కార్డులను సృష్టిస్తున్నారు. ఉద్యోగరీత్యా హైదరాబాద్‌ నుంచి బదిలీపై వెళ్తున్నామని పేర్కొంటున్నారు. కారు లేదా బుల్లెట్‌ బైక్‌లను అత్యవసరంగా విక్రయించాల్సి రావడంతో తక్కువ ధరకైనా వదిలేస్తామని పోస్ట్‌ చేస్తున్నారు.

ఒకరి పత్రాల్ని తీసుకొని.. వాటినే ఏమార్చి..
మరికొందరు తెలివిమీరిన మోసగాళ్లు మరో అడుగు ముందుకేస్తున్నారు. ఓఎల్‌ఎక్స్‌, క్వికర్‌.కాం వెబ్‌సైట్లలో సెకండ్‌హ్యాండ్‌లో అమ్మకానికి ఉంచిన ప్రకటనల్ని చూసి ప్రకటనదారుకు ఫోన్‌ చేస్తున్నారు. తమను తాము ఆర్మీ అధికారిగా పరిచయం చేసుకుంటున్నారు. ఉద్యోగరీత్యా తాము బదిలీపై హైదరాబాద్‌కు వస్తున్నామని చెబుతారు. మీ ప్రకటన చూశామని.. వాహనం చిత్రాన్ని, సంబంధిత రిజిస్ట్రేషన్‌ తదితర ధ్రువీకరణపత్రాల నకలు ప్రతుల్ని వాట్సప్‌లో పంపిస్తే పరిశీలించి కొనుగోలు చేస్తామని నమ్మబలుకుతున్నారు. అలా సేకరించిన రిజిస్ట్రేషన్‌ ప్రతుల్ని అడ్డం పెట్టుకొని తిరిగి వెబ్‌సైట్‌లో మరో ప్రకటనను పోస్టు చేస్తున్నారు. ఆ ప్రకటనలో వాహనం చిత్రం, రిజిస్ట్రేషన్‌ ప్రతులు ఉండటంతోపాటు ఆర్మీ అధికారికి చెందిన వాహనంగా భావించి బాధితులు సులభంగా మోసగాళ్ల బుట్టలో పడిపోతున్నారు.

50-60శాతం తక్కువ ధరకే అంటూ గాలం
ఈ తరహా మోసాల్లో ఆరితేరిన ముఠాలు రాయితీల పేరిట బాధితులకు గాలమేస్తున్నారు. ఆకస్మికంగా బదిలీ కావడంతో 50-60శాతం తక్కువ ధరకే విక్రయిస్తున్నామంటూ నేరగాళ్లు బుట్టలో వేసుకుంటున్నారు. కార్లు, బైక్‌లతోపాటు ఐఫోన్లు, ల్యాప్‌టాప్‌లనూ ఈ జాబితాలో చేర్చేస్తున్నారు. కొంత మొత్తం బయానా ఇస్తే మిగితాది వాహనం లేదా వస్తువు చేతికి అందిన తర్వాత చెల్లిస్తే సరిపోతుందని ముగ్గులోకి లాగుతున్నారు. ఆ భరోసాతోనే బాధితులు సులభంగా మోసగాళ్లని నమ్మేస్తున్నారు.

అలా కాజేసి.. ఇలా మాయం
తక్కువ ధరలుండటంతో బాధితులు ఏమాత్రం ఆలోచించకుండా మోసగాళ్లతో సంప్రదింపులకు దిగుతున్నారు. తొలుత బయానాగా రూ.10వేల నుంచి రూ.లక్ష వరకు తీసుకుంటున్నారు. వస్తువు ఫలానా కొరియర్‌ సంస్థ ద్వారా పంపిస్తామని కొరియర్‌ సంస్థ పేరుతో నకిలీ రశీదు బాధితుడికి వాట్సప్‌లో పంపిస్తున్నారు. కొరియర్‌ వచ్చే రోజే డెలివరీ బాయ్‌ పేరిట బాధితుడికి ఫోన్‌ చేసి కొన్ని నిమిషాల్లో వస్తువు డెలివరీ చేస్తానని నమ్మిస్తాడు. అప్పుడే అసలు మోసగాళ్లు ఫోన్‌ చేసి, వస్తువు కొన్ని నిమిషాల్లో అందబోతోంది కాబట్టి మిగిలిన సొమ్ము ఖాతాలో వేయాలని కోరుతాడు. అంతా సవ్యంగా సాగిపోతోందని నగదు బదిలీ చేసేస్తున్నాడు. ఆ తర్వాత అసలు మోసగాళ్లతోపాటు కొరియర్‌బాయ్‌ రూపంలోని ముఠాసభ్యుడు చరవాణుల్ని స్విచ్‌ఆఫ్‌ చేసి మాయమైపోతున్నారు.

జాగ్రతలు తీసుకోకపోతే ఇల్లు గుల్లే..
* భరత్‌పూర్‌ ముఠాల మోసాలు పెరిగిపోతోన్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సైబర్‌క్రైమ్‌ పోలీసులు సూచిస్తున్నారు.
*  ఓఎల్‌ఎక్స్‌, క్వికర్‌ తరహా వెబ్‌సైట్లలో ప్రకటనల విషయంలో పరిచయం లేని వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలు ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ప్రకటనదారుల్ని నేరుగా కలవకుండా బయానాలు చెల్లించొద్దు.
*  ఆన్‌లైన్‌ ప్రకటనలకు సంబంధించి వస్తువులు లేదా వాహనాల కొనుగోలు కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లొద్దు.
*  సెకండ్‌హ్యాండ్‌ వస్తువుల ధరలు నమ్మశక్యం కాని రీతిలో ఉన్నాయంటే అనుమానించాల్సిందే. ముందుగా కొంత బయానా చెల్లించాలని ప్రకటనదారు కోరినా శంకించండి.
*  సెకండ్‌హ్యాండ్‌లో వాహనాలు కొనుగోలు చేసేవారు సేల్‌డీడ్‌తోపాటు డిక్లరేషన్‌ తీసుకోవాలి. అప్పటివరకు ఆ వాహనంపై చలానాలు, కేసులుంటే పాత యజమానిదే బాధ్యత అనే ఒప్పందం రాయించుకోవాలి.
*  వాహనాలు లేదా వస్తువుల్ని అమ్మే వ్యక్తుల ఆధార్‌ తరహా గుర్తింపుకార్డుల నకలు ప్రతుల్ని తీసుకోవాలి. ఆ కార్డు గల వ్యక్తి పేరిటే వాహనం రిజిస్ట్రేషన్‌ ఉండేలా చూసుకోవాలి.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.