close

బుధవారం, ఆగస్టు 21, 2019

ప్రధానాంశాలు

సూర్యోదయమా... ఎలా ఉంటుంది?

ఆలస్యంగా నిద్దరోతున్న నగరం
పొద్దెక్కాక గానీ లేవని వైనం
విస్తృతం అవుతున్న నైట్‌లైఫ్‌
కునుకు కరవై పెరుగుతున్న ఇక్కట్లు
ఈనాడు, హైదరాబాద్‌

నగరంలో రాత్రిళ్లు సందడి పెరుగుతోంది. ఇదివరకు పాతబస్తీకే పరిమితమైన ఈ సంస్కృతి నగరంలో అన్ని ప్రాంతాలకూ విస్తరిస్తోంది. ఐటీ కంపెనీలు కొలువుదీరిన సైబరాబాద్‌లోనూ ఈ ధోరణిని చూడొచ్చు. అంతర్జాతీయ పని వేళలకు అనుగుణంగా ఇక్కడ విధులు నిర్వర్తించాల్సి ఉండటంతో పగలూ రాత్రికి తేడా తెలియడం లేదు. పార్టీలు, వేడుకల హడావుడితో రాత్రిపూట సందడి ఎక్కువే. బయట ఉంటే పార్టీలు, షాపింగ్‌.. ఇంట్లో ఉంటే టీవీ, మొబైల్‌ఫోన్లూ చూస్తూ ఆలస్యంగా నిద్రపోతున్నారు. నిద్ర చాలక ఉదయం ఆలస్యంగా బద్దకంగా మేల్కొంటున్నారు. సూర్యోదయం చూసి ఎంతకాలమైందో అనేవారే నగరంలో ఎక్కువ. ఆధునిక జీవనశైలిలో చాలామంది నగరవాసులకు వేళకు కునుకు పట్టడం లేదు. కొన్ని అలవాట్లు మార్చుకుంటే గతంలో మాదిరే కంటి నిండా నిద్రపోవచ్చు అంటున్నారు నిపుణులు.

అలవాట్లు మార్చుకుంటే.. 

ఎన్ని గంటలకు పడుకోవాలి? ఎంతసేపు నిద్రపోవాలనేది మనచేతుల్లోనే ఉంది.  కొన్ని అలవాట్లను మార్చుకుంటే చాలు నిద్రకు సమయం దొరుకుతుంది. 
* శరీరానికి తగినంత శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలి. అందుకు ఉన్న మార్గం వ్యాయామం. రోజుకు కనీసం 45 నిమిషాలైనా క్రమం తప్పక కసరత్తులు చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. వ్యాయామం ద్వారా ఆరోగ్యకర జీవనశైలి అలవడుతుంది. చక్కగా నిద్ర పడుతుందని వైద్యులు సూచిస్తున్నారు. 
* పడక గదుల్లో మొబైల్‌ ఫోన్లు, టీవీలు లేకుండా చూసుకోవాలి. పడుకున్నాక మొబైల్‌ఫోన్‌ నెట్‌లో, సామాజిక మాధ్యమాల్లో వెతుకులాటకు దూరంగా ఉండటం మేలు. 
* పడుకోవడానికి కొన్ని గంటల ముందు కెఫిన్‌ ఉండే పదార్థాలను తీసుకోకపోవడం మేలు. గోరువెచ్చని పాలు తాగడం మంచిది. ఫలితంగా హాయిగా నిద్ర వస్తుంది. 
*  జంక్‌ ఫుడ్‌ కాకుండా ఆరోగ్యకర ఆహారం సుఖనిద్రకు దోహదం చేస్తుంది. 
* భార్యాభర్తలు రాత్రిపూట శృంగారంలో పాల్గొనడం ద్వారా శరీరంలో విడుదలయ్యే హార్మోన్లు సుఖనిద్రకు తోడ్పడతాయని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 

ఇదీ తేడా...

వయసును బట్టి నిద్రపోయే సమయంలో తేడా ఉంటుందని వైద్యులు అంటున్నారు. చిన్నపిల్లలకు 8 నుంచి 12 గంటల సేపు నిద్ర అవసరం. 18 - 64 ఏళ్ల వయసు వారు కనీసం 7 గంటల నిద్ర తగ్గకుండా చూసుకోవాలని చెబుతున్నారు. 

పెందలకడనే... 

రాత్రి పెందలకడనే మంచం మీదకు చేరి, నిద్రకు ఉపక్రమించాలి. కొందరు నిద్రపోయేందుకు మరో అరగంటయినా పడుతుంది. చాలామందికి రాత్రి 12 గంటలు దాటితే తప్ప కన్నులు మూతపడటం లేదు. సహజంగానే రాత్రి పొద్దుపోయాక పడుకుంటే ఉదయం లేవడం ఆలస్యమవుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఉదయం త్వరగా మేల్కొవాల్సి రావడం.. విదేశీ పని గంటలకు తగ్గట్టు నగరంలో రాత్రంతా పని చేయడం.. వారం వారం మారే షిప్టులతో..  కనీసం 7 గంటలు కూడా పడుకోవడం లేదు. కొన్ని కుటుంబాల్లో పిల్లల నిద్రకు పెద్దలే భంగం కలిగిస్తుండటం కలవరానికి గురి చేస్తోంది. కొలువు కావొచ్చు.. పార్టీ కావొచ్చు... కారణమేదైనా అర్ధరాత్రి వచ్చి తలుపు తట్టడంతో అప్పటివరకు పడుకున్న పిల్లలు సహా మిగతావారు ఉలిక్కిపడి లేస్తున్నారు. ఫలితంగా పెద్దలతో పాటూ పిల్లలకు క్రమంగా నిద్ర సమస్యలు పెరుగుతూ ఆందోళను కలిగిస్తున్నాయి. 

పనిపై ప్రభావం.. 

ఆరోగ్యంపైన, చేసే పనిపైన నిద్రలేమి తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మెదడు చురుకుదనం కోల్పోయి చేసే పనిలో సామర్థ్యం తగ్గిపోవడం మొదలు.. కొత్త విషయాలు నేర్చుకోవడంపై ఆసక్తి పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం ఉందని వైద్యులు అంటున్నారు. ఎక్కువశాతం చోదకులకు తగిన నిద్ర లేక పోవడం వల్లే రహదారులపై ప్రమాదాలు సంభవిస్తున్నాయి.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.