close

శుక్రవారం, నవంబర్ 22, 2019

ప్రధానాంశాలు

తల్లి ప్రాణాలకు భరోసా

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ వైద్యవిభాగం

సహజ ప్రసవం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలో వివరిస్తున్న

హైదరాబాద్‌ నుంచి వచ్చిన వైద్యురాలు ఎవిటో ఫెర్నాండేజ్‌.

ర్భం దాల్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు...సాధారణ ప్రసవం కోసం చేయాల్సిన వ్యాయామాలు...రక్తపోటు, మధుమేహం ఉన్న గర్భిణికి మరింత మెరుగైన వైద్యం అందించడం ఎలా... టెస్ట్‌ట్యూబ్‌ బేబీ విషయంలో వచ్చిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం... ఒకటేమిటి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన స్త్రీ వైద్యనిపుణులు వారు పరిశోధన చేసిన అంశాలను, అనుభవాలను తోటివారికి వివరించారు. స్త్రీ వైద్యనిపుణుల విభాగంలో పీజీ చేస్తున్న 140 మంది, వివిధ జిల్లాల్లోని వైద్యకళాశాలల నుంచి వచ్చి వారు చేసిన పరిశోధన అంశాలను సీనియర్‌ వైద్యుల ఎదుట చర్చించారు. డిచ్‌పల్లిలో శనివారం అయిదో వార్షిక రాష్ట్రస్థాయి స్త్రీవైద్యనిపుణుల వైజ్ఞానిక సదస్సు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో 30 మంది జాతీయ స్థాయి, 70 మంది రాష్ట్ర స్థాయి, వివిధ జిల్లాల నుంచి వచ్చిన సుమారు 1,300 మంది స్త్రీ వైద్యనిపుణులు, పీజీ విద్యార్థులు భాగస్వాములయ్యారు.

సదస్సుకు హాజరైన వైద్యులు..

మెరుగైన వైద్యం అందించేందుకు వీలవుతుంది

పద్మజా సురేష్‌, స్త్రీ వైద్యనిపుణురాలు, సదస్సు కార్యనిర్వాహక కార్యదర్శి

నిజామాబాద్‌ జిల్లాలో ఈ సదస్సు ఏర్పాటు చేయడం గర్వంగా ఉంది. గత సంవత్సరం రాష్ట్ర స్థాయి స్త్రీవైద్య నిపుణుల సదస్సు కరీంనగర్‌లో ఏర్పాటు చేశారు. ఈ సదస్సుతో అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వైద్యనిపుణులు చేసిన పరిశోధనలు, అనుభవాలు, ఇతర వైద్యులతో పంచుకోవడంతో మరింత మెరుగైన వైద్యం అందించే అవకాశం ప్రతి స్త్రీవైద్య నిపుణురాలికి కలుగుతుంది.

రక్తపోటు ఉంటే ప్రమాదమే

సౌమ్య, పీజీ వైద్యవిద్యార్థిని, నెల్లూరు

గర్భిణిగా ఉన్న సమయంలో రక్తపోటు ఎక్కువగా ఉంటే తల్లికీ బిడ్డకు ప్రమాదం. క్రమం తప్పకుండా బీపీ పరిశీలించాలి. తేడా వస్తే వైద్యుల సలహాలను పాటించాలి. సరైన మాత్రలు వాడాలి. లేదంటే తల్లికి కిడ్నీలు, కాలేయంపై ప్రభావం చూపుతుంది. దీనికి తోడు నెలలు నిండక ముందే కాన్పు అయ్యే ప్రమాదం ఉంటుంది. నేను ఈ విషయంలో పరిశోధన చేసి ఈ సదస్సులో వైద్యుల ఎదుట ఉంచాను.

అనేక కొత్త విషయాలు తెలుస్తాయి

రమాదేవి, స్త్రీ వైద్య నిపుణురాలు, సదస్సు కార్యనిర్వాహక ఛైర్మన్‌

ఈ సదస్సుకు వివిధ విభాగాల్లో నిపుణులైన స్త్రీ వైద్య నిపుణులు వచ్చారు. వీరు చేసిన పరిశోధనలు, కొత్త విషయాలను అందరికి తెలిపారు. దేశంలో వచ్చిన కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం ఈ సదస్సులో వివరించారు. ఇలాంటి సదస్సులు ఏర్పాటు చేయడంతో మహిళలకు మరింత మెరుగైన అత్యాధునిక వైద్యం అందించే అవకాశం ఉంటుంది.

మాతృ మరణాలు చాలా వరకు తగ్గాయి

డాక్టర్‌ శాంతకుమారి,స్త్రీవైద్యనిపుణురాలు, తెలంగాణ స్త్రీవైద్యనిపుణుల సంఘం రాష్ట్ర కార్యదర్శి)

ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆరోగ్య పథకాలతో మాతృ మరణాలు చాలా వరకు తగ్గాయి. కేసీఆర్‌ కిట్లతో ప్రతి ఒక్కరు ఆసుపత్రిలో ప్రసవానికి ఇష్ట పడుతున్నారు. దీంతో మాతృ మరణాలు తగ్గాయి. మాతృ మరణాల తగ్గింపులో మన రాష్ట్రం అయిదో స్థానంలో ఉంది. జిల్లా స్థాయిలో సైతం మహిళలకు మెరుగైన వైద్యం అందుతుంది.

శస్త్రచికిత్సతో చాలా సమస్యలు వస్తాయి..

బాలాంబ, స్త్రీ వైద్య నిపుణురాలు, హైదరాబాద్‌

అనేక మంది మహిళలు నొప్పులు భరించలేం.. శస్త్రచికిత్స చేసేయండి..అని చెబుతున్నారు. గర్భిణుల కంటే ముందు వారి తల్లిదండ్రులు మా అమ్మాయి నొప్పులు భరించే పరిస్థితి లేదండి..శస్త్రచికిత్స చేయాలని తొందర పెడుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. సాధారణ ప్రసవంతో పిల్లలకు జబ్బులు రాకుండా ఉంటాయి. సాధారణ ప్రసవంతో తల్లి జీర్ణకోశంలో ఉండే మంచి బ్యాక్టీరియా బిడ్డకు చేరుతుంది. పుట్టిన వెంటనే పిల్లలు అనేక వ్యాధుల బారిన పడడానికి శస్త్రచికిత్సలే కారణం. సాధారణ కాన్పుతో అస్తమా రాదు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అనేక ప్రమాదకరమైన వ్యాధులు దరిచేరవు.

లోపాలు లేని టెస్ట్‌ట్యూబ్‌ బేబీ

హరిషికేష్‌, స్త్రీవైద్య నిపుణుడు, ముంబయి

మొన్నటి వరకు టెస్ట్‌ట్యూబ్‌ బేబీ ఆరోగ్యంగా జన్మించేలా అన్ని చర్యలు తీసుకునే వాళ్లం.. కానీ వారికి వారసత్వంగా ఏదైనా అంగవైకల్యం, ఇతర సమస్యలు, మానసిక వైకల్యం ఉన్నట్లు గుర్తించడం కుదర లేదు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. టెస్ట్‌ట్యూబ్‌ బేబీని తీర్చి దిద్దే క్రమంలో అయిదోరోజే పరీక్ష చేసి పుట్టబోయే శిశువుకు అంగ, మానసిక వైకల్యం వచ్చే అవకాశం ఉందా? ఆరోగ్యంగా జన్మిస్తుందా..? లేదా అనే విషయాన్ని స్పష్టంగా గుర్తించే అవకాశం ఉంది.

గర్భాశయం తొలగిస్తే వ్యాధుల బారిన పడే ప్రమాదం

విద్యాభట్‌(స్త్రీవైద్యనిపుణురాలు, బెంగళూరు)

ఎక్కువ మంది మహిళలు గర్భాశయ సమస్య ఉందని వాటిని తొలగించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. చాలా మంది సరైన వైద్యం కోసం ఓపిక పట్టకుండా దీన్ని తొలగించమని వైద్యులకే చెబుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే గర్భాశయం 50 ఏళ్ల వరకు ప్రతి మహిళకు చాలా అవసరం. చిన్నవయస్సులోనే తొలగిస్తే గుండె, ఎముకల సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం 90 శాతం ఉంటుంది. గర్భాశయం ఈస్ట్రోజిన్‌ హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది స్త్రీ ఆరోగ్యంగా ఉండేందుకు సహకరిస్తుంది. ఈ విషయం ప్రతి మహిళ గమనించాలి. చాలా మంది గర్భాశయం తొలగించిన తర్వాత ఆసుపత్రుల పాలవుతున్నారు. అనారోగ్యానికి దాని తొలగింపే కారణమనే విషయం చాలా మందికి తెలియదు.

70 శాతం సాధారణ కాన్పులు చేయొచ్చు

ఎవిటో ఫెర్నాండేజ్‌, స్త్రీవైద్యనిపుణురాలు, హైదరాబాద్‌

ఈ రోజుల్లో సాధారణ కాన్పుల సంఖ్య చాలా తగ్గింది. ఇది సరైన పద్ధతి కాదు. మన రాష్ట్రం విషయానికి వస్తే 70 శాతం మంది మహిళలకు ఎలాంటి శస్త్రచికిత్స అవసరం లేకుండా సాధారణ కాన్పు అవుతుంది. వారికి నమ్మకం కలిగించాలి. ఈ విషయంలో మనోధైర్యం చాలా ముఖ్యం. తగిన వ్యాయామం చేయించాలి. సాధారణ కాన్పు చేయడానికి ఫెర్నాండేజ్‌ ఆసుపత్రి, ప్రభుత్వంతో కలిసి జిల్లాల వారీగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో శిక్షణ పొందిన మిడ్‌వైజ్‌(ప్రసూతి నిపుణురాలు)తో గర్భిణులకు శిక్షణ ఇచ్చి సాధారణ ప్రసవం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. శిక్షణ పొందిన 40 మందితో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవానికి వచ్చిన గర్భిణులకు అవగాహన కల్పించనున్నాం.

ఇవి పాటించాలి

హేమంత్‌ దేశ్‌పాండే(స్త్రీవైద్యనిపుణుడు, పుణె)

* గర్భం దాల్చిన తర్వాత తప్పని సరిగా పౌష్టికాహారం తీసుకోవాలి.

* ఎక్కువగా సమతుల ఆహారం ఉండేలా చూసుకోవాలి.

* హిమోగ్లోబిన్‌ 10 గ్రాములు ఉండేలా చూడాలి.

* ప్రతిరోజు కనీసం 10 సార్లు శిశువు కదలికలు ఉండాలి.

* ఐరన్‌, పోలిక్‌ యాసిడ్‌, క్యాల్షియం మాత్రలను క్రమం తప్పకుండా వాడాలి.

* గర్భం దాల్చిన తర్వాత 10 కిలోల బరువు తగ్గాలి.

* క్రమం తప్పకుండా వైద్యుల సలహా మేరకు వ్యాయామం చేయాలి.

* వీటిని తప్పనిసరిగా పాటించి, తగిన జాగ్రత్తలు తీసుకుంటే శస్త్రచికిత్స అవసరం లేకుండా సాధారణ ప్రసవం అవుతుంది.

* ఐదో రాష్ట్ర స్థాయి స్త్రీవైద్యనిపుణుల వైజ్ఞానిక సదస్సు ● వివిధ రాష్ట్రాల నుంచి హాజరైన వైద్యులు


తల్లిపాలే బిడ్డకు శ్రేయస్కరం

గర్భిణులకు సామూహిక సీమంతాలు నిర్వహించిన ప్రజాప్రతినిధులు, అధికారులు

దేవునిపల్లి(కామారెడ్డి గ్రామీణం), న్యూస్‌టుడే: తల్లిపాలే బిడ్డకు శ్రేయస్కరమని జిల్లా సంక్షేమాధికారిణి రాధమ్మ పేర్కొన్నారు. దేవునిపల్లి సెక్టార్‌ పరిధిలో శనివారం నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. తల్లిపాలతో బిడ్డకు నేరుగా పోషకాలు అందుతాయని, పుట్టిన ప్రతి బిడ్డకి ముర్రుపాలు తాగించాలన్నారు. గర్భిణులు, బాలింతలు సమతుల పౌష్టికాహారం తీసుకోవాలని, అప్పుడే ఆరోగ్యకరమైన మంచి బరువు ఉన్న శిశువులు జన్మిస్తారని తెలిపారు. అనంతరం గర్భిణులకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ టీచర్లు, జడ్పీటీసీ సభ్యురాలు రమాదేవి, వైస్‌ ఎంపీపీ ఉరుదొండ నరేష్‌, పీడీలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు రవితేజ, దంతేపల్లి స్వామి, మాజీ ఎంపీపీ మంగమ్మ, ఎంపీడీవో నాగేశ్వర్‌, సీడీపీవో శ్రీలత, సూపర్‌వైజర్‌ నాగమణి, అంగన్వాడీ టీచర్లు కల్పన, ఉమారాణి, పద్మ, అనసూయ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.