తలాపునే గోదారి.. ఆయకట్టు ఎడారి.. - Nizamabad - EENADU
close

ఆదివారం, సెప్టెంబర్ 22, 2019

ప్రధానాంశాలు

తలాపునే గోదారి.. ఆయకట్టు ఎడారి..

కాల్వలకు గండ్లు, శిథిలం

న్యూస్‌టుడే, తాడ్‌బిలోలి(రెంజల్‌)

ప్రధాన కాల్వకు పడిన గండి

తాడ్‌బిలోలి ఎత్తిపోతల గోదావరి పక్కనే ఉన్నా ఆయకట్టు మాత్రం ఎడారిగా మారింది. సాగునీటి కాల్వలకు గండ్లు పడ్డాయి. పంట పొలాలకు నీరందించాల్సిన కాల్వలు గడ్డితో మూసుకుపోయాయి. దీంతో రెండో స్టేజీకి నీరు రాక పంట భూములు బీడుగా మారుతున్నాయి. పచ్చని పంటలతో కళకళలాడాల్సిన ఈ గ్రామ పంట భూముల కళ తప్పింది.

1986లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం రెంజల్‌ మండలం తాడ్‌బిలోలిలో రూ.53 లక్షల వ్యయంతో రెండు స్టేజీల నిర్మాణం చేపట్టి ఎత్తిపోతల పథకాన్ని రైతులకు అంకితం చేసింది. 2,500 ఎకరాలకు సాగు నీరందించింది. కొన్నేళ్ల పాటు పంటభూములకు నీళ్లందాయి. ఆ తర్వాత మోటార్లు, కాల్వలు శిథిలదశకు చేరుకోవడంతో ఓ స్వచ్ఛంద సంస్థ గ్రామాన్ని దత్తత తీసుకొని వీటికి మరమ్మతులు చేయించింది. దీంతో ఎత్తిపోతలకు తిరిగి పూర్వవైభవం వచ్చింది.
తుప్పుపట్టిన మోటార్లు

నాలుగైదేళ్లుగా పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. కాల్వలకు గండ్లు పడ్డాయి. మోటార్లు తుప్పుపడుతున్నాయి. దీంతో భూస్వాములు ఈ ఎత్తిపోతలపై నమ్మకం కోల్పోయి సొంతంగా గోదావరి నదిలో మోటార్లు, పైపులైన్లు ఏర్పాటు చేసుకొని భూములు సాగు చేస్తున్నారు. చిన్న, సన్నకారు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. రెండో స్టేజీ పంపుహౌస్‌ మూతపడింది. మోటార్లు తుప్పు పట్టి పనికి రాకుండా పోయాయి.

గడ్డితో మూసుకుపోయిన కాల్వ

ఆయకట్టు విస్తీర్ణం - 2,500 ఎకరాలు

లబ్ధి పొందే గ్రామాలు - తాడ్‌బిలోలి, కోస్లి, మౌలాలితండా, ఎల్‌కే ఫారం, ఫకీరాబాద్‌

ఊరిస్తున్న స్థిరీకరణ పనులు

శిథిలదశకు చేరుకొన్న ఈ ఎత్తిపోతల పథకం స్థిరీకరణ పనులకు రూ.6 కోట్ల వ్యయంతో రెండేళ్ల క్రితం చిన్నతరహా నీటి పారుదల అధికారులు ప్రతిపాదనలు పంపారు. అయితే నేటికీ మంజూరు కాలేదు. ప్రతిపాదనల దశకే పరిమితం అయింది. గతంలో మంజూరు చేసిన రూ.53 లక్షల నిధుల్లో కొన్నింటిని వెచ్చించి ఇటీవల రెండు మోటార్లు కొనుగోలు చేశారు. కాల్వల పరిస్థితి మాత్రం యథావిధిగా ఉంది. స్థిరీకరణ పనులు చేపట్టి కాల్వలకు బదులుగా రెండున్నర కిలోమీటర్ల మేరకు స్టీల్‌ పైపులైను వేస్తే శాశ్వత పరిష్కారం లభిస్తుంది. బీడు భూములు పచ్చని పంటలతో సస్యశ్యామలం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

తాడ్‌బిలోలి ఎత్తిపోతల మొదటి స్టేజీ పంపు హౌస్‌

నిధులు మంజూరు చేయాలి - దర్శన్‌రెడ్డి, ఆయకట్టు రైతు

స్థిరీకరణ పేరిట రెండేళ్లుగా పనులు జాప్యం చేస్తున్నారు. రూ.6 కోట్లు మంజూరవుతున్నాయంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఎత్తిపోతల పనిచేయక తలాపునే గోదావరి నది ఉన్నా నీటిని వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది. ఫలితంగా పంట భూములు బీడుగా మారుతున్నాయి. పలువురు రైతులు బోరుబావుల తవ్వకం వైపు మొగ్గు చూపుతున్నారు. స్థిరీకరణ కోసం తక్షణమే నిధులు మంజూరు చేసి కాల్వలు బాగు చేయాలి. ఎత్తిపోతలకు పూర్వ వైభవం తీసుకొస్తే వ్యవసాయంపై ఆధారపడ్డ తమ జీవన పరిస్థితులు మెరుగవుతాయి.

పైపులైనుతోనే శాశ్వత పరిష్కారం - శ్రీనివాస్‌, ఆయకట్టు రైతు

ఎత్తిపోతల పనులు చేపట్టి కాల్వల స్థానంలో స్టీల్‌ పైపులైను వేయాలి. నల్లరేగడి నేలలు కావడంతో కాల్వలకు తరచూ గండ్లు పడుతున్నాయి. దీంతో రెండోస్టేజీకి సాగునీరు రాక పంటభూములు బీడుగా మారుతున్నాయి. రెండున్నర కిలోమీటర్ల మేరకు పైపులైను వేస్తే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. రెండు స్టేజీల పరిధిలో పంట పొలాలకు సమృద్ధిగా నీరు అందుతుంది.

ప్రతిపాదనలు వెళ్లాయి - మౌలానా, ఎత్తిపోతల అధ్యక్షుడు

ఎత్తిపోతల స్థిరీకరణ పనుల కోసం నీటిపారుదల అధికారులు రూ.6 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. కాల్వల మరమ్మత్తుకు బదులు పైపులైను వేయాలని రైతులతో అధికారులకు వివరించాం. రైతుకు ప్రయోజనం కలిగే పనులే చేపట్టాలి. అధికారులు మాత్రం నిధులు వస్తున్నాయంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇప్పుడైనా రైతుల బాధలు పట్టించుకోవాలి.

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.