ఎడతెరిపి లేకుండా - Nizamabad - EENADU
close

గురువారం, సెప్టెంబర్ 19, 2019

ప్రధానాంశాలు

ఎడతెరిపి లేకుండా

జిల్లా సగటు వర్షపాతం 60.8 మి.మీ.లు

జుక్కల్‌లో అత్యధికం.. మాచారెడ్డిలో అత్యల్పం

ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి

ఉద్ధృతంగా పారుతున్న లింగంపేట వాగు

అల్పపీడనం, ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ఫలితంగా వారం రోజులుగా జిల్లాలో వానలు కురుస్తున్నాయి. సాధారణం నుంచి ఒక మోస్తరు వర్షాలు పడుతుండడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జలాశయాలకు వరద వస్తోంది. నీటి కుంటలు నిండాయి. ఈ సీజన్‌లో వర్షాలు ఆలస్యంగా రావడం, లోటు వర్షపాతం నెలకొనడంతో ఆందోళనలో ఉన్న అన్నదాతలకు ప్రస్తుత వర్షం ఊరటనిచ్చింది. శనివారం ఒక్క రోజే జిల్లాలో సగటున 60.8 మి.మీ.లు వర్షం కురియడం గమనార్హం. మరో మూడు, నాలుగు రోజులు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

మెంగారం చెరువు అలుగు తెగిపోవడంతో దిగువకు పోతున్న నీరు

జిల్లా వ్యాప్తంగా జూన్‌ నెల ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 7677.9 మి.మీ.ల వర్షపాతం పడాల్సి ఉండగా 8421.1 మి.మీ.లు కురిసింది. జుక్కల్‌లో అత్యధికంగా 89.2 మి.మీ.లు, మాచారెడ్డిలో అత్యల్పంగా 27.4 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. ఎల్లారెడ్డి, లింగంపేట్‌, కామారెడ్డి, తాడ్వాయి, నాగిరెడ్డిపేట మండలాల్లో కూడా అధికంగా వర్షం పడింది. మద్నూర్‌, బాన్సువాడ మండలాల్లో మాత్రమే లోటు వర్షపాతం ఉంది. మిగిలిన మండలాల్లో సాధారణ వర్షాలు పడ్డాయి.

రోజంతా ముసురే

జిల్లాలో శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం సాయంత్రం వరకు చిరుజల్లులు కురిశాయి. గత వారం రోజుల నుంచి వానలు పడుతుండడంతో వరద నీరు జలాశయాల్లోకి చేరుతోంది. కౌలాస్‌ మినహా పోచారం, కళ్యాణి, సింగీతం ప్రాజెక్టుల్లోకి వరద వచ్చి చేరుతోంది. గాంధారి, లింగంపేట్‌ వాగులు ఉద్ధృతంగా పారుతున్నాయి. ఇలాగే మరో మూడు రోజులు వానలు పడితే పోచారం జలాశయం నిండనుంది. ఇప్పటికే కళ్యాణి నిండిపోయింది. సింగీతంలోకి వరద వస్తోంది. అటవీ ప్రాంతాల్లో ఉన్న చెక్‌డ్యాంలు, కుంటలు నిండాయి.

పంటలకు ప్రాణం

నిరాశలో ఉన్న రైతన్నలకు ఈ వర్షాలు ఊపిరి పోశాయి. విత్తుకున్న పంటలకు ఇక ఢోకా లేదు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమై 60 రోజులు గడిచింది. అరకొర వానలకే రైతులు విత్తనాలు వేశారు. ఆ తర్వాత వర్షాలు ముఖం చాటేయడంతో మొక్కజొన్న, పత్తి ఎండిపోయే దశకు చేరుకున్నాయి. దోమకొండ, మద్నూర్‌, మాచారెడ్డి, బీబీపేట, పిట్లం, నిజాంసాగర్‌ తదితర మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. పంటలపై ఆశలు వదులుకుంటున్న తరుణంలో కురుస్తున్న ఈ వర్షాలు ఊరటనిచ్చాయి. జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వానలు పడుతుండడంతో వరినాట్లు వేస్తున్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.