బడులు బతికించారు - Nizamabad - EENADU
close

ఆదివారం, సెప్టెంబర్ 22, 2019

ప్రధానాంశాలు

బడులు బతికించారు

శివాయిపల్లి, బస్వాపూర్‌, లక్ష్మీనగర్‌తండాల్లో పెరిగిన విద్యార్థుల సంఖ్య

ప్రైవేటుకు దీటుగా రాణిస్తున్న సర్కారు బడులు ● ఆకట్టుకుంటున్న ఆంగ్లమాధ్యమ బోధన

న్యూస్‌టుడే, భిక్కనూరు

ఏడేళ్ల తర్వాత తెరుచుకున్న శివాయిపల్లి పాఠశాల

ప్రైవేటు పాఠశాలల ఆధిపత్యం సాగుతున్న రోజులివి.. అందుకు భిన్నంగా భిక్కనూరు, రాజంపేట మండలాల్లోని మూడు సర్కారు ప్రాథమిక పాఠశాలలు రాణిస్తున్నాయి. వీటిల్లోని ఉపాధ్యాయులు ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తూ విద్యార్థులను ఆకట్టుకుంటున్నారు. వీరి చొరవతో పిల్లల చదువు కోసం వెచ్చించే ప్రైవేటు ఫీజుల మోత నుంచి తల్లిదండ్రులకు ఉపశమనం లభించింది.

ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధనతో పాటు చక్కగా విద్యాబుద్ధులు నేర్పుతుండటంతో విద్యార్థుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. శివాయిపల్లిలో ఏడేళ్ల క్రితం మూసివేసిన పాఠశాల గ్రామస్థుల దృఢసంకల్పంతో తెరుచుకొంది. ప్రస్తుతం ఇక్కడ 60 మంది విద్యార్థులు చేరారు. బస్వాపూర్‌ ప్రాథమిక పాఠశాలలో నాలుగేళ్ల క్రితం 61 మంది ఉన్న విద్యార్థుల సంఖ్య నేడు 190కి చేరింది. లక్ష్మీనగర్‌తండా పాఠశాలలో మొన్నటి వరకు 20 మంది ఉన్న విద్యార్థుల సంఖ్య ఈ ఏడాది 30 దాటింది. ఈ విజయాలు ఎలా సాధ్యమయ్యాయంటే..

ఏకమైన శివాయిపల్లి..

రాజంపేట మండలం శివాయిపల్లి.. వందశాతం ఇంకుడు గుంతలు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాల్లో జిల్లాలోని అన్ని పల్లెల కంటే ముందుండి స్వచ్ఛభారత్‌ పురస్కారం కింద రూ.10 లక్షలు అందుకొంది. అన్నింటా ఆదర్శంగా నిలుస్తున్న ఈ గ్రామంలో ఏడేళ్ల కిందట విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే కారణంతో ప్రాథమిక పాఠశాలను మూసివేశారు. ఈ ఏడాది కొలువుదీరిన పంచాయతీ పాలకవర్గం, గ్రామస్థులు, ఉద్యోగులు, యువజన సంఘాల సభ్యులు అందరు కలిసి బడిని తిరిగి ప్రారంభించాలని తీర్మానం చేశారు. ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తామంటూ తల్లిదండ్రులను ఒప్పించారు. ముందుగా 46 మంది విద్యార్థులతో పాఠశాల ప్రారంభించారు. అధికారులు ఇద్దరు ఉపాధ్యాయులను డిప్యుటేషన్‌పై నియమించారు. 12 రోజుల్లోనే విద్యార్థుల సంఖ్య 60కి పెరిగింది. గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు మధుసూదన్‌రెడ్డి, ఆనంద్‌రావు, మల్లేషం, సిద్దయ్య, వనిత సొంత ఖర్చులతో ఒక వాలంటీరును నియమించారు. ఉప సర్పంచి సంధ్య ఇక్కడే విద్యాబోధన చేస్తున్నారు.

ప్రార్థనలో నిలబడిన బస్వాపూర్‌ చిన్నారులు

బస్వాపూర్‌..

భిక్కనూరు మండలం బస్వాపూర్‌ ప్రాథమిక పాఠశాలలో 2015-16లో కేవలం 61 మంది విద్యార్థులు ఉండేవారు. మూడేళ్ల కిందట ఉపాధ్యాయులు గ్రామస్థుల సహకారంతో ఆంగ్లమాధ్యమ విద్య మొదలెట్టారు. ఎల్‌కేజీ నుంచి అయిదో తరగతి వరకు బోధిస్తున్నారు. దీంతో ఏటా విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇక్కడ కేవలం రెండు పోస్టులు మాత్రమే ఉండగా ప్రభుత్వం మరో ముగ్గురు ఉపాధ్యాయులను డిప్యుటేషన్‌పై నియమించింది. విద్యార్థుల సౌకర్యార్థం స్పోకెన్‌ ఇంగ్లీష్‌, డిజిటల్‌ తరగతి గది, కంప్యూటర్‌ క్లాస్‌రూం ఏర్పాటు చేశారు. నిత్యం గణితం, ఆంగ్లం పాఠ్యంశాలకు రెండేసి పిరియడ్లు కేటాయిస్తున్నారు. ‘సీ’ గ్రేడు విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

తండాలోనూ పెరిగారు

భిక్కనూరు మండలం లక్ష్మీనగర్‌తండాలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగింది. గతేడాది విధుల్లో చేరిన తబిత అనే ఉపాధ్యాయురాలు ఇంటింటా తిరిగి తల్లిదండ్రులను ఒప్పించి పిల్లలను పాఠశాలకు తీసుకొచ్చారు. దీంతో ఈ ఏడాది ఇక్కడ విద్యార్థుల సంఖ్య 30కి పైగా పెరిగింది. వారి సౌకర్యార్థం సొంతంగా రూ.20 వేలు ఖర్చు చేసి పాఠశాలకు రంగులు వేయించి ముస్తాబు చేశారు. దీంతో విద్యార్థులు ఆకర్షితులై పాఠశాలకు క్రమం తప్పకుండా వస్తున్నారు.

డబ్బులు వృథా చేసుకోవద్దు

- విఠల్‌రెడ్డి, సర్పంచి, శివాయిపల్లి

తల్లిదండ్రులు ప్రైవేటు మోజులోపడి వేలాది రూపాయలు వృథా చేసుకుంటున్నారు. అందుకే గ్రామస్థుల సహకారంతో స్థానికంగా పాఠశాలను ఏర్పాటు చేసుకున్నాం. ఒకరిద్దరు వ్యతిరేకిస్తున్నప్పటికీ అందరి నుంచి సహకారం లభిస్తోంది.

మూడేళ్ల నుంచి బోధన

బస్వాపూర్‌ ప్రాథమిక పాఠశాలలో మూడేళ్ల నుంచి ఆంగ్లమాధ్యమంలో బోధన కొనసాగుతోంది. ఎల్‌కేజీ, యూకేజీ తరగతులు కూడా నిర్వహిస్తున్నాం. గ్రామస్థుల సహకారం మరువలేనిది. అయితే తరగతి గదులు సరిపోవడం లేదు.

- భాగ్యలక్ష్మి, హెచ్‌ఎం, బస్వాపూర్‌ ప్రాథమిక పాఠశాల

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.