రైతు పింఛన్‌.. ఎందుకు జాప్యం - Nizamabad - EENADU
close

ఆదివారం, సెప్టెంబర్ 22, 2019

ప్రధానాంశాలు

రైతు పింఛన్‌.. ఎందుకు జాప్యం

ముందుకు కదలని దరఖాస్తుల ప్రక్రియ

నెల రోజులుగా అన్నదాతల ఎదురుచూపులు

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ వ్యవసాయం

దేశ వ్యాప్తంగా రైతులకు పింఛన్‌ పథకం వర్తింపజేయాలనే లక్ష్యంతో కేంద్రం మార్గదర్శకాలు ఇచ్చినా అమలు ప్రక్రియ ముందుకు పడడం లేదు. ఈ సీజన్‌ నుంచి ప్రతి రైతుకు పెట్టుబడి సాయం కింద ఏడాదికి రూ. 6 వేలు ఇస్తున్నట్లు ప్రకటించిన మోదీ ప్రభుత్వం మరో బృహత్తర పథకానికి నాంది పలికింది. ప్రధానమంత్రి కిసాన్‌ మన్‌ధన్‌ యోజన కింద చిన్న, సన్నకారు రైతులకు అర్హతను బట్టి నెలవారీగా పింఛను ఇచ్చేలా నిబంధనలు పొందుపరిచింది. గత నెల 9న పథకం అమలుపై పూర్తిస్థాయి మార్గదర్శకాలు విడుదల చేశారు. దీనిని అన్నదాతలకు చేరువ చేసేందుకు క్షేత్రస్థాయి కార్యాచరణకు వ్యవసాయశాఖ ముందుకు రావడం లేదు.

జీవిత బీమా సంస్థ భాగస్వామ్యంతో వాలంటరీ కాంట్రిబ్యూషన్‌ ఆధారంగా పీఎం కిసాన్‌ మన్‌ధన్‌ పింఛన్‌ పథకాన్ని అమల్లోకి తెస్తున్నారు. 60 ఏళ్లు నిండిన తర్వాత రైతుకు నెలకు రూ. 3 వేల చొప్పున పింఛన్‌ అందిస్తారు. 18 ఏళ్ల నుంచి 40 ఏళ్లలోపు ఉన్నవారు తమ వయస్సు ఆధారంగా నెలనెలా ప్రీమియం చెల్లించాలి. నెలవారి నిర్దేశిత ప్రీమియంలో సగం ప్రభుత్వం చెల్లిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పట్టాదారు పాసుపుస్తకాల ఆధారంగా ఐదెకరాల లోపు ఉన్న చిన్న, సన్నకారు రైతులందరు దీని పరిధిలోకి వస్తారు. అర్హులైన వారు రూ. 30 చెల్లించి తమ పేర్లను నమోదు చేసుకోవాలి. ఇందులో నెలవారీగా నిర్దేశిత ప్రీమియం రైతు కడితే సరిపోతుంది. జిల్లాలో 2.26 లక్షల మంది రైతుల్లో 40 ఏళ్లలోపు కనీసం లక్ష మంది ఉంటారని అనధికారిక అంచనా. ముఖ్యంగా 35-40 ఏళ్లలోపు వారే 80 శాతం మంది ఉంటారని భావిస్తున్నారు.

వృద్ధాప్యంలో ఆసరా.. ఉద్యోగులకు, కార్మికులకు పదవీ విరమణ తర్వాత వచ్చే పింఛన్‌ మాదిరిగానే దేశానికి అన్నం పెట్టే రైతుకు కూడా వయస్సు పైబడిన తర్వాత ఏదో ఒక రూపంలో ఆసరా ఉండాలనే సదుద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాదే కొత్తగా అన్నదాతకు ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చారు. చేసినంత కాలం పని చేసి వృద్ధాప్యంలో ఈ డబ్బులు తనకు, తన కుటుంబానికి ఎంతో కొంత ఉపయోగపడతాయని రైతులు ఆసక్తి చూపుతున్నారు. అయితే దాదాపు నెల రోజుల కిందట ప్రకటన వచ్చి, 24 రోజుల క్రితం మార్గదర్శకాలొచ్చినా ఇప్పటికీ సంబంధిత అధికారుల నుంచి ఏమాత్రం స్పందన లేదని జిల్లా రైతులు, రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. గరిష్ఠ వయో పరిమితి 40 ఏళ్లు ఉండడంతో, దానికి దగ్గరగా ఉన్న వయస్సు రైతులు ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికైనా వ్యవసాయశాఖ చొరవ తీసుకొని పథకానికి సంబంధించి కార్యాచరణ మొదలు పెట్టాలని కోరుతున్నారు. ఈ మేరకు ‘న్యూస్‌టుడే’ జిల్లా వ్యవసాయాధికారి మేకల గోవింద్‌ను సంప్రదించగా పై అధికారుల నుంచి జిల్లాకు ఆదేశాలు రావాల్సి ఉందని తెలిపారు. ఉత్తర్వులు వచ్చిన వెంటనే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభిస్తామని చెప్పారు.

 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.