శిక్షణతో సరి.. - Nizamabad - EENADU
close

శుక్రవారం, సెప్టెంబర్ 20, 2019

ప్రధానాంశాలు

శిక్షణతో సరి..

కార్మికులకు చేయూత కరవు

 జాడలేని జాతీయ చేనేత అభివృద్ధి పథకం 

న్యూస్‌టుడే, ఆర్మూర్‌

చేనేత కార్మికుల సంక్షేమం కోసం తీసుకొచ్చిన జాతీయ చేనేత అభివృద్ధి పథకం అమలుకు నోచుకోవడం లేదు. దీని కింద కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల కిందట తొలివిడత నిధులు మంజూరు చేయగా.. కొంత మందికి శిక్షణ ఇచ్చారు. రెండో విడతలో వర్క్‌షెడ్డు నిర్మాణం, మగ్గాలు, నూలు, ఇతర ముడి సరకుల కొనుగోలుకు నిధులు మంజూరు కావలసి ఉండగా.. అంతులేని జాప్యం నెలకొంది.

ఉభయ జిల్లాల్లోని చేనేత సహకార సంఘాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం కొరవడింది. ఒకప్పుడు వేలాది మంది కార్మికులతో అలరారిన సంఘాల్లో నేడు కొన్ని మరుగునపడ్డాయి. ఆర్మూర్‌, పట్టు చేనేత సహకార సంఘాలు ప్రతికూల పరిస్థితుల్ని తట్టుకొని నిలబడి ఇప్పటికీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ఆర్మూర్‌ సంఘంలో 50 మంది మహిళా కార్మికులు రకరకాల డిజైన్లలో వస్త్రాలు నేస్తున్నారు. కండెలు చుట్టడం, ఇతర పనులు చేస్తున్నారు. పట్టు సంఘంలో కొంతమంది పాతతరం వారు మాత్రమే పట్టు వస్త్రాలు నేస్తున్నారు. పాలకవర్గాల ప్రత్యేకశ్రద్ధతో ఈ సంఘాలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి.

శిక్షణతో సరిపెట్టారు

కేంద్ర ప్రభుత్వం జాతీయ చేనేత అభివృద్ధి పథకం కింద చేనేత కార్మికులకు తగిన శిక్షణనిచ్చి, ఉపాధి కల్పించాలని నిర్ణయించింది. ఆర్మూర్‌ చేనేత సహకార సంఘంతో పాటు మరికొన్ని సంఘాలను కలిపి ఒక క్లస్టర్‌గా పరిగణించి, ఈ పథకం అమలుకు పూనుకొంది. ఇందుకోసం రూ.88 లక్షలు మంజూరు చేసింది. తొలివిడతగా రూ.24 లక్షలు విడుదల చేసింది. దాదాపు రెండేళ్ల కిందట ఆర్మూర్‌ సంఘానికి చెందిన 60 మందికి, నిజామాబాద్‌కు సంఘానికి సంబంధించి 20, ఆర్మూర్‌ పట్టు చేనేత సంఘానికి చెందిన 20 మంది కార్మికులకు వివిధ డిజైన్లలో వస్త్రాల నేత, రంగుల అద్దకం, కండెలు చుట్టడం, ఇతర అంశాల్లో శిక్షణ ఇచ్చారు. ఈ సమయంలో అవసరమైన

నూలు, ఇతర ముడి సరకులను సమకూర్ఛి. శిక్షణాభృతి ఇచ్చారు. ఇంత వరకు బాగానే ఉన్నా వారికి ఉపాధి కల్పించడాన్ని విస్మరించారు.

నిధులొస్తేనే ప్రయోజనం

- కామని రామకృష్ణ, ఆర్మూర్‌ చేనేత సంఘం అధ్యక్షుడు

జాతీయ చేనేత అభివృద్ధి పథకం కింద రూ.1.26 కోట్లు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించగా.. రూ.88 లక్షలు మంజూరయ్యాయి. తొలివిడతగా వచ్చిన నిధులతో వంద మంది కార్మికులకు భృతి ఇచ్చి, శిక్షణ ఇచ్చారు. మిగతా నిధులతో ఉపాధి కల్పిస్తామన్నారు. తర్వాత విస్మరించారు.

రెండో విడతకు మోక్షమేది?

తొలివిడత విడుదల చేసినవి పోను మిగతా రూ.64 లక్షల నిధులు ఎప్పుడు విడుదలవుతాయో.. కార్మికులకు ఎప్పుడు ఉపాధి కల్పిస్తారో తెలియడం లేదు. చాలీచాలని ఆదాయంతో ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికులను సైతం ప్రోత్సహించడం లేదు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.