చిట్టి చేతులు గట్టి లక్ష్యం - Nizamabad - EENADU
close

శుక్రవారం, సెప్టెంబర్ 20, 2019

ప్రధానాంశాలు

చిట్టి చేతులు గట్టి లక్ష్యం

చిన్నారుల సంరక్షణలో ఏపుగా మొక్కలు

ఆహ్లాదకర వాతావరణం ఆ పాఠశాల సొంతం

పాఠశాల ఆవరణలో ఏపుగా పెరిగిన చెట్లు

మారుమూల పల్లెలోని ప్రాథమిక పాఠశాల ఇది. అక్కడి ఉపాధ్యాయులకు మొక్కలను పెంచాలని ఆలోచన ఉన్నా.. ప్రహరీ లేదు. ఆవరణలో ఖాళీ స్థలమూ తక్కువే. లక్ష్యం చేరుకోవాలనే తపనతో గురువులు చుట్టూ కంచె వేసి, పచ్చదనం పెంపునకు ప్రాణం పోశారు. విద్యార్థులను చైతన్యపరిచి పచ్చ‘దనం’ పెంపొందించారు.

న్యూస్‌టుడే, దోమకొండ

దోమకొండ మండలం సంగమేశ్వర్‌ ఎస్సీ వాడ ప్రాథమిక పాఠశాల పచ్చదనానికి చిరునామాగా నిలుస్తోంది. ప్రకృతిని ఆస్వాదిస్తూ.. చిన్నారులు ఆహ్లాదకర వాతావరణంలో చదువులు కొనసాగిస్తున్నారు. నాటిన మొక్కలన్నింటినీ సంరక్షించుకొంటున్నారు. నిత్యం బాలల సంఘంలోని హరితహారం కమిటీ సభ్యులు మొక్కలు, చెట్లను పర్యవేక్షిస్తూ కాపాడుతున్నారు.

పచ్చదనం, పూల మొక్కలతో సంగమేశ్వర్‌ హరిజనవాడ ప్రాథమిక పాఠశాల

ఉపాధ్యాయుల ఆలోచన

పాఠశాలకు ఖాళీ స్థలం ఉంది అయిదు గుంటలే. చిన్నారులు ఆడుకొనేందుకు మూడు గుంటల స్థలాన్ని ఖాళీగా ఉంచి మిగతా భాగంలో 2014 నుంచి మొక్కలు నాటుతూనే ఉన్నారు. మొదట్లో మేకలు, గొర్రెలు తినేస్తుండటంతో ఉపాధ్యాయిని శిరీష సమస్యను ప్రధానోపాధ్యాయుడి దృష్టికి తీసుకెళ్లి పరిష్కార మార్గాలు ఆలోచించారు. అలా 2016లో స్థలం చుట్టూరా కంచె వేసి కుళాయి నీటి ద్వారా మొక్కలను పెంచసాగారు. ఇప్పటికీ 250 వరకు నాటారు. మామిడి, వేప, జామ, అల్లనేరేడు, దానిమ్మ, సీతాఫలం, బొప్పాయి, రేగుపండ్లు, చమాన్‌ చెట్లు, పూల మొక్కలు ఏపుగా పెరిగి పచ్చదనం ఒరవడిని నింపాయి. ఆయా చెట్ల ద్వారా వచ్చే పండ్లు పిల్లలకే ఇస్తున్నారు. కిచెన్‌ గార్డెన్‌ నిర్వహిస్తారు. వివిధ కూరగాయలను మధ్యాహ్న భోజనంలో వినియోగిస్తున్నారు. చిన్నారులకు పౌష్టికాహారం, పచ్చదనం విలువలపై అవగాహన కల్పిస్తున్నారు.

పరిశుభ్రతలోనూ మేటి

పరిశుభ్రతలోనూ ఆదర్శంగా నిలుస్తున్నారు. మురుగు నిల్వకుండా ఇంకుడు గుంతను తవ్వించి భూగర్భ జలాల పెంపునకు ఊతమిస్తున్నారు. చేతులు కడుక్కునే విధానం, వ్యక్తిగత పరిశుభ్రత విషయాల్లో ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ చిన్నారులకు నేర్పిస్తున్నారు. పాఠశాలలో చెత్త లేకుండా చేసి, స్వచ్ఛ భారత్‌కు సహకరిస్తున్నారు.

ప్రశంసలు.. పురస్కారాలు

పాఠశాలలో పచ్చదనం పెంపు, విద్యార్థులకు పరిశుభ్రత, క్రమశిక్షణపై అవగాహన కల్పిస్తూ ప్రధానోపాధ్యాయుడు చింతల సందీప్‌ ప్రశంసలు, పురస్కారాలు అందుకొంటున్నారు. మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయునిగా రూ.10,116 నగదు పురస్కారం అందుకున్నారు. దాతల సహకారంతో ఇప్పటికే 35 మంది చిన్నారులకు తెల్లదుస్తులు, బూట్లు అందించారు.

మరెన్నో కార్యక్రమాలు

ఉత్తమ ఉపాధ్యాయుడిగా పురస్కారం అందుకుంటున్న సందీప్‌

దేశ, జాతీయ స్థాయిలోని ఆదర్శ నాయకుల జీవితాలను బాలల సంఘం సమావేశాల్లో తెలియజేస్తూ... నాయకత్వ లక్షణాలు పెంపొందిస్తున్నారు. ● జాతీయ పండగల్లో జాతీయ నాయకుల వేషధారణలతో విద్యార్థులు సందడి చేస్తున్నారు. ● పిల్లలకు అర్థమయ్యే రీతిలో చాట్స్‌, డ్రాయింగ్‌ బొమ్మలు తరగతి నిండా ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ● విద్యార్థులకు క్రమశిక్షణ, సత్ప్రవర్తన, నైతిక విలువల గురించి అవగాహన కల్పిస్తున్నారు.

ఆహ్లాదకర వాతావరణం

పచ్చని చెట్లతో పాఠశాల ఆవరణ బాగుంది. ఆహ్లాదకర వాతావరణంలో మంచిగా చదువుకొంటున్నాం. మొక్కలను నిత్యం పర్యవేక్షిస్తుంటాం.

- సమిత, 5వ తరగతి, సంగమేశ్వర్‌

బోధన బాగుంది

పచ్చదనమే కాకుండా మా బడిలో విద్యాబోధన చాలా బాగుంటుంది. అన్ని సబ్జెక్టులను అర్థమయ్యే రీతిలో బోధిస్తున్నారు.

- జి.రాజు, 5వ తరగతి, సంగమేశ్వర్‌

సమష్టి కృషితో పచ్చదనం

తోటి ఉపాధ్యాయురాలు శిరీష, చిన్నారుల సమష్టి కృషితో పాఠశాలలో పచ్చదనం పెరిగింది. ఉన్న వనరులను ఉపయోగించుకుని ఆదర్శంగా నిలవాలని పనిచేస్తున్నాం. పచ్చదనం, విద్యార్థుల క్రమశిక్షణ, చదువులు ఆదర్శనీయంగా ఉండటంతో ప్రశంసలు అందుకోగలుగుతున్నాం.

- చింతల సందీప్‌

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.