23 మిల్లులు.. 18 వేల టన్నులు - Nizamabad - EENADU
close

సోమవారం, సెప్టెంబర్ 16, 2019

ప్రధానాంశాలు

23 మిల్లులు.. 18 వేల టన్నులు

● ఏళ్లుగా సీఎంఆర్‌ అప్పగించని వైనం

● అధికారుల చర్యలే కీలకం

న్యూస్‌టుడే, భిక్కనూరు

రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని కస్టమ్‌ మిల్లింగ్‌ కింద తీసుకుంటున్న మిల్లర్లు తిరిగి ఇవ్వడంలో మొండిగా వ్యవహరిస్తున్నారు. గడిచిన ఆరేళ్లలో ఉభయ జిల్లాల్లో కలిపి 23 మిల్లుల యజమానులు బకాయి పడ్డారు. మొత్తంగా 18 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని తిరిగి ఇవ్వాల్సి ఉంది. వీరి విషయంలో అధికారులు పక్కాగా వ్యవహరిస్తే సీఎంఆర్‌ మొత్తం తిరిగొచ్చే అవకాశాలున్నాయి.

న్యూస్‌టుడే, ఇందూరు సిటీ

నిజామాబాద్‌ జిల్లాలో 2012 నుంచి ఇప్పటి వరకు 10 మంది మిల్లర్లు సీఎంఆర్‌ బకాయిపడ్డారు. వీరి నుంచి 6,362 మెట్రిక్‌ టన్నుల బియ్యం తిరిగి రావాల్సి ఉంది. ఇందుకోసం ఇటీవల జేసీ అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. మొత్తం సీఎంఆర్‌ లక్ష్యాన్ని తిరిగి ఇవ్వాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు. ● కామారెడ్డి జిల్లాలోనూ 10 మంది మిల్లర్లు 2013 నుంచి సీఎంఆర్‌ బకాయి పడ్డారు. వీరి నుంచి 11 వేల పైచిలుకు మెట్రిక్‌ టన్నుల బియ్యం రావాల్సి ఉంది. వీరి విషయంలోనూ జిల్లా అధికారులు చర్యలు ప్రారంభించారు.

నాలుగు విడతల్లో..

● మిల్లర్ల వద్ద పెండింగ్‌ సీఎంఆర్‌ను రాబట్టేందుకు గతంలో అధికారులు పలు రకాలుగా ప్రయత్నించారు. చివరకు రెవెన్యూ రికవరీ చట్టాన్ని ప్రయోగించాలని భావించారు. నేడు, రేపు అంటూ మిల్లర్లు కాలం వెల్లదీస్తూ వచ్చారు. తాజాగా పౌర సరఫరాల కమిషనర్‌ చేపట్టిన సమీక్షలో మిల్లర్లకు చివరి అవకాశంగా.. నాలుగు విడతల్లో సీఎంఆర్‌ను అప్పగించేందుకు వెసులుబాటు కల్పించారు. ● మొదట 25 శాతం సీఎంఆర్‌ చెల్లించి మిగిలిన 75 శాతానికి బ్యాంకు గ్యారంటీ ఇస్తే తిరిగి సీఎంఆర్‌ కేటాయిస్తామని ప్రకటించారు. ఇలా నాలుగు విడతల్లో మొత్తం సీఎంఆర్‌ను ఇచ్చేయాల్సి ఉంటుంది. తాజా నిర్ణయం ప్రకారం ఉభయ జిల్లాల్లో ఎంతమంది మిల్లర్లు పెండింగ్‌ సీఎంఆర్‌ను తిరిగి ఇస్తారనేది చర్చనీయంగా మారింది.

పక్కాగా వ్యవహరించాలి

మిల్లర్ల నుంచి సీఎంఆర్‌ బకాయిలు రాబట్టడంలో అధికారులు ఇప్పటికైనా కఠినంగా వ్యవహరించాలి. ఉభయ జిల్లాల్లో కలిపి దాదాపు రూ. 6 కోట్ల విలువ చేస్తే బియ్యం రావాల్సి ఉంది. ఇందుకోసం తాజాగా కమిషనర్‌ ప్రకటించినట్లు నాలుగు విడతల్లో సీఎంఆర్‌ను రాబట్టేలా చొరవ చూపాలి.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.