శనివారం, డిసెంబర్ 07, 2019
ఐదు నెలలుగా ఎదురుచూస్తున్న విద్యావాలంటీర్లు
ఉమ్మడి జిల్లాలో చెల్లించాల్సినవి రూ. 6.6 కోట్లు
న్యూస్టుడే, నిజామాబాద్ విద్యావిభాగం
విద్యావాలంటీర్ల ఆశలపై నీళ్లు చల్లుతున్నారు. సకాలంలో వేతనాలు చెల్లించడం లేదు. గత విద్యాసంవత్సరం పని చేసిన వీవీలనే ఈ సారి పునరుద్ధరించారు. హైకోర్టు ఆదేశాల మేరకు పాత వారినే కొనసాగిస్తున్నారు. గడిచిన విద్యా సంవత్సరం మూడు నెలలు.. ఈ ఏడాది రెండు నెలల బకాయిలు చెల్లించాల్సి ఉంది. పలుమార్లు విద్యాశాఖ అధికారులకు విన్నవించినా స్పందన కరవైంది. తమ బతుకులు దయనీయంగా మారాయని, కుటుంబాన్ని పోషించుకోవడం ఇబ్బందిగా మారిందని వీవీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో 2167 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటి పరిధిలో 19,679 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. వీరికి తోడుగా మారుమూల ప్రాంతాల్లో 1101 మంది విద్యావాలంటీర్లు సేవలందిస్తున్నారు. గతంలో వీరికి రూ. 8 వేల వేతనం చెల్లించేవారు. గతేడాది నుంచి రూ. 12 వేలకు పెంచారు. ఈ నేపథ్యంలో నిరుద్యోగ అభ్యర్థుల నుంచి స్పందన పెరిగింది. ఈ సారి కొత్తగా నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధం కాగా పలువురు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం పాత వారినే కొసాగించాలని విద్యాశాఖకు ఉత్తర్వులు ఇచ్చింది. పోరాడి విధుల్లో చేరిన వారికి వేతనాలు చెల్లించకపోవడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోంది. తాజాగా కొత్త ఉపాధ్యాయులు విధుల్లో చేరడంతో వీవీల కొనసాగింపుపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఫలితంగా వారి పరిస్థితి అడకత్తెరలో పోకలా తయారైంది.
ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు
- రాజు, డీఈవో, కామారెడ్డి
వీవీలకు వేతనాలను వారి ఖాతాల్లో జమ చేయడం ప్రభుత్వ పరిధిలో జాప్యమవుతోంది. విద్యాశాఖ ఉన్నతాధికారులకు సమస్యను నివేదించాం. త్వరలో బకాయిలు చెల్లించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
జిల్లా వార్తలు