వినతి వినూత్నం - Nizamabad - EENADU
close

ఆదివారం, సెప్టెంబర్ 15, 2019

ప్రధానాంశాలు

వినతి వినూత్నం

సామాజిక మాధ్యమాల్లో ఫిర్యాదుల స్వీకరణ
వివరాలు వెల్లడించిన సీపీ కార్తికేయ
న్యూస్‌టుడే, ఇందూరు సిటీ

మీకు ఎక్కడైనా మోసం జరిగినా.. ఈవ్‌టీజింగ్‌కు గురైనా... మీ కళ్లముందు దగా కనిపించినా ఠాణాకు వెళ్లి ఫిర్యాదు చేయనవసరం లేదు.. సామాజిక మాధ్యమాల్లో ఫిర్యాదు చేయవచ్చు. ‘‘24 గంటల్లో ఎప్పుడైనా ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు ఇవ్వొచ్చని సూచించారు. వాటికి సత్వర పరిష్కారం చూపిస్తామని సీపీ కార్తికేయ తెలిపారు.
ప్రస్తుతం ఫిర్యాదుల స్వీకరణకు ఠాణాల్లో రిసెప్షన్‌ సెంటర్లు ఉన్నాయి. సిబ్బంది కొరతతో వీటి నిర్వహణ భారంగా మారుతోంది. ఫలితంగా ఠాణా ఎస్‌హెచ్‌వో అందుబాటులోకి వచ్చేవరకు ఫిర్యాదుదారులకు తిప్పలు తప్పట్లేదు. ఏదైనా బందోబస్తు విధులకు వెళ్తే ఇక అంతే   సంగతి. ఉదయం వెళ్లిన వారు రాత్రి వరకు ఠాణాల్లోనే ఉండాల్సి వస్తోంది. ఇకమీదట ఈ సమస్య ఉండబోదు. సోషల్‌ మీడియాలో ఫిర్యాదు ఇవ్వగానే సత్వరమే స్పందన ఉంటుంది. తక్షణమే సంబంధిత ఠాణా నుంచి చరవాణికి ఫోన్‌ వస్తుంది. ఫిర్యాదుదారుడు ఠాణాకు వెళ్లటమా.. లేక పోలీసులే సంఘటన ప్రదేశానికి రావటమా..? అనేది క్షణాల్లోనే జరిగిపోతుంది.
పూర్తి పారదర్శకత
ఠాణాల్లో ఇదివరకు అమలు చేస్తున్న కార్యక్రమాల ద్వారా చాలా వరకు అవినీతి తగ్గిందని భావిస్తున్నారు. మరోవైపు వచ్చిన ప్రతి ఫిర్యాదుపై చర్యలు తీసుకొంటున్నారు. ఫిర్యాదుదారునికి ఒక రశీదు అందిస్తున్నారు. ఇకముందు సోషల్‌ మీడియా ద్వారా మనం పంపే సందేశమే ఓ ఆధారం కానుంది. దాని ప్రకారమే కేసు నమోదుకు చర్యలు తీసుకుంటారు.
ఇదీ ఫిర్యాదు విధానం
* సోషల్‌ మీడియా ద్వారా ఎలాంటి ఫిర్యాదునైనా చేయొచ్చు. వాట్సప్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్‌, అధికారిక వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేసే అవకాశాన్ని కల్పించారు.
* ప్రస్తుతం ప్రతి ఒక్కరి వద్ద స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్లు వినియోగించే వారిలో 90 శాతం మందికి సోషల్‌ మీడియా వినియోగంపై పూర్తి అవగాహన ఉంది. ఇలాంటి వారందరు ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు చేయొచ్చు.
* మీ సమస్యను లేక జరుగుతున్న వాస్తవాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలను..వాట్సప్‌లో వీడియో లేక సందేశం రూపంలో పంపడం, ఫేస్‌బుక్‌ ఖాతాలో ట్యాగ్‌ చేస్తూ పోస్ట్‌ చేయటం, ట్విటర్‌లో ట్వీట్‌ చేయటం, నిజామాబాద్‌ పోలీస్‌ అధికారిక వెబ్‌సైట్‌లో సమస్యని పొందుపర్చటం ద్వారా ఫిర్యాదులు పంపించొచ్చు.
చక్కటి అవకాశం
* చాలా మంది మహిళలు తమకు జరిగే అన్యాయాన్ని ఠాణాలకు వెళ్లి నిర్భయంగా చెప్పుకొనే పరిస్థితులు చాలా తక్కువ. ఈ కారణంతో చాలా మంది బాధితులు ముందుకు రావట్లేదు. సోషల్‌ మీడియాలో ఫిర్యాదులకు అవకాశం కల్పించటం ద్వారా ఎన్నో ఘటనలు వెలుగులోకి వస్తాయి.
* విదేశాల్లో ఉంటున్న వారు తమకు జరిగిన అన్యాయాలు, గల్ఫ్‌ మోసాలు తదితర విషయాలపై నేరుగా వచ్చి ఫిర్యాదు చేసే అవకాశం ఉండదు. వీరందరికికూడా ఈ విధానం ఎంతో దోహదపడనుంది.
* వృద్ధులు, వికలాంగులు, రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులు, ఆపదలో ఉన్నవారు, నిర్మానుష్య ప్రదేశాల్లో చిక్కుకున్న వారు సోషల్‌ మీడియా ద్వారా పోలీసులను సులువుగా సంప్రదించొచ్చు.
* వీటికి ఫిర్యాదు చేయాలని సీపీ సూచించారు.
ప్రజలందరు సద్వినియోగం చేసుకోవాలి: సీపీ
సోషల్‌ మీడియా ద్వారా ఫిర్యాదుల స్వీకరణకు అవకాశం కల్పించాం. ఇది కమిషనరేట్‌లో నూతన ఆవిష్కరణ. పోలీసు శాఖతో ముడిపడి ఉన్న ఎలాంటి సమస్య, సంఘటన అయినా మా దృష్టికి తీసుకురావొచ్చు. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన కొద్ది క్షణాల్లోనే సత్వర స్పందన ఉంటుంది. ప్రతి ఫిర్యాదుపై సంబంధిత ఠాణా పోలీసులు తగు చర్యలు తీసుకొంటారు. దీన్ని తప్పుదోవ పట్టించొద్దు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకొంటాం.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.