అమ్మో.. ప్రాణాలు తీస్తున్నాయ్‌!  - Hyderabad - EENADU
close

శుక్రవారం, సెప్టెంబర్ 20, 2019

ప్రధానాంశాలు

అమ్మో.. ప్రాణాలు తీస్తున్నాయ్‌! 

నిషేధిత వేళల్లో భారీ వాహనాల సంచారం 
ప్రమాదాలతో పలువురి మృత్యువాత 
ఈనాడు, హైదరాబాద్‌

గర రహదారులపై భారీ వాహనాలు ఠారెత్తిస్తున్నాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో పగటిపూట సాధారణ ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వీటి రాకపోకలపై నిషేధం ఉన్నా కొందరు యథేచ్ఛగా ఉల్లంఘిస్తుండటంతో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. రాత్రివేళల్లోనూ వీటి వల్ల కలిగే ప్రమాదాలతో పలువురు మృత్యువాత పడుతున్నారు. ఇటీవల ఈ తరహా ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆదివారం ఉదయం రాజేంద్రనగర్‌ ఠాణా పరిధిలో ఆగి ఉన్న ఓ టిప్పర్‌ బ్రేకులు సరిగా లేని కారణంగా ఇంట్లోకి దూసుకెళ్లింది. ప్రాణనష్టం జరగకపోయినా...ఈ వాహనాలతో ప్రమాదాల పరంపరను చెప్పకనే చెప్పింది.

నగర రహదారులపై పగలు భారీ వాహనాల రాకపోకలపై నిషేధం ఉన్నప్పటికీ ఆ నిబంధనను ఎవరూ పట్టించుకోవడంలేదు. టిప్పర్లు, లారీలతో ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు మాత్రమే ఇది బహిర్గతమవుతోంది. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో రహదారులవారీగా నిషేధిత సమయాలను నిర్ణయించారు. ట్రాఫిక్‌ విభాగంలో సిబ్బంది కొరత కారణంగా సరైన నిఘా ఉండటం లేదు. ఉన్న కొద్ది మంది పగటిపూట రద్దీ నియంత్రణకే పరిమితమవుతున్నారు. ఉదయం 8 తర్వాతే వీరు విధుల్లోకి వస్తున్నారు. రాత్రివేళ నగరం లోపలికి వస్తున్న భారీ వాహనాలు తెల్లవారుజాము నుంచి ఉదయం 8 గంటల్లోపు బయటికి వెళ్లే క్రమంలో తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. ముఖ్యంగా ఉదయం 8 గంటలకు అటూఇటూగా కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులతోపాటు పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారు.

నిబంధనలు అలా.. ఉల్లంఘనలు ఇలా.. 
మూడు కమిషనరేట్ల పరిధిలో సాధారణంగా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 వరకు భారీ వాహనాలను అనుమతించరు. కొన్ని ప్రాంతాల్లో రాత్రి 11 నుంచి ఉదయం 6-8 వరకు అనుమతిస్తున్నారు. 
నిర్మాణ రంగ వ్యర్థాలు, ఇసుక, నీళ్లు, కూరగాయలను తరలించే భారీ వాహనాల చోదకులు తరచూ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ట్రక్‌, లారీలు వంటివి ఒక్క రోజు ఆగితే కిరాయి ఎక్కువవుతుందనే ఉద్దేశంతో తొందర పడుతున్నారు. ఈక్రమంలో నిషేధిత ప్రాంతాలను దాటివెళ్లాలని వేగంగా వెళ్తూ ప్రమాదాలకు ఆస్కారమిస్తున్నారు. 
సాధారణంగా భారీ వాహనాల వేగం గంటకు 40 కిలోమీటర్లుంటే.. గ్రేటర్‌ పరిధిలోని రహదారుల్లో గంటకు 12 కి.మీ.లకే వేగపరిమితి అమల్లో ఉంది. వర్షాకాలంలో రహదారుల దుస్థితి దృష్ట్యా గంటకు కేవలం 5 కి.మీ.ల వేగపరిమితి విధించారు. చాలా సందర్భాల్లో ఈ నిబంధన ఉల్లంఘనకు గురవుతోంది. 
నగర రోడ్లపై భారీ వాహనాలు 25 టన్నులలోపు బరువుతోనే ప్రయాణించాలి. అనేకం 30-60 టన్నుల సామర్థ్యంతో వెళ్తుండటంతో రోడ్లు దెబ్బతింటున్నాయి. గతుకులు పడుతూ ఇతర వాహనాల ప్రమాదానికి కారణమవుతున్నాయి. 

ఇటీవల చోటు చేసుకున్న దుర్ఘటనలు.. 
జీడిమెట్లలో జూన్‌ 8న రాత్రి 11 గంటలకు నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనం సైట్‌ వద్ద ఓ కార్మికుడు ట్రక్‌ను నేర్చుకునేందుకు ప్రయత్నించాడు. దాన్ని అదుపు చేయడంలో విఫలం కావడంతో ట్రక్‌ షెడ్‌లోకి దూసుకెళ్లింది. లోపల నిద్రిస్తున్న పీరాలాల్‌(34), అతడి రెండేళ్ల కుమార్తె సరస్వతి అక్కడికక్కడే మరణించగా.. పీరాలాల్‌ భార్య సోనూకుమారి, మరో యువకుడు దీపన్‌ గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. 
అబిడ్స్‌లో ఈయేడాది మార్చి 1న నీళ్ల ట్యాంకర్‌ ఢీకొట్టడంతో టైర్ల కింద పడి చిన్నారి దియా జైన్‌(7) దుర్మరణం పాలైంది. అనుమతి లేకుండానే ఆ ట్యాంకర్‌ను నడుపుతున్నట్లు దర్యాప్తులో గుర్తించారు. 
గోల్కొండ ఠాణా పరిధిలో మార్చి 9న ఇసుకతో కూడిన ట్రక్‌ ఢీకొనడంతో ఎల్‌కేజీ విద్యార్థి ఇర్ఫాన్‌(5) మృత్యువాత పడ్డాడు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.