నగరమే పునాదిగా..భాజపా సమర శంఖారావం - Hyderabad - EENADU
close

ఆదివారం, సెప్టెంబర్ 22, 2019

ప్రధానాంశాలు

నగరమే పునాదిగా..భాజపా సమర శంఖారావం

ఈనాడు-హైదరాబాద్‌: ఇప్పటికిప్పుడు ఎన్నికలు లేవు..  తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికలకు ఇంకా ఇబ్బందులు తొలగలేదు. వార్డుల విభజన, రిజర్వేషన్లపై కోర్టులో కేసులు కొనసాగుతున్నాయి. ఇక గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలకు దాదాపు రెండేళ్ల సమయం ఉంది. కానీ, నగరంలో రాజకీయం వేడెక్కుతోంది. అది రాష్ట్ర వ్యాప్తం అవుతోంది. ఇందుకు నగరమే వేదికవుతోంది. నగరం కలిసి వస్తోందన్న సెంటిమెంటును భాజపా బలంగా నమ్ముతోంది. పార్లమెంటు ఎన్నికల తర్వాత భాజపా జోరు పెంచింది. ఆదివారం నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో జరిగిన బహిరంగ సభే సాక్ష్యం.

కమలం గూటికి వివిధ పార్టీల నాయకులు 
ఇప్పటికే తెదేపా, కాంగ్రెస్‌ పార్టీల నుంచి పలువురు నగర నాయకులు భాజపాలో చేరగా.. ఆదివారం రంగారెడ్డి జిల్లాకు చెందిన తెదేపా సీనియర్‌ నేత సామ రంగారెడ్డి, ఎల్‌.దీపక్‌రెడ్డి, శేరిలింగంపల్లి నియోజకవర్గం తెదేపా నాయకుడు మొవ్వా సత్యనారాయణ భాజపాలో చేరారు. వారితో పాటు.. వందలాదిగా తరలి వచ్చిన పార్టీ అనుచరగణానికి భాజపా జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ ఖండువాలతో స్వాగతం పలికారు. ఇందులో పలు డివిజన్లకు చెందిన తెదేపా అధ్యక్షులు కూడా ఉన్నారు. ఇప్పటికే తెదేపా నల్లకుంట మాజీ కార్పొరేటర్‌ వనం రమేష్‌, సికింద్రాబాద్‌ నియోజకవర్గానికి చెందిన తెదేపా సీనియర్‌ నాయకుడు మేకల సారంగపాణి, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన అడిక్‌మెట్‌ మాజీ కార్పొరేటర్‌ సునీతా గౌడ్‌, అక్బర్‌బాగ్‌ నుంచి కాంగ్రెస్‌ నాయకుడు వంజరి వినోద్‌, కూకట్‌పల్లిలోని బాలాజీనగర్‌ తెరాస కార్పొరేటర్‌ పన్నాల కావ్య, ఆమె భర్త హరీష్‌రెడ్డి తదితరులు చేరారు. అయితే మాజీ మేయర్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకలు బండా కార్తీకరెడ్డి కూడా భాజపాలో చేరుతారని ప్రచారం జరిగినా.. చివరి నిమిషంలో వాయిదా పడిందని భాజపా శ్రేణులు చెబుతున్నాయి. త్వరలోనే నగరం నుంచి ప్రముఖ నాయకులు చేరే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

బహిరంగ సభకు మంచి స్పందన 
ఎగ్జిబిషన్‌ మైదానంలో జరిగిన బహిరంగ సభకు భారీగా జనం తరలి వచ్చారు. సభలో జేపీ నడ్డా మాట్లాడుతున్నప్పుడు కరతాళ ధ్వనులు మారుమోగాయి. తెరాసపై విమర్శలు గుప్పించినప్పుడు మద్ధతుగా భాజపా జిందాబాద్‌ అంటూ సభికులు నినదించారు. ఇక్కడ తండ్రీ, కొడుకులు, దిల్లీలో తల్లీ కొడుకులు అంటూ పార్టీలో వారసత్వ రాజకీయాలు కొనసాగిస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథలు కావవి కమిషన్‌ ప్రాజెక్టులంటూ విమర్శించారు.  తెదేపా నుంచి వలస వచ్చినవారికి తగిన ప్రాధాన్యం ఉంటుందని.. మనందరం కలిసి పోరాడి తెరాసకు చరమగీతం పలుకుదామని నడ్డా పిలుపున్విడంతో కేడర్‌ కేరింతలు కొట్టింది.


 

భాగ్యనగర భాజపాలో ఉత్సాహం 
‘నెక్ట్స్‌ తెలంగాణ’ సభ సైడ్‌లైట్స్‌

గన్‌ఫౌండ్రి, నాంపల్లి, న్యూస్‌టుడే: భాజపా భాగ్యనగర శ్రేణుల్లో ఉత్సాహం కదం తొక్కింది. పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో ఏర్పాటు చేసిన ‘నెక్ట్స్‌ తెలంగాణ’ బహిరంగసభ విజయవంతమైంది. సభ సందర్భంగా మధ్యాహ్నం నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానం పరిసర ప్రాంతాలు పార్టీ శ్రేణులతో కిక్కిరిసిపోయాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ ఎత్తున హోర్డింగులు, కటౌట్లు ఏర్పాటు చేశారు. 
రానున్న రోజుల్లో తెలంగాణలో భాజపా అధికారం కైవసం చేసుకుంటుందని నేతలు ప్రకటించినప్పుడల్లా.. కార్యకర్తల హర్షధ్వానాలతో సభా ప్రాంగణం మారుమోగింది. 
పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేడీ నడ్డా తన ప్రసంగంలోని తొలి పలుకులు తెలుగులో మాట్లాడటం ఆకట్టుకుంది.  
ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి సభ ముగిసే వరకు నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది.  
నాంపల్లి స్టేషన్‌రోడ్డు, ఎక్సైజ్‌ కార్యాలయం, పటేల్‌నగర్‌, ఏక్‌మినార్‌ మసీదు తదితర ప్రాంతాల్లో బారీకేడ్లు ఏర్పాటు చేశారు. 
సభలో శాస్త్రీయ నృత్య ప్రదర్శనతో పాటు జానపద పాటలు, బ్యాండు మేళాలు కార్యకర్తలను ఉత్తేజపరిచాయి. 
సాయంత్రం 5.10 నిమిషాలకు జేపీ నడ్డా సభా ప్రాంగణానికి విచ్చేశారు. అన్నమయ్య కీర్తనలు, నృత్య ప్రదర్శనలతో జేపీ నడ్డాకు ఘన స్వాగతం పలికారు. 
భాజపాలో చేరిన నేతలు జేపీ నడ్డాతో పాటు పార్టీ ప్రముఖులను గజమాలతో ఘనంగా సత్కరించారు. 
సభకు ముందు వివిధ జిల్లాల నుంచి నేతలు జీపులలో ర్యాలీగా రావడం ఆకట్టుకుంది.

 

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.