బకాయిల కొండ..అభివృద్ధికి గుదిబండ - Kamareddy - EENADU
close

శుక్రవారం, సెప్టెంబర్ 20, 2019

ప్రధానాంశాలు

బకాయిల కొండ..అభివృద్ధికి గుదిబండ

సీనరేజీ నిధులపై శీతకన్ను
ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి

ప్రభుత్వం పల్లెల ప్రగతే లక్ష్యంగా నూతన పంచాయతీరాజ్‌ చట్టాన్ని ఆమోదించింది. గ్రామాల్లో పరిశుభ్రత, పచ్చదనం పెంపొందించేందుకు 60 రోజులు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేయాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ నిధులతో పాటు   రాష్ట్ర ఆర్థిక సంఘం వాటాను కేటాయించి అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తోంది.
పల్లెల్లోని ప్రకృతి సంపదను(వనరులను) వినియోగించుకున్నప్పుడు చెల్లించాల్సిన   సీనరేజీ సొమ్ముల విషయంలో మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అయిదేళ్లుగా  వీటిని పూర్తిస్థాయిలో స్థానిక సంస్థలకు బదలాయించకపోవడంతో రూ. వందల కోట్ల  బకాయిలు పేరుకుపోయాయి.

గ్రామాల పరిధిలోని వనరుల ద్వారా సమకూరే ఆదాయాన్ని గ్రామాల అభివృద్ధికి ఖర్చు చేయాలన్న ఉత్తర్వులు అమలుకు నోచుకోవడం లేదు. జిల్లా, మండల పరిషత్తులు, పంచాయతీలకు ఏటా రావల్సిన సీనరేజీ నిధులను ప్రభుత్వం ఖజానా నుంచి స్థానిక సంస్థలకు బదలాయించాల్సి ఉండగా.. సక్రమంగా ఇవ్వడం లేదు. ఫలితంగా గ్రామాల అభివృద్ధి కుంటుపడుతోంది. నాలుగేళ్లుగా ఇస్తున్న నిధులు మొక్కుబడిగానే ఉన్నాయి.

ఏళ్ల తరబడి ఇదే దుస్థితి..
1991 నుంచి 2015 వరకు 25 ఏళ్లలో స్థానిక సంస్థలకు రూ. 385 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. 2016 నుంచి 2018 వరకు ఖజానాలో రూ.49.25 కోట్లు  జమ  కాగా.. సంస్థలకు మాత్రం కేవలం రూ.6.25 కోట్లు మాత్రమే విడుదల చేశారు.  నిబంధనల ప్రకారం సీనరేజీ మొత్తాన్ని   ఏడాదిలో మూడు వాయిదాల్లో అందించాల్సి ఉంది. ఇలా ఏ ఏడాది నిధులు..అదే సంవత్సరం కేటాయిస్తేనే గ్రామాలు అభివృద్ధి  సాధిస్తాయి.

కొరవడిన పర్యవేక్షణ
పల్లెల్లో ప్రకృతి సంపద కరిగిపోతున్నా   ఖజానాకు నిధులు మాత్రం జమ కావడం  లేదు. గనుల శాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో ప్రకృతి  సంపదను యథేచ్ఛగా దోపిడీకి పాల్పడుతున్నారు.
* లింగంపేట, ఎల్లారెడ్డి, గాంధారి మండలాల్లో లాటరైట్‌ను నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ దందా గనుల శాఖ అధికారులకు తెలిసినా చర్యలు చేపట్టకపోవడం గమనార్హం.
* బిచ్కుంద మండలంలోని హస్గుల్‌, వాజిద్‌నగర్‌, బండారెంజల్‌, బీర్కూర్‌ మండలంలోని పలు గ్రామాల్లో క్వారీల్లో అక్రమార్కులు సీనరేజీ   రుసుము చెల్లించకుండానే ఇసుకను  తరలిస్తున్నారు.
* బాన్సువాడ, నస్రుల్లాబాద్‌,  ఎల్లారెడ్డి, బిచ్కుంద మండలాలతో పాటు మాచారెడ్డి, భిక్కనూరు మండలాల్లో గుట్టలు తరిగిపోతున్నా పట్టించుకునే  వారే కరవయ్యారు.
* ఇక మొరం సంగతి చెప్పనక్కర్లేదు. నిబంధనలను తుంగలో తొక్కి అటవీ భూముల్లో నుంచి వందలాది లారీల్లో తరలించుకుపోతున్నారు.

ఏంటీ ఈ సీనరేజీ?
కంకర, ఎర్రమట్టి, మొరం ఇసుక, లాటరైట్‌ వంటివి లీజుకు ఇచ్చి వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని నేరుగా స్థానిక సంస్థల ఖాతాల్లో జమ చేయాలి. ప్రాజెక్టులు, హౌసింగ్‌, ఆర్‌అండ్‌బీ, రహదారుల విస్తరణ పనులు చేపట్టినప్పుడు నిధులు జమ చేస్తారు. ఇలా వచ్చే వాటినే సీనరేజీగా పేర్కొంటారు. ఇవి 1990-91 నుంచి 2015 వరకు రాలేదు. 2016-18 మధ్య నామమాత్రంగానే విడుదల చేశారు. 1990 నుంచి 2000 వరకు ఈ పద్దు కింద తక్కువ ఆదాయం సమకూరినా ఆ తర్వాత క్రమంలో ఇసుక, కంకర క్వారీల లీజు వంటి వాటితో ఆదాయం పెరిగింది. 2013 నుంచి సీనరేజీ ఆదాయం రెట్టింపు అయింది.

కేటాయింపు ఇలా
సీనరేజీ ద్వారా జిల్లా పరిషత్‌కు మొత్తం నిధులు కేటాయిస్తారు.  వాటిలో 50 శాతం మండల పరిషత్‌లకు, 25 శాతం పంచాయతీలకు కేటాయించి ఖర్చు చేస్తారు. బకాయిల పరంగా చూస్తే 2018 నుంచి జిల్లా, మండల పరిషత్‌లతో పాటు పంచాయతీలకు  పద్దు విడుదల చేయాల్సి ఉంది.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.