బతుకు రాయభారం - Kadapa - EENADU
close

శుక్రవారం, సెప్టెంబర్ 20, 2019

ప్రధానాంశాలు

బతుకు రాయభారం

అందని వేతనాలు

జిల్లాలో 3160 మంది ఎదురుచూపు

ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు

జిల్లాలో ఇంటింటా ఉత్పత్తి అయ్యే చెత్తను సేకరించి పరిశుభ్రతకు విశేష కృషి చేస్తున్న హరితరాయబారుల జీవనం భారంగా మారింది. వృత్తి పట్ల వీరు సంతృప్తి వ్యక్తం చేస్తున్నా తొమ్మిది నెలలుగా వేతనాలు చెల్లించకపోవటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల నిబంధనలు, ఆపై ప్రభుత్వం మారటం, బదిలీలు, ఆపై ఉన్నతాధికారుల ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలుకాకపోవటంతో వేతనాల చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతోంది.

గోపవరం, న్యూస్‌టుడే : రాష్ట్రంలో నూతన ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే జూన్‌ మొదటి వారంలో ఆయా పంచాయతీల పరిధిలో 14వ ఆర్థిక సంఘం, జనరల్‌ ఫండ్‌ ద్వారా హరితరాయబారులకు వేతనాలు చెల్లించాలంటూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఆ వెంటనే జిల్లా అధికారులు సైతం కిందిస్థాయి యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చారు.

అంతా సజావుగా సాగి వేతనాలు చేతికి అందుతాయని భావిస్తున్న నేపథ్యంలో ప్రత్యేకాధికారులు బదిలీ అయ్యారు. ఇదే సందర్భంలో నూతన అధికారుల రాక ఆలస్యమైంది. దీంతో వేతనాల మంజూరులో జాప్యం చోటుచేసుకుంది.

ఆపై విధుల్లో చేరిన అధికారుల వేలిముద్రలు సకాలంలో అందుబాటులోకి రాలేదని చెబుతున్నారు. దీంతో జిల్లావ్యాప్తంగా ఉన్న 3160 హరితరాయబారులకు నేటికీ వేతనాలు అందలేదు. దీంతో వారి కుటుంబాలు దయనీయస్థితిలో ఉన్నాయి.

ఈనేపథ్యంలో పంచాయతీల్లో తగినన్ని నిధులు లేవని తాజాగా మరో సమాచారం బయటపడుతోంది. 14వ ఆర్థిక సంఘం, జనరల్‌ నిధుల నుంచి హరిత రాయబారులకు ఒకట్రెండు నెలలకు మాత్రమే వేతనాలు చెల్లించవచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ మొత్తం అయినా సత్వరం చెల్లిస్తే బాధితులకు కొంతైనా ఊరట కలుగుతుంది.

పల్లెలను చెత్త రహితంగా తీర్చిదిద్దేందుకు, పంచాయతీలకు అదనపు ఆదాయం చేకూర్చేందుకు ప్రభుత్వం ప్రతి పంచాయతీలో ఉపాధి హామీ పథకం కింద సంపద కేంద్రాలను నిర్మించింది. గ్రామంలోని ఇళ్ల నుంచి సేకరించిన తడిపొడి చెత్తను తరలించేందుకు జనాభా ఆధారంగా హరిత రాయబారులను నియమించారు. వీరికి గౌరవ వేతనంగా కింద ప్రతినెలా రూ. 6000 చొప్పున చెల్లించాల్సి ఉంది. తొమ్మిది నెలలుగా వీరికి వేతనాలు చెల్లించలేదు. దీంతో వీరు పనులు చేసేందుకు విముఖత చూపుతున్నారు. ఈ ప్రభావం గ్రామాల్లో పారిశుధ్ద్యంపై పడుతోందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

పంచాయతీలు నియమించిన కార్మికులుదీనావస్థలో ఉన్నారు. ఘన వ్యర్థాల నిర్వహణను పంచాయతీలు నిర్వహిస్తున్నా అక్కడికి చెత్తను తీసుకుని వచ్చే హరితరాయబారులు, సహాయకులకు తొమ్మిది నెలలుగా వేతనాలు అందించకపోవటం దారుణమని అనేకులు విమర్శిస్తున్నారు.

ఉపాధి హామీ పథకం కింద వేతనాలు అందించేందుకు ఎంపీడీవోలు లాగిన్‌ నుంచి ఇవ్వడానికి చర్యలు తీసుకున్నారు. ఎన్నికల విధుల్లో భాగంగా ఎంపీడీవోలు బదిలీ అయ్యారు. వారి స్థానంలో వచ్చిన వారి పేర్లు ఉపాధి హామీ పథకంలో నమోదు కాక వేతనాల చెల్లింపు నిలిచాయి. దీంతో జిల్లావ్యాప్తంగా 790 పంచాయతీల్లోని 3160 మంది వేతనాలు నిలిచి ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు తాము ఏడాదిగా పనిచేస్తున్నా నెలలుగా వేతనాలు రావడం లేదని రాయబారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికారులు ఆదుకోవాలి

నా పేరు పద్మశెట్టి మురళి. మొదట్లో పని దొరికిందని చేతి వృత్తిని వదులుకొని హరిత రాయబారిగా చేరా. నాటి నుంచి నిత్యం ప్రతి ఇంటింటి వద్ద చెత్తను సేకరించి సంపద కేంద్రానికి తరలిస్తున్నాం. తొమ్మిది నెలలుగా వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నాం. అధికారులను వేతనాల గురించి అడిగినప్పుడల్లా ఎన్నికల కోడ్‌ అంటూ సమాధానం ఇచ్చారు. ఇప్పుడేమో ప్రత్యేకాధికారుల లాగిన్‌ నుంచి ఇస్తాం, చూస్తాం అంటున్నారు. ప్రభుత్వం వేతనాలు చెల్లించాలని ఆదేశాలు ఇచ్చినా అధికారులు పట్టించుకోవటం లేదు. ఇలాగైతే మా కుటుంబాలను ఎలా నెట్టుకురావాలి. ఇప్పటికైనా ఆదుకోవాలి..- మురళి, హరితరాయబారి. గోపవరం మండలం.

అప్పులతో సంసారాన్ని నెట్టుకొస్తున్నాం

నా పేరు అనకర్ల తిరుపాలమ్మ. గోపవరం పంచాయతీ శ్రీనివాసపురం గ్రామంలోని చెత్తాచెదారాన్ని సేకరించి చిన్న గోపవరం సమీపంలోని సంపద కేంద్రానికి తరలిస్తుంటా. అసలే మగ దిక్కులేక ఇబ్బందులు పడుతున్న నాకు ఈ పనితో కుటుంబాన్ని పోషించుకునే శక్తి వచ్చింది. తొమ్మిది నెలలుగా వేతనాలు లేకపోవడంతో అప్పులు తెచ్చుకుని కుటుంబాన్ని నెట్టుకొస్తున్నా. మాగోడు ఆలకించిన ప్రభుత్వం నెల క్రితమే వేతనాలు చెల్లించాలని చెప్పినా అధికారులు దయ చూపకపోవడం దారుణం.- అనకర్ల తిరుపాలమ్మ, హరితరాయబారి. గోపవరం పంచాయతీ

చెల్లించాలని ఆదేశించాం

హరితరాయబారులకు వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందిన వెంటనే సంబంధిత ఈవోపీఆర్‌డీలను కోరాం. 14వ ఆర్థిక సంఘం, జనరల్‌ నిధుల నుంచి అందజేయాలని సూచించాం. సీఎఫ్‌ఎంఎస్‌ సాంకేతిక సమస్య కారణంగా కొంత ఆలస్యమైంది. మరికొన్ని కారణాలు, అధికారుల బదిలీలు తోడై చెల్లింపు 40 రోజులపాటు ఆలస్యమైంది. వెంటనే వారికి వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకుంటాం.- మోహన్‌రావు జిల్లా పంచాయతీ అధికారి

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.