అక్రమ నల్లాలపై ఇంటింటి సర్వే!  - Hyderabad - EENADU
close

శనివారం, సెప్టెంబర్ 21, 2019

ప్రధానాంశాలు

అక్రమ నల్లాలపై ఇంటింటి సర్వే! 

తొలుత డివిజన్‌ 12లో పైలట్‌ ప్రాజెక్టు 
తొలి రోజే బయట పడ్డ దొంగ కనెక్షన్లు

ఈనాడు, హైదరాబాద్‌: గ్రేటర్‌ వ్యాప్తంగా అక్రమ నల్లాల గుట్టు రట్టుకానుంది. బోర్డు ఆదాయాన్ని పీల్చిపిప్పి చేయడమే కాకుండా...తాగునీటిని దొంగచాటుగా వాడుకుంటున్న వైనంపై నిగ్గు తేల్చేందుకు జలమండలి విజిలెన్సు, ఎన్‌ఫోర్సుమెంట్‌ విభాగం రంగంలోకి దిగింది. 35 మంది రెండు బృందాలుగా విడిపోయి ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు. ప్రయోగాత్మక పరిశీలన కింద తొలుత డివిజన్‌-12లోని చింతల్‌, జీడిమెట్ల, సూరారం, ఆదర్శనగర్‌ సర్కిళ్లల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రతి రోజు 1000-1500 ఇళ్లను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. తొలిరోజు శనివారం చింతల్‌లో పలు అక్రమ కనెక్షన్లు బయట పడ్డాయి. అంతేకాక గృహ కేటగిరిలో తీసుకొని వాణిజ్య పరమైన అవసరాలకు వాడుకుంటున్నట్లు గుర్తించారు. కొన్ని నల్లాలకు అసలు మీటర్లు లేకపోడం, ఉన్నాసరే పనిచేయకుండా చేసినట్లు గుర్తించారు. అక్రమ నల్లాలు తీసుకున్న రెండు భారీ భవంతుల యజమానులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. పైలట్‌ ప్రాజెక్టు విజయవంతం కావడంతో గ్రేటర్‌ మొత్తం పరిశీలన చేయనున్నారు. అదనంగా మరో 50 మంది కానిస్టేబుళ్లను ఈ బృందాల్లో నియమించనున్నారు. జీహెచ్‌ఎంసీ లెక్కల ప్రకారం గ్రేటర్‌ వ్యాప్తంగా 20 లక్షల కుటుంబాలు ఉన్నాయి. నల్లాలు మాత్రం 9.6 లక్షలకు దాటడం లేదు. ఒక్కో భవనంలో ఒకటి కంటే ఎక్కువ కుటుంబాలు నివసిస్తుంటారు. దీంతో నల్లాల సంఖ్య, గృహాలకు తేడా ఉంటుంది. నగర పరిధి పెరుగుతున్న నేపథ్యంలో మరో 2-3 లక్షల కనెక్షన్లు అదనంగా పెరగాలి. అవుటర్‌ రింగ్‌ రోడ్డు వరకు సేవలను విస్తరించడం...కాలనీలు పెరగడం వల్ల చాలామంది కొత్త నల్లాలను తీసుకుంటున్నారు. అయినా అనుకున్నంత వేగంగా నల్లాల సంఖ్య పెరగడం లేదు. దీంతో ప్రతి ఇంటిపై క్షేత్ర స్థాయిలో దృష్టి పెట్టి అక్రమ నల్లాల నిగ్గు తేల్చాలని అధికారులు భావిస్తున్నారు.

ఎలా గుర్తిస్తారంటే... 
* నీళ్లు విడిచిపెట్టే సమయంలో ఆయా ప్రాంతంలో ప్రత్యేక బృందాలు క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటిని పరిశీలిస్తాయి. సంపు, మీటరు ఛాంబర్‌ ఇలా అన్ని వైపులా పరిశీలించి అది అక్రమ నల్లానా లేదంటే అధికారికంగా తీసుకున్నదా...అన్నది గుర్తిస్తారు. 
* అక్రమ నల్లాకు మీటరు ఛాంబర్‌ ఉండదు. నేరుగా ప్రధాన పైపు నుంచి సంపునకు అనుసంధానమై ఉంటుంది. ప్రతి అధికారిక నల్లాకు ఒక గుర్తింపు సంఖ్య(క్యాన్‌ నెంబరు) ఉంటుంది. అక్రమ నల్లాకైతే ఇలాంటి నంబరు ఉండదు. అది అక్రమ నల్లా కిందే లెక్క. 
* అక్రమ కనెక్షన్‌ అని తేలితే...వెంటనే సమీప పోలీసు స్టేషన్‌లో సదరు యజమానిపై క్రిమినల్‌ కేసు నమోదు చేస్తారు. 
* కేసు నుంచి బయట పడాలంటే మూడేళ్ల నల్లా బిల్లులతోపాటు కనెక్షన్‌ ఛార్జీ, అంతకు సమానమైన జరిమానా చెల్లించాలి. అప్పుడు అధికారులు కేసును విత్‌డ్రా చేస్తారు. 
* ప్రధాన పైపు నుంచి ఎక్కువ నీటిని గుంజటానికి నగరంలో చాలామంది సంపు వద్ద అక్రమంగా మోటార్లు వాడుతుంటారు. ఇది కూడా నేరమేనని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇందుకు భారీ జరిమానా తప్పదు. తొలి తప్పు కింద రూ.5 వేలు, రెండోసారి అదే తప్పు గుర్తిస్తే రూ.10 వేలు, మూడోసారి దొరికితే క్రిమినల్‌ కేసు నమోదు చేస్తారు. నీటి కనెక్షన్‌ తొలగిస్తారు. 
* ఇంటింటి సర్వే, ఇతర మార్గాల ద్వారా అధికారులకు అందిన సమాచారం ప్రకారం ఇప్పటివరకు నగరంలో 186 భారీ భవంతులకు అక్రమ నల్లాలను గుర్తించారు. జరిమానా, అదనపు ఛార్జీల కింద రూ.1.64 కోట్లు వసూలు చేశారు. 
* అక్రమ నల్లాలు తీసుకుంటే అనవసరంగా చిక్కుల్లో పడ్డట్టేనని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ మీ ప్రాంతంలో అక్రమ నల్లాలు గుర్తిస్తే 99899 98100, 99899 92268 నంబర్లకు సమాచారం అందించాలని కోరారు. ఇవే నెంబర్లకు వాట్సాప్‌ ద్వారా చిత్రాలు, లోకేషన్‌ షేర్‌ చేయవచ్చునని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లను ఎట్టి పరిస్థితిలోనూ బయట పెట్టమన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.