విశ్వదాభిరామా.. వణికిస్తోంది దోమ - Kadapa - EENADU
close

శనివారం, సెప్టెంబర్ 21, 2019

ప్రధానాంశాలు

విశ్వదాభిరామా.. వణికిస్తోంది దోమ

జిల్లాలో ఏడీస్‌ స్వైర విహారం!!

డెంగీ జ్వరాల విస్తరణ

ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో కేసుల నిర్ధారణ

పట్టణ ప్రాంతాల్లోనే విజృంభణ

దోమల కేంద్రంగా మారుతున్న గుంతలు..

డెంగీ జ్వరాలకు కారణమైన ఏడీస్‌ ఈజిప్టి (టైగర్‌ దోమ) జిల్లావాసులను వణికిస్తోంది. ఈ దోమకాటుతో నిత్యం పదుల సంఖ్యలో డెంగీ జ్వరాల బారిన పడుతున్నారు. జిల్లా సర్వజన వైద్యశాల (రిమ్స్‌)లో ఇటీవల 58 మంది జ్వర బాధితులకు రక్త పరీక్షలు చేయగా ఇందులో 11 మందికి డెంగీ లక్షణాలని మైక్రోబయాలజీ విభాగం నిర్ధా.రించింది. ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఒకేరోజు ఇన్ని డెంగీ కేసులు బహిర్గతమవటం జిల్లాలో అధ్వానంగా తయారైన ప్రజారోగ్యానికి నిదర్శనమని అనేకులు భావిస్తున్నారు.
కడప వైద్యం, న్యూస్‌టుడే: జిల్లాలో ఆగస్టు నెల ఆరంభం నుంచి జ్వర బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. జ్వరాల బారినపడిన వారు చికిత్స కోసం కడపలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు వస్తున్నారు. జ్వరాలతో ఆసుపత్రికి వచ్చిన వారిలో డెంగీ లక్షణాలు కనిపిస్తే ఎలీసా విధానంలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఔట్‌, ఇన్‌ పేషంట్లకు (ఓపీ, ఐపీ) ఎలీసా పరీక్షలు చేస్తున్నారు. రక్త పూతలు సేకరించిన తరువాత రెండు రోజుల వ్యవధిలో పరీక్షలు పూర్తి చేసి నిర్ధారిస్తున్నారు. ఈనెలలో ఎలీసా పరీక్షలు చేసిన ప్రతిసారి డెంగీ పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఫలితాల సరళిని పరిశీలించిన ప్రభుత్వ సర్వజన వైద్యశాల మైక్రోబయాలజీ విభాగం అధికారులు డెంగీ తీవ్రతపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారులకు సమాచారం అందిస్తున్నారు. జ్వర బాధితుల్లో 5 నుంచి 10 శాతం మంది మాత్రమే చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు వస్తున్నట్లు అంచనా. అంటే 90 శాతం మంది జ్వర బాధితులు ప్రైవేటు వైద్యశాలలకు వెళుతున్నారు. ప్రైవేటు వైద్యశాలల్లో చికిత్స చేయించుకున్న వారి వ్యాధి నిర్ధారణకు సంబంధించిన వివరాలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు చేరడం లేదు. వ్యాధుల కాలంలో అన్నిరకాల వ్యాధులను నియంత్రించాలంటే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీ రాజ్‌, పురపాలక, గ్రామీణ నీటిపారుదల సంస్థ, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుంది. వ్యాధుల నియంత్రణలో ఏ రెండు శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో దోమకాటు బాధితులు పెరుగుతున్నారు.

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ఖాళీ స్థలాల్లో వర్షపు నీరు నిలవడం వల్ల దోమలు వృద్ధి చెందుతున్నాయి. రహదారులపై ఏర్పడిన గుంతల్లో నిలిచిన నీటిలో దోమలు పెరుగుతున్నాయి. నివాస గృహాల్లో వారానికోసారి డ్రైడేని పాటించకపోవడం వల్ల డెంగీ దోమలు పుడుతున్నాయి. డెంగీ విస్తరణకు వైద్య ఆరోగ్య శాఖ చెబుతున్న కారణాలివి.

డెంగీ ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలి. రోగులున్న ప్రాంతంలో టైగర్‌ దోమ నిర్మూలన చర్యలు చేపడితే ఆ వ్యాధి విస్తరించే అవకాశాలు తక్కువవుతాయి. ఇలాంటి చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. కడప నగరం టైగర్‌ దోమలకు రాజధానిగా మారింది. అధికారిక డెంగీ కేసుల్లో సరాసరిన 40 శాతం జిల్లా కేంద్రంలోనే నమోదైనట్లు తెలిసింది. జిల్లా కేంద్రంలో జిల్లా మలేరియా నిర్మూలన విభాగం, నగరపాలక సంస్థలకు మధ్య సమన్వయం లేకపోవడం ప్రజలకు శాపంగా మారుతోంది.

వర్షాలతో విజృంభణ

జిల్లావ్యాప్తంగా వర్షాలు కురవడం వల్ల దోమల ఉద్ధృతి పెరిగింది. డెంగీ కేసులపై ప్రభుత్వ సర్వజన వైద్యశాల నుంచి ఎప్పటికప్పుడు నివేదికలు వస్తున్నాయి. ఈ సంవత్సరం డెంగీ కేసుల సంఖ్య అధికంగా ఉన్న మాట వాస్తవమే. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం. డెంగీ వ్యాధి పట్ల అవగాహన కల్పిస్తున్నాం. పీహెచ్‌సీల స్థాయిలో డెంగీ కిట్లను అందుబాటులో ఉంచాం. నివాస ప్రాంతాల మధ్య గల ఖాళీ స్థలాలు, రహదారులపై ఏర్పడిన గుంతలు, గృహోపకరణ వస్తువుల్లో నీటి నిల్వ, కొబ్బరి బొండాల వల్ల డెంగీ కారక దోమలు అభివృద్ధి చెందుతున్నాయి. ఈ నెలలో సంబంధిత శాఖల అధికారులతో కలిసి సంయుక్త సమావేశాన్ని నిర్వహించి డెంగీ నివారణకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించుకుంటాం. - డాక్టర్‌ ఉమా సుందరి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి

దోమల పెరుగుదలకు కారణమవుతున్న ఖాళీ స్థలాలు 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.