పెద్దలూ జాగ్రత్త.. పాపం.. పసి మనసులు!  - Hyderabad - EENADU
close

ఆదివారం, సెప్టెంబర్ 22, 2019

ప్రధానాంశాలు

పెద్దలూ జాగ్రత్త.. పాపం.. పసి మనసులు! 

చిన్నారులపై ప్రతికూల ప్రభావం 
కొట్లాటకు సిద్ధం.. ప్రతీకారానికి సన్నద్ధం 
భావోద్వేగాలపై పట్టు కోల్పోతున్న బాల్యం 
ఆవేశానికి అడ్డుకట్ట వేయాలంటున్న మనస్తత్వ నిపుణులు

‘‘ఏరా.. నువ్వు మారవా.. ఎప్పుడూ ఇలాగే చేస్తుంటావా.. నీ స్నేహితులు చూడు ఎంత బుద్ధిగా ఉంటున్నారో. ఎప్పుడూ ఎవరో ఒకరితో గొడవ పడుతూనే ఉంటావ్‌.. నీలాంటి వాడు ఒక్కడు ఉంటే చాలు క్లాసంతా పాడవుతుంది’’ అన్న ఉపాధ్యాయురాలి మందలింపు.. ఏడో తరగతి చదివే బాలుడిపై ప్రభావం చూపింది. అప్పటి వరకు మిత్రులుగా కనిపించిన వారంతా శత్రువులనే అభిప్రాయానికి వచ్చాడు. అది క్రమంగా ప్రతి చిన్న విషయానికి కోప్పడేంతగా మార్చేసింది.  పదో తరగతి పూర్తయ్యే సరికి అది మరింత పెరిగి కుటుంబ సభ్యులపైనా దాడి చేసేంత వరకూ బరి తెగించాడు.

‘‘పొగరుగా సమాధానం ఇవ్వడం గొప్పనుకుంటున్నావా.. నీలాంటి వాళ్లను చాలా మందిని చూశాను. సరిగా ఆడితే ప్రాక్టీసుకు రా.. లేకపోతే వెళ్లిపో. నువ్వొక్కడిని ఆడకపోతే జట్టు ఓడిపోదు’’ అంటూ తరచూ కోచ్‌ ఎగతాళి చేయడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఒకరోజు ఇరు జట్లు క్రికెట్‌ ఆడుతున్న సమయంలో పక్క జట్టు సభ్యుడితో వాగ్వాదం గొడవకు దారితీసింది. అంతే పట్టలేని ఆవేశంతో ఓ విద్యార్థి అతడిపై బ్యాట్‌తో దాడి చేసి తల పగులగొట్టాడు.  అతను కోచ్‌ చేతిలో తరచూ చీవాట్లకు గురైన విద్యార్థి కావడం గమనార్హం.

ఈనాడు, హైదరాబాద్‌

డిలో చక్కగా చదువుకునే పిల్లవాడు హత్య చేయడం.. పాఠళాల వయసులోనే జట్లుగా విడిపోయి క్రీడా మైదానంలో తీవ్రంగా కొట్టుకోవడం వంటి ఘటనలు కన్నవారిని కలవర పాటుకు గురిచేస్తున్నాయి. తోటి విద్యారి లేదా స్నేహితుడికి హాని కలిగించేంతగా ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచన బాల్యంలో మొగ్గ తొడగటం ఆందోళనకు గురిచేస్తున్న అంశం. ప్రశాంతంగా ఉండే పసి మనసుల్లో ఇంతటి కల్లోలం సృష్టించడంలో తాము కూడా భాగమనే విషయాన్ని గుర్తించలేకపోతున్నారు.. అధిక సమయం తమతో గడిపే విద్యార్థుల ఆగ్రహాన్ని అంచనా వేయడంలో గురువులూ విఫలమవుతున్నారు. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే హైదరాబాద్‌ నగరంలో పాఠశాల స్థాయి విద్యార్థులు, యుక్త వయసుకు చేరిన అమ్మాయిలు, అబ్బాయిల్లో కోపావేశాలు పెరిగాయంటున్నారు మానసిక విశ్లేషకులు. నాలుగైదేళ్ల కిందటి వరకూ పిల్లల మార్కులు సరిగా లేవంటూ తల్లిదండ్రుల సమావేశంలో చెబుతుండేవాళ్లం. ఇప్పుడు.. మీ అబ్బాయి/అమ్మాయి దురుసుగా ప్రవర్తిస్తున్నారంటూ చెబుతున్నామని ఓ కార్పొరేట్‌ పాఠశాల ప్రిన్సిపల్‌ వివరించారు. పరిష్కారం చూపాల్సిన కుటుంబ సభ్యులు కొందరు తామే పిల్లలపై నిందలు వేస్తున్నామంటూ గొడవలకు దిగుతున్న సందర్భాలున్నాయన్నారు. ఇలాంటి దూకుడు స్వభావం ఉన్న ఇళ్లలోని పిల్లలూ వారినే అనుకరిస్తారని సర్దిచెప్పుకుంటున్నామని ప్రిన్సిపల్‌ ఆవేదన వెలిబుచ్చారు.

మాట తూలితే.. అంతే 
ఒక్క చిన్నమాట.. కోపం పట్టలేక వచ్చే కొన్ని పదాలు పసి మనసును గాయం చేస్తాయి. ఇంట్లో కుటుంబ సభ్యుల ప్రవర్తన.. కోపావేశాల ప్రభావం పసితనాన్ని కటవుగా మార్చేస్తున్నాయి. భావోద్వేగాలపై నియంత్రణ కోల్పోయి తరచూ కొట్లాటకు దిగేలా పిల్లల్ని పురిగొల్పుతున్నాయని మనస్తత్వ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కృష్ణా జిల్లాలో పదో తరగతి బాలుడు తనతో గొడవపడినందుకు 8ఏళ్ల పిల్లవాడి గొంతుకోసి చంపేశాడు. ఖమ్మం జిల్లాలోనూ తనను ఎదిరించాడనే తొమ్మిదేళ్ల బాలుడిని దారుణంగా హతమార్చాడో విద్యార్థి. మూడేళ్ల కిందట ఆబిడ్స్‌లోని ప్రైవేటు పాఠశాలలో స్వల్ప వివాదం ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా కొట్టుకుంటున్న సమయంలో ఓ విద్యార్థి అక్కడికక్కడే కూలబడ్డాడు. తల వెనుక భాగంలో బలమైన పిడిగుద్దు తగలంతో రక్తం గడ్డకట్టి ఆ విద్యార్థి మరణించాడు. ఇవన్నీ ఉదాహరణలు మాత్రమే. మూడు ఘటనల్లో కారణాలను విశ్లేషించిన పోలీసులు.. ఆ పసివాళ్లపై వారి తల్లిదండ్రుల ప్రభావం ఉండటంతోనే అదుపు చేసుకోలేనంతటి ఆవేశాన్ని ప్రదర్శించారనే నిర్ణరణకు వచ్చారు.

గుర్తించడమే తొలి పరిష్కారం 
-డాక్టర్‌ హరీష్‌చంద్రారెడ్డి, న్యూరో సైకియాట్రిస్ట్‌

* ఎదుటి వారికి హాని కలిగించేంతగా పిల్లలు మారడంలో పరిసరాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తొలి తరంలో అధిక శాతం జన్యుపరమైన కారణాలే పిల్లల కోపతాపాలకు కారణం. బాల్యంలోనే ఇంతటి క్రౌర్యం పెరగడానికి 60శాతం మాదక ద్రవ్యాలు కారణం.  
* విద్యార్థి దశలో వారి ప్రవర్తనలో వచ్చే మార్పులను గమనిస్తే పరిష్కారం దొరికినట్టే. తరచూ కోపం, ఆవేశానికి గురవుతున్న పిల్లల్లో లోపాన్ని పసిగట్టడంలో ఉపాధ్యాయులకు అవగాహన ఉండట్లేదు. తల్లిదండ్రులు కూడా దీన్ని పెద్ద సమస్యగా భావించట్లేదు. 
* గ్రామీణ ప్రాంతాల్లో పిల్లల కదలికలను ఎవరో ఒకరు పసిగడుతుంటారు. పట్టణ వాతావరణంలో ఆ అవకాశమే ఉండటం లేదు. స్వేచ్ఛ, అనుకూల వాతావరణంతో పిల్లలు తప్పటడుగులు వేస్తున్నారు. వాటిని అడ్డుకునేవారిని శత్రువులుగా భావిస్తున్నారు. మూడ్‌ డిజార్డర్‌, కంపల్సివ్‌ డిజార్డర్‌కు చేరిన వారిని బిహేవియర్‌ థెరపీ, మందుల ద్వారా సాధారణ స్థితికి తీసుకురావచ్చు.


 

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.