రహదారి విస్తరణ పనులకు మోక్షమెన్నడో - Kamareddy - EENADU
close

ఆదివారం, సెప్టెంబర్ 15, 2019

ప్రధానాంశాలు

రహదారి విస్తరణ పనులకు మోక్షమెన్నడో

● ఇరుకు రోడ్డుతో పెరుగుతున్న ప్రమాదాలు

న్యూస్‌టుడే, బీర్కూర్‌

రోడ్డుపైన నిలిపిన వాహనాలు

బీర్కూర్‌ మండల కేంద్రం వ్యాపారపరంగా, రవాణా పరంగా రోజురోజుకు విస్తరిస్తోంది. దీంతో వ్యాపార దుకాణ సముదాయలు, గృహ నిర్మాణాలు కూడా పెరిగాయి. బీర్కూర్‌ నుంచి బోధన్‌, బాన్సువాడ, రహదారులు విస్తరించడంతో రాకపోకలు పెరిగాయి. నియోజకవర్గంలో బాన్సువాడ, కోటగిరి, వర్ని, నస్రుల్లాబాద్‌ మండలాల్లో రోడ్లు విస్తరణ జరిగాయి. కానీ బీర్కూర్‌ మండల కేంద్రంలో ఇప్పటి వరకు రహదారి విస్తరణ చేపట్టం లేదు. దీంతో ట్రాఫిక్‌ పెరిగిపోయి ఇరుకురోడ్లపై నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మండల కేంద్రంలోని చెక్‌పోస్టు రోడ్డు నుంచి రైస్‌మిల్లు వరకు నాలుగు లేన్ల రహదారి విస్తరణ చేపట్టాలని పంచాయతీ, ఆర్‌ అండ్‌ బీ అధికారులు ప్రతిపాదించి జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక అందించారు. 18 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ రోడ్డు పనులకు మోక్షం కలగలేదు.

మండల కేంద్రంలోని గ్రామముఖ ద్వారం రోడ్డు నుంచి రైస్‌మిల్లు వరకు 1600 మీటర్ల పొడవు వరకు నాలుగు లేన్ల రహదారిగా విస్తరణ చేపట్టాలని పంచాయతీ పాలకవర్గం తీర్మానం చేసి ఆర్‌ అండ్‌ బీ అధికారులకు అందజేశారు. మొదట స్థానికులు, గ్రామపెద్దలు మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి రోడ్డు వెడల్పు తప్పనిసరిగా చేయించాలని కోరడంతో ఆయన కూడా అంగీకరించారు. దీంతో రోడ్డు విస్తరణకు రూ.7 కోట్లు నిధులు కావాలని పంచాయతీ పాలకవర్గ జిల్లా ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపారు.

● ప్రస్తుతం మండల కేంద్రంలో 24 అడుగుల వెడల్పు రోడ్డు ఉండగా దానికి పంచాయతీ పాలకవర్గం 100 అడుగుల వరకు రహదారి విస్తరణ చేపట్టి మురుగు కాల్వలు, రోడ్డు మధ్యన డివైడర్లు నిర్మించి సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేయించాలని తీర్మానం చేశారు.

● మండల కేంద్ర శివారులోని మంజీర నదిలో అతి పెద్ద వారధి నిర్మిస్తున్నారు. ఈ వారధి మరో రెండు నెలల్లో పూర్తవుతుంది. దీంతో మద్నూర్‌, బిచ్కుంద, జుక్కల్‌, దెగ్లూర్‌కు రాకపోకలు సులభతరం అవుతాయి. పొతంగల్‌, కోటగిరి, నస్రుల్లాబాద్‌, వర్ని, నిజామాబాద్‌ నుంచి దెగ్లూర్‌ వెళ్లే వారికి బీర్కూర్‌ మండల కేంద్రం ప్రధానంగా మారుతుంది. ఇప్పటికే రాకపోకలు మొదలయ్యాయి. ఆర్టీసీ బస్టాండు నుంచి మంజీర వారధి వరకు బైపాస్‌ రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

100 అడుగుల వెడల్పు చేయాల్సిన బీర్కూర్‌ ప్రధాన రోడ్డు

అడ్డగోలుగా అక్రమ కట్టడాలు

అనుమతులు ఒక చోట తీసుకొని నిర్మాణాలు మరోచోట చేపట్టి బీర్కూర్‌ మండల కేంద్రంలో పదుల సంఖ్యలో గతంలో వ్యాపార దుకాణాల సముదాయాలు, గృహ నిర్మాణాలు చేపట్టారు. ఈ విషయంపై గతంలో గ్రామస్థులు ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టి అక్రమ కట్టడాలపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన సందర్భాలున్నాయి. పంచాయతీ, ఆర్‌ అండ్‌ బీ నిబంధనలకు విరుద్దంగా అక్రమ నిర్మాణాలు చేపట్టినా అధికారులు మిన్నుకుండిపోయారు.

నిధులు విడుదల కాగానే పనులు

- భానుచందర్‌- ఆర్‌ అండ్‌ బీ ఏఈ

నాలుగు లేన్ల రహదారి విస్తరణ చేపట్టేందుకు ఉన్నతాధికారులకు నివేదిక అందించాం. నిధులు విడుదల కాగానే పనులు మొదలు పెడతాం. రోడ్డు పరిధిలో ఉండే కట్టడాలను నిబంధనల ప్రకారం తొలగిస్తాం.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.