గ్రామాన్ని తాకట్టుపెట్టిన ఘనుడు! - Chittoor - EENADU
close

ఆదివారం, సెప్టెంబర్ 22, 2019

ప్రధానాంశాలు

గ్రామాన్ని తాకట్టుపెట్టిన ఘనుడు!

న్యాయం చేయాలని జ్ఞానమ్మకండ్రిగ వేడుకోలు

జ్ఞానమ్మకండ్రిగ గ్రామం

అది ఓ పల్లె.. ఎన్నో ఏళ్ల నుంచి స్థానికులు నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు.. సీసీ రహదారులు, వీధి దీపాలు అన్నీ వచ్చాయి.. తాతల నాటి నుంచి ఉంటున్న ఈ స్థలాలను ఓ వ్యక్తి గతంలో రెవెన్యూ సిబ్బంది సహకారంతో పట్టాదారు పాసుపుస్తకం చేసుకుని పలు బ్యాంకుల్లో తాకట్టుపెట్టి రుణాలు పొందాడు.. గ్రామస్థులతో అతను మాట్లాడుతున్న తీరుపై అనుమానం వచ్చి ఇటీవల స్థానికులు ఆరా తీయండంతో జరిగిన ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తమకు న్యాయం చేయాలని వేడుకొంటున్నారు జ్ఞానమ్మకండ్రిగ వాసులు.

న్యూస్‌టుడే, కేవీబీపురం: కేవీబీపురం మండలం ఆరె పంచాయతీ పరిధి జ్ఞానమ్మకండ్రిగలో 150 కుటుంబాల వారు సుమారు ఆరు ఎకరాల విస్తీర్ణంలో నివాసం ఉంటున్నారు. ఇందులో 30 కుటుంబాల వారు వారి ముత్తాతలనాటి సెటిల్‌మెంట్‌ భూమిలో నివాసాలు ఏర్పాటు చేసుకుని గత 50 ఏళ్లుగా ఉంటున్నారు. ఆరె రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్‌ 204/11లో 1.53 ఎకరాల భూమిలో ఉంది. ఈ భూమిలోనే ఆ 30 కుటుంబాల ఇళ్లు ఉన్నాయి. దీనిని గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అడ్డదారిలో పట్టాదారు పాసుపుస్తకం చేసుకుని ఆన్‌లైన్‌లో తనపేరు మీద మార్చుకున్నారు. అంతేకాకుండా ఆ భూమిని పట్టాదారు పాసుపుస్తకంలో ఎక్కించుకుని పలు బ్యాంకుల్లో నిబంధలకు విరుద్ధంగా రుణం పొందారు. ఆ వ్యక్తి తమ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తుండటంతో స్థానికులకు అనుమానం వచ్చింది. ఆ తరవాత జరిగిన విషయాన్ని తెలుసుకున్న అవాక్కయ్యారు.

గతంలో తిమ్మసముద్రం.. నేడు జ్ఞానమ్మకండ్రిగ

మండలంలో పలు గ్రామాల ఏర్పాటు వెనుక 50 సంవత్సరాల కిందట పలువురు దాతల సహకారం ఉంది. వారి సొంత పొలాలను (సెటిల్‌మెంట్‌) గ్రామాలకు విరాళంగా ఇచ్చేయడంతో అప్పట్లో నిరుపేదలు అందులో నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. దీనిని కొంత మంది అలుసుగా తీసుకుని గతంలో పనిచేసిన రెవెన్యూ అధికారులు, సిబ్బంది అండదండలతో గ్రామాలను సైతం పట్టాదారు పాసుపుస్తకాల్లోకి ఎక్కించుకుని బ్యాంకుల్లో రుణాలు తీసుకొంటున్నారు. 2015 ఆగస్టులో 3.25 ఎకరాల విస్తీర్ణంలోగల మండలంలోని తిమ్మసముద్రం గ్రామాన్ని స్థానికుడు ఒకరు బ్యాంకులో తాకట్టుపెట్టి రుణం పొందారు. ఇదే తరహాలోనే ఇప్పుడు జ్ఞానమ్మకండ్రిగలో చోటు చేసుకుంది. జ్ఞానమ్మకండ్రిగ గ్రామాన్ని శ్రీకాళహస్తిలోని ఏడీబీ, డీసీసీ, పిచ్చాటూరులోని ఆంధ్రాబ్యాంకుల్లో పలు పర్యాయాలు తాకట్టుపెట్టి రుణం పొందడం గమనార్హం. ఇలాంటి సమస్య మండలంలో పలుచోట్ల తలెత్తే అవకాశం ఉండటంతో గ్రామాలున్న స్థలాన్ని రెవెన్యూ అధికారులు ముందస్తుగా సర్వే నిర్వహించి కట్టడిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు కోరుతున్నారు.

మాతాత పొలంలో నిర్మించుకున్నా..

మా గ్రామం నాకు ఊహ తెలియక ముందు నుంచే ఉంది. మా ముత్తాత చిన్నమునస్వామి సంపాదించిన పొలంలో మాఅన్నదమ్ములు అందరూ కలిసి ఇళ్ల నిర్మాణం చేపట్టుకున్నాం. ఇప్పుడు మేమున్న స్థలాన్ని బ్యాంకులో తాకట్టుపెట్టి రూ.లక్షల్లో రుణం పొందారు. దీనిని ఎవరు చెల్లించాలి. అధికారులకు చెప్పితే మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే తేవాలంటున్నారు. ఇంతకన్నా ఆధారాలు ఎక్కడ నుంచి తేవాలి. -ధనంజయులు, బాధితుడు

సత్వరంగా చర్యలు

జ్ఞానమ్మకండ్రిగ గ్రామం ఉన్న భూమిని స్థానిక వ్యక్తి స్వాధీనంలో ఉన్నట్లు వీఆర్‌వో ద్వారా తెలుసుకున్నా. సత్వరచర్యగా ఎంఆర్‌ఐ, సర్వేయర్‌, వీఆర్‌వోలతో విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం. ఇలాంటివి మండలంలో ఎక్కడైనా ఉంటే వెంటనే మాకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. -భార్గవి, తహసీల్దార్‌

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.