మృత్యుదారి కావొద్దు! - Bhadradri - EENADU
close

శుక్రవారం, సెప్టెంబర్ 20, 2019

ప్రధానాంశాలు

మృత్యుదారి కావొద్దు!

మణుగూరు-బీటీపీఎస్‌ రహదారిపై పెరగనున్న వాహన రద్దీ

పక్కాగా రక్షణ చర్యలు తీసుకోకుంటే బతుకుల్లో చీకట్లే

పీవీకాలనీ(మణుగూరు), న్యూస్‌టుడే

విస్తరించనున్న మణుగూరు-ఏటూరునాగారం ప్రధాన రహదారి

ఆ మార్గంలో మరికొద్ది రోజుల్లో ఒకటి కాదు రెండు కాదు.. వేల వాహనాల రాకపోకలు పెరగనున్నాయి. లిప్తపాటు కాలంలో ఒకదాని వెంట మరో శకటం ఆగకుండా పరుగులు పెట్టనుంది. టన్నుల బరువుతో.. హారన్ల మోతతో విరామమెరుగక పరిశ్రమిస్తూ, పరిభ్రమిస్తూనే ఉంటాయి. వస్తూపోతూ వాటి వెంట దుమ్మూధూళి తీసుకొచ్చి పక్కనున్న గ్రామాలపై వెదజల్లనున్నాయి. రద్దీతో పెరిగే రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ఠ చర్యలు తీసుకోకుంటే ఈ మార్గం మరో సత్తుపల్లి ఓసీ- కొత్తగూడెం రహదారిగా మారుతుందనటంలో సందేహం లేదు. బీటీపీఎస్‌కు రోడ్డు మార్గంలో బొగ్గు రవాణా చేపడితే పెరిగే వాహన రద్దీ ఎంత? సాధారణ పరిస్థితుల్లో జరిగిన రోడ్డు ప్రమాదాలెన్ని? భద్రాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌(బీటీపీఎస్‌)కు రోడ్డు మార్గంలో మూడేళ్లపాటు బొగ్గు రవాణాకు అనుమతులు వచ్చిన నేపథ్యంలో ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం.

ణుగూరు బీటీపీఎస్‌కు రైల్వే మార్గం ద్వారా బొగ్గు రవాణాకు ఇంకా కొంత సమయం పట్టనున్న నేపథ్యంలో జెన్కో విజ్ఞప్తి మేరకు రోడ్డు మార్గం ద్వారా రవాణాకు పర్యావరణ శాఖ అనుమతి ఇచ్చిన విషయం విదితమే. ఈ రవాణా సెప్టెంబరు లేదా అక్టోబరులో ప్రారంభం కానుంది. ఓసీ 4, మణుగూరు ఓసీ గనుల నుంచి రోడ్డు మార్గంలో మూడేళ్లపాటు బొగ్గు రవాణా జరగనుంది. అయితే ఈ ప్రక్రియ ప్రారంభానికి ముందే పర్యావరణ శాఖ సూచించిన నిబంధనలు జెన్కో సంస్థ అమలు చేయాల్సి ఉంది.

మణుగూరు నుంచి బీటీపీఎస్‌కు వెళ్లే ప్రధాన రహదారి 15 కి.మీ దూరం ఉంటుంది. బీటీపీఎస్‌కు బొగ్గు రవాణా ప్రారంభం అయితే మణుగూరు- ఏటూరునాగారం ప్రధాన రహదారిపై ప్రస్తుతం తిరిగే వాటికన్నా ఎక్కువ సంఖ్యలో వాహనాలు సంచరించనున్నాయి. పరిసర ప్రాంతాల్లో వాహన రద్దీవాతావరణ కాలుష్యం పెరుగుతుంది. నిర్మాణం ప్రారంభం అయిన దగ్గరి నుంచి గత నాలుగేళ్ల కాలంలో వాహనాల సంఖ్య క్రమేపీ పెరుగుతుంది. అనేకమార్లు ప్రమాదాలు జరిగిన ఘటనలు ఉన్నాయి. గనుల నుంచి బీటీపీఎస్‌ బొగ్గు రవాణా జరిగేతే వాహన రద్దీ, కాలుష్యం ఏవిధంగా పెరుగుతుందనే దానిపై ఓ ప్రైవేటు సంస్థ బొగ్గు రవాణా జరిగే మార్గంలో జూన్‌లో మూడు రోజులపాటు సర్వే చేసింది. ఈ నేపథ్యంలో రహదారిపై ప్రమాదాలు పెరిగే అవకాశం లేకపోలేదు. ప్రమాదాలకు చోటివ్వకుండా జెన్కో, సింగరేణి సంస్థలు సంయుక్తంగా జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పర్యావరణ శాఖ సూచనలతోపాటు మరికొన్ని భద్రతా చర్యలు అమలుచేయాలి. వాహన రద్దీకి తగిన విధంగా ప్రమాదాలు జరగకుండా భద్రతా సిబ్బందిని నియమించాలి. పర్యావరణ శాఖ నిబంధనల ప్రకారం గ్రామంలో పిల్లలు అటలు ఆడటానికి వెంటనే ఆటస్థలాలు ఏర్పాటు చేయాలి.

నిర్మాణంలో ఉన్న భద్రాద్రి థర్మల్‌ విద్యుత్తు కేంద్రం

రహదారి వెడల్పు అనివార్యం

బొగ్గు రవాణా నేపథ్యంలో వాహన రద్దీకి ఈ రహదారి సరిపోదు. విస్తరణ అనివార్యం. నిత్యం 655 ట్రక్కుల ప్రయాణం నేపథ్యంలో ఆర్‌అండ్‌బీ శాఖ రహదారిని వెడల్పు చేయాలని జెన్కో కోరింది. కార్యరూపం దాలిస్తే మణుగూరు నుంచి బీటీపీఎస్‌కు 10 కి.మీ. మేర రహదారికి రెండు వెపులా బీటీ వెడల్పు కానుంది. ప్రస్తుతం రాజుపేట కూడలి నుంచి బీటీపీఎస్‌ వరకు రహదారి 7 మీటర్ల వెడల్పు మాత్రమే ఉంది. ఆర్‌అండ్‌బీ అధికారులు బీటీని 10 మీటర్ల వెడల్పు చేయాలని నిర్ణయించారు. రహదారికిరువైపులా బీటీతోపాటు రెండు మీటర్ల చొప్పున మట్టి రోడ్డు వేయనున్నారు. ఇందుకోసం మొత్తం రూ.16 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు.

అన్ని నిబంధనలు అమలు చేస్తాం: అజయ్‌, జెన్కో డైరెక్టర్‌ (సివిల్‌)

రోడ్డు మార్గం ద్వారా బొగ్గు రవాణాకు పర్యావరణ శాఖ ఆదేశించిన సూచనలు అన్ని అమలు చేస్తాం. నిబంధనలకనుగుణంగా బొగ్గు రవాణా జరుపుతాం. రాజుపేట గ్రామంలో పిల్లలు ఆడుకోవటానికి ఆటస్థలం ఏర్పాటు చేస్తాం. రహదారికి ఇరువైపులా మొక్కలు నాటుతాం.

ప్రతిపాదనలు పంపాం: హరిలాల్‌, డీఈ, ఆర్‌అండ్‌బీ

వాహన రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో రహదారిని విస్తరించాలని జెన్కో కోరింది. దీనిపై మణుగూరు నుంచి బీటీపీఎస్‌ వరకు రహదారిని 10 మీటర్ల వరకు వెడల్పు చేయాలని నిర్ణయించాం. దీనిపై ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపాం. రహదారి విస్తరణకయ్యే నిధులు, ప్రభుత్వం లేదా జెన్కో సంస్థ నిధులు మంజూరు చేస్తుందా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.