హరనాథ్‌బాబా భూములపై ఆగని రగడ - Bhadradri - EENADU
close

బుధవారం, సెప్టెంబర్ 18, 2019

ప్రధానాంశాలు

హరనాథ్‌బాబా భూములపై ఆగని రగడ
రాజీవ్‌నగర్‌ కాలనీలో హరనాథ్‌బాబా ఆలయ
స్థలాలను పరిశీలిస్తున్న రామాలయం ఈవో రమేశ్‌బాబు

భద్రాచలం, న్యూస్‌టుడే: భద్రాచలం రామాలయం సమీపంలోని హరనాథ్‌బాబాకు సుమారు 65 ఎకరాల భూమి ఉండగా ఇందులో ఎక్కువ భాగం కౌలుకు ఇవ్వగా విలువైన స్థలాలు ఆక్రమణకు గురయ్యాయి. గతం నుంచి కబ్జాల పరంపర సాగుతునే ఉంది. కొత్తగా ఎలాంటి ఆక్రమణలకు తావు లేకుండా దేవాదాయశాఖ చర్యలు చేపట్టడంతో వివాదం మొదలైంది. ఐటీడీఏ రోడ్డులో చాలాకాలం కిందట రాజీవ్‌నగర్‌ కాలనీ ఏర్పడింది. ఇక్కడ కొంతమందికి సొంత స్థలాలు ఉండగా సుమారు 3 ఎకరాలలో 100 ఇళ్లు హరనాథ్‌బాబా భూమిలో నిర్మించుకున్నారు. అప్పటి అధికారులు మెతక వైఖరితో రానురాను చిన్నచిన్న గృహాల స్థానంలో అద్దాల మేడలను నిర్మించారు. ఈ ప్రాంతంలో స్థలాలకు రూ.లక్షల్లో ధర పలుకుతుండటంతో చాలామంది క్రయవిక్రయాలకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో కొంతమంది ఏమీ తెలియక ఈ ప్రాంతంలో భవంతులను కొనుగోలు చేశారు. మూడు, నాలుగు దశాబ్దాలుగా ఉంటున్న వాళ్లకు కొత్తగా వచ్చిన వాళ్లు తోడై ఈ ప్రాంతంలో జీవిస్తున్నప్పటికీ వాస్తవాలను గుర్తించకుండా సమస్య వచ్చినప్పుడు మాత్రమే హడావుడి చేస్తున్నారు. సోమవారం షెడ్డు నిర్మాణాన్ని అడ్డుకున్న అధికారులు మంగళవారం ఈ ప్రాంతంలో ఖాళీ ప్రదేశాలలో బోర్డులను ఏర్పాటు చేసుకునేందుకు సిద్ధపడ్డారు. దీన్ని స్థానికుల్లో కొందరు అడ్డుకోవడంతో పోలీసులు బందోబస్తుకు తిరగాల్సి వచ్చింది. పరిస్థితి చేయిదాటకుండా ఉండాలని ఇరు వర్గాలు స్టేషన్‌కు వెళ్లి చర్చలు చేసినప్పటికీ ఈ సమస్య మూలాలను వదిలేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. రాజీవ్‌నగర్‌లో స్థిర నివాసాలను ఏర్పాటు చేసుకున్నందున శాశ్వత హక్కులు పొందేందుకు దేవాదాయ శాఖతో న్యాయబద్ధంగా చర్చలు చేసుకుని రాతపూర్వక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతో కాలంగా ఈ స్థలంలో మేమే ఉంటున్నామని వాదించుకుంటే సమస్యకు పరిష్కారం లభించడం కష్టమేనని నిపుణులు అంటున్నారు. దేవాదాయ శాఖ సిబ్బంది సైతం బహుళ అంతస్తులు నిర్మించే వరకు స్పందించకుండా ఇప్పుడు కదలడంలో మర్మమేమిటో దేవుడికే తెలియాలి. ఇప్పటికైనా ఖాళీ స్థలాలను కాపాడుకోవాలని భక్తులో కోరుతున్నారు.

దేవుడి భూములను ఖాళీ చేయండి

హరనాథ్‌ బాబా ఆలయ భూముల్లో ఉన్న ఆక్రమణలను తొలగించాలని దేవాదాయ శాఖ భూముల పరిరక్షణ ప్రత్యేక అధికారిగా ఉన్న రామాలయం ఈవో రమేశ్‌బాబు స్పష్టం చేశారు. ఈ భూముల వివాదం గురించి హరనాథ్‌బాబా ఆలయం ఈవో వేణుగోపాల్‌గుప్తా ద్వారా తెలుసుకున్న ఆయన పరిస్థితిని సమీక్షించారు. ఆ స్థలాల్లో ఉంటున్న వాళ్లతో చర్చించి చట్టంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం వ్యవహరించాలని సూచించారు. ఎక్కడెక్కడ బోర్డులు ఉన్నాయో క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.