రామయ్యకు నిత్య కల్యాణోత్సవం - Bhadradri - EENADU
close

గురువారం, సెప్టెంబర్ 19, 2019

ప్రధానాంశాలు

రామయ్యకు నిత్య కల్యాణోత్సవం

శ్రీమద్భాగవత పూజలు చేస్తున్న అర్చకుడు

భద్రాచలం, న్యూస్‌టుడే: ఏమి నోము ఫలమో శ్రీరామ చంద్రా నీ దర్శన భాగ్యం మాకు కల్పించావు అంటూ రామ భక్తులు భజనలు చేయడంతో భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక సంద్రమై కనిపించాయి. మంగళవారం వీనులకు విందు చేసే కీర్తనలతో ఈ ప్రాంగణం మరో అయోధ్యగా సాక్షాత్కరించింది. ఆలయం తలుపులు తెరిచిన తర్వాత రామయ్యకు అర్చకులు సుప్రభాతం పలికి ఆరాధించి నామార్చనలు చేశారు. వైదిక పెద్దలు క్షేత్ర విశిష్టతను ప్రవచించిన తీరు ఓలలాడించింది. వైష్ణవ సంప్రదాయంలో విష్వక్సేన పూజ పుణ్యాహ వాచనం నిర్వహంచి కంకణ ధారణ కొనసాగించారు. మాంగళ్యధారణ కడు రమణీయతను చాటగా తలంబ్రాల వేడుక ఆనందంలో ముంచెత్తింది. దర్బారు సేవలో రాముడి వైభవం చూసిన భక్తజనం తరించింది. ఆంజనేయస్వామికి నయనానందంగా అభిషేకం నిర్వహించారు. తమలపాకులను సమర్పించి సింధూర బొట్టును నుదుట ధరించి హనుమాన్‌ చాలీసాను పఠించారు. రామబంటు అంజన్నను కీర్తించి సుందరకాండ పారాయణం చేశారు. శ్రీమద్భాగవత సప్తాహం ఈ నెల 27 వరకు చిత్రకూట మండపంలో నిర్వహించనున్నందున తొలి రోజున అంకురార్పణ పూజలు చేశారు. వాస్తు హోమం చేసి మండపారాధన కొనసాగించి విష్ణు సహస్ర నామార్చన నిర్వహించారు. ప్రతీ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు క్రతువు ఉంటుందని వైదిక పెద్దలు తెలిపారు. ఈ సప్తాహం ప్రారంభ పూజల్లో ఈవో తాళ్లూరి రమేశ్‌బాబు పాల్గొని ప్రధానార్చకుడు సీతారామానుజాచార్యులతో పాటు వైదిక సిబ్బందికి దీక్షా వస్త్రాలను అందించారు.

ఆలయాన్ని దర్శించుకున్న ఎంపీ నామా నాగేశ్వరరావు

ఆలయాన్ని దర్శించుకున్న ఎంపీ నామా

శ్రీసీతారామచంద్రస్వామి ఆలయాన్ని ఎంపీ నామా నాగేశ్వరరావు మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. ఈయనకు ఈవో తాళ్లూరి రమేశ్‌బాబు ఘన స్వాగతం పలకగా ప్రధానార్చకుడు సీతారామానుజాచార్యులు నేతృత్వంలో ఆశీర్వచనం అందించారు. ప్రధాన ఆలయంలో కొలువైన మూలమూర్తులను దర్శించుకుని అనుబంధంగా ఉన్న ఆంజనేయుణ్ని, లక్ష్మీతాయారు అమ్మను దర్శించుకున్నారు. ఆలయం తరుఫున తీర్థప్రసాదాలను అందించారు. పలువురు ప్రముఖులు ఈయనను కలిసి వినతి పత్రాలను అందించారు. మరణించిన హోమ్‌ గార్డ్స్‌ కుటుంబ సభ్యులు కలిసి తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని వేడుకున్నారు. విధుల్లో ఉండగా పలు కారణాలతో చనిపోయిన హోమ్‌ గార్డుల కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేయడంతో ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఆయన హామీనిచ్చారని తెలిపారు. ఆ తర్వాత విలేకరులతో మాట్లాడారు. భద్రాచలం రామాలయం అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కట్టుబడి ఉన్నారని వెల్లడించారు. పోలవరం బ్యాక్‌ వాటర్‌ పరిస్థితిని తెలుసుకుని సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలను తయారు చేస్తున్నారని వివరించారు. రామాలయానికి ఎంతో విశిష్టత ఉన్నందున ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు. బూర్గంపాడు మండలం పాండురంగాపురం నుంచి సారపాక వరకు రైల్వే లైను పొడిగింపు అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి ఈ ప్రాంతానికి మంచి చేసేందుకు తనవంతు కృషి ఉంటుందని తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో తూర్పు గోదావరి జిల్లాలో కలిసిన ఐదు గ్రామాలను తిరిగి భద్రాచలంలో విలీనం చేసేందుకు తెరాస ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని తెలిపారు. ఈ సమస్యపై తనకు పూర్తి అవగాహన ఉందని వీలైనంత తొందరగా దీన్ని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని పేర్కొన్నారు. తెరాస నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.