close

మంగళవారం, అక్టోబర్ 15, 2019

ప్రధానాంశాలు

ఒక గంట.. సంతోషాల పంట 

పాఠశాలల్లో కొత్త బంగారు లోకం 
కార్పొరేట్‌ సంస్థల్లో జోరందుకున్న ఆనందం

చిన్నారులతో సరదాగా కబుర్లు చెప్పి.. మనసారా నవ్వేటట్లు చేస్తున్నామా... ఒక వేళ అలా సందడిగా పిల్లలను ఉంచాలన్నా.. మనకు అంత సమయం ఉంటుందా... నాలుగైదేళ్లు వచ్చిన తర్వాత పిల్లలు మన వద్ద కంటే.. పాఠశాలల్లోనే ఎక్కువ సమయం ఉంటున్నారు. సెలవు రోజు.. పాఠశాల సమయాలకు ముందు.. తర్వాత ఇంట్లో ఉన్నా.. అప్పుడు తల్లిదండ్రులు  తీరిక లేకుండా ఉంటారు. అలా అని ఇంట్లో అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములతో కలిసి ఆడుకోడానికి ఉమ్మడి కుటుంబాలు లేవు. ఇలాంటి తరుణంలో పిల్లల మౌనం భవిష్యత్తుకు శాపంగా మారుతోంది. అందుకే నగరంలోని పాఠశాలలు కొత్త ఒరవడికి తెరదీశాయి. ఒక్కో పాఠ్యాంశానికి ఒక గంట కేటాయించినట్టే.. ఆటపాటలకు  సమయమిస్తున్నట్టే.. ఇప్పుడు ‘హ్యాపీ అవర్‌’ను పెడుతున్నాయి.

- ఈనాడు-హైదరాబాద్‌, జూబ్లీహిల్స్‌-న్యూస్‌టుడే

 

హ్యాపీ అవర్‌లో.. 
ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ తరగతులు జరుగుతూ ఉంటాయి. మధ్యాహ్నం 3 గంటల నుంచి 3.30 మధ్యన ఒక గంట ‘హ్యాపీ అవర్‌’గా దూలపల్లిలోని సెయింట్‌ పీటర్స్‌ ఇంటర్నేషనల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ ప్రకటించింది. ఇదే పేరిట ఒక పాఠశాల రేడియో కార్యక్రమాలను రూపొందించింది. ఇందులో పిల్లలు స్వయంగా వచ్చి పాడుతుంటారు. తాజా అంశాలపై మాట్లాడుతుంటారు. రైమ్స్‌, కవితలు, జోక్‌లు ఇలా విద్యార్థులందరి హృదయాల్లోకి తారాజువ్వల్లా దూసుకెళ్లి ఆనంద పరవశులయ్యేలా చేస్తాయి. దిల్లీలోని ఒకటి రెండు పాఠశాలలు ఇలా ‘హ్యాపీ అవర్‌’ను పెట్టి చిన్నారుల్లో చిరునవ్వులు విరిసేలా చేస్తున్నాయని తెలిసి ఇక్కడ కూడా ప్రారంభించామని పాఠశాల సంచాలకులు సరోజారెడ్డి చెబుతున్నారు. కొన్ని కొన్ని అంశాలను పిల్లల నోటంట వినాలే కాని.. నవ్వును ఆపుకోలేమని అంటున్నారు.

అందరికీ కావాలి.. 
ర్యాంకులు, మార్కుల వేటలో చిన్నారులు సంతోషాన్ని కోల్పోతున్నారు. ఉదయం నిద్ర లేచింది మొదలు.. పాఠశాలకు బయలుదేరడం.. హడావుడిగా బస్సెక్కడం.. హోంవర్కులు ఇలా క్షణం తీరిక లేకుండా సాగిపోతోంది చిన్నారుల జీవితం. సంతోషంగా ఉండాలన్నా ఉండలేని పరిస్థితి. ఇలాంటి తరుణంలోనే మనం కొంతైనా ఆనందాన్నిచ్చే పనుల్లో నిమగ్నమవ్వాలి. కొంత సమయం కేటాయించాలి. వివిధ రకాలైన వ్యాపకాలతో సంతోషంగా ఉండొచ్చు. మన చుట్టూ ఉన్న వారిని ఉంచొచ్చు. అయితే సంతోషం విజయాన్నివ్వదు. కాని సంతోషంగా ఉన్న వారు విజయాలు సాధించగలుగుతున్నారు. డబ్బులు సంపాదించడంలోనూ..పనితనంలోనూ ఇది ప్రత్యేక పాత్ర పోషిస్తుంది.

పెరుగుతున్న ఒరవడి.. 
యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, భూటాన్‌ దేశాలు సంతోషాలను లెక్కించే విధానాన్ని అమలు చేస్తున్నాయి. పౌరులను ఆనందంగా ఉంచేందుకు ఏకంగా మంత్రిత్వ శాఖలనే ఏర్పాటు చేశాయి. మధ్యప్రదేశ్‌ సంతోషం విభాగాన్ని ఏర్పాటు చేసింది. చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్‌ కూడా హ్యాపీనెస్‌ కమిషనరేట్‌ పెట్టాలని ఆలోచించింది. కొన్ని కార్పొరేట్‌ సంస్థలు, ఐటీ కంపెనీలు ఇప్పటికే హ్యాపీనెస్‌ అధికారులను నియమించి..ఉద్యోగులను సంతోషంగా ఉంచడంపై కసరత్తు చేస్తున్నారు. ఇప్పుడు పాఠశాలల వంతైంది. లాడ్జ్‌ కీస్‌ నంబరు 297 అనే స్వచ్ఛంద సంస్థ తన 25 వసంతాల వేడుకను ఎదుటివారిని సంతోషంగా ఉంచాలనే నినాదంతో చేసుకుంది. జెన్‌క్యూ సంస్థ తమ ఉద్యోగులతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

సరికొత్త బాటల్లో... 
చాలా సంస్థలు, పాఠశాలలు, కళాశాలలు, సంఘాలు ఇప్పుడు ఆనందం కోసం కొత్త బాటల్లో నడుస్తున్నాయి. ఇప్పటికే పలు లాఫింగ్‌ క్లబ్‌లు ఉదయాన్నే పార్కుల్లో కలిసి ఆనందాన్ని పంచుకుంటున్నాయి. ఇటీవల సంస్థలు ఆనంద విభాగాన్ని ఏర్పాటుచేసి వాటికి ప్రతినిధులను నియమిస్తున్నాయి. తమ సంస్థలో ఇటీవల  ఏర్పాటు చేసిన హ్యాపీ విభాగం కారణంగా పాఠశాలలో, కళాశాలలో చదివిన రోజులు గుర్తుకు వస్తున్నాయని అంటున్నారు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి భానుకిరణ్‌.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.