పెద్దాసుపత్రి పేరు చెడగొట్టొద్దు - Bhadradri - EENADU
close

శనివారం, సెప్టెంబర్ 21, 2019

ప్రధానాంశాలు

పెద్దాసుపత్రి పేరు చెడగొట్టొద్దు

సమయ పాలన పాటించకుంటే సహించేది లేదు

వైద్యసేవల తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం

రోగులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌

ఖమ్మం వైద్యవిభాగం, న్యూస్‌టుడే: ఖమ్మం జిల్లా కేంద్రంలోని పెద్దాసుపత్రి పేదల ఆస్తి అని.. వైద్యులు సమయపాలన పాటించకుండా ఆ వర్గాలకు ఎలా వైద్య సేవలందిస్తారని ఖమ్మం శాసనసభ్యుడు పువ్వాడ అజయ్‌కుమార్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది హాజరుకు సంబంధించిన బయోమెట్రిక్‌ విధానాన్ని ఎందుకు వినియోగించడం లేదని నిలదీశారు. ఖమ్మం సర్కారు దవాఖానాలో వైద్యులు సమయపాలన పాటించని వైనంపై ‘అమ్మా.. డాక్టర్‌ మళ్లీ వస్తారా..!’ శీర్షికన ‘ఈనాడు’లో మంగళవారం ప్రచురితమైన కథనానికి ఎమ్మెల్యే స్పందించి ఆసుపత్రిని ఉదయం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన వైద్యాధికారులతో వైద్యసేవల తీరును సమీక్షించారు. వైద్యుల హాజరు పట్టికలను పరిశీలించి అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు కృషి చేస్తోందని, ఇందులో భాగంగా ఖమ్మం ఆసుపత్రిలో సౌకర్యాలు కల్పించారని తెలిపారు. ఆసుపత్రికి కాయకల్ప అవార్డులు సైతం వచ్చాయన్నారు. బోధానాసుపత్రిగా అవతరించే తరుణంలో ఆసుపత్రి పేరును చెడగొట్టొద్దని, ఇలా ఎవరైనా ప్రయత్నం చేస్తే సహించేది లేదని వైద్య సిబ్బందిని హెచ్చరించారు. త్వరలోనే హెచ్‌డీఎస్‌ కమిటీ సమావేశాలు నిర్వహించి ఇక్కడ ఉన్న చిన్నచిన్న లోపాలను సరిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే ప్రకటించారు. త్వరలోనే ఆసుపత్రిలో ట్రామా కేర్‌ సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు.

 

ఆసుపత్రిలో సుడిగాలి పర్యటన

ఎమ్మెల్యే అజయ్‌కుమార్‌ తొలుత ఆసుపత్రిలోని రోగుల సేవలను పరిశీలించారు. ఓపీ విభాగాల్లో వైద్యుల గురించి ఆరా తీశారు. వ్యాధి నిర్ధారణ పరీక్షల కేంద్రానికి వెళ్లి రోగులతో మాట్లాడారు. పరీక్షల తీరును పరిశీలించారు. డయాలసిస్‌ కేంద్రంలో రక్తశుద్ధి సేవలు పొందుతున్న రోగులను పరామర్శించారు. అనంతరం మహిళా వార్డులో రోగుల కేషీట్స్‌ను పరిశీలించారు. రోగుల వివరాలు పూర్తిగా ఎందుకు నమోదు చేయలేదని వైద్యులు, నర్సులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బయోమెట్రిక్‌ పరికరం పనితీరును పరిశీలించారు. వైద్యుల హాజరు నమోదు వివరాలను తీసుకురావాలని ఆర్‌ఎంవో డాక్టర్‌ కృపా ఉషశ్రీకి సూచించారు. మాజీ ఎమ్మెల్యే సుల్తాన్‌ ఏర్పాటు చేసిన ఐసీయూను వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. అనంతరం వైద్యాధికారులతో కలిసి మాతా శిశు ఆరోగ్య కేంద్రంలోని తల్లీ పిల్లల వార్డుల్లో ఓపీ సేవలను పరిశీలించారు. హాజరు పట్టికలను తెప్పించి వైద్యుల పేర్లు, హాజరు నమోదు సక్రమంగా లేదని అధికారులపై మండిపడ్డారు.

హాజరు నమోదుపై తీవ్ర అసంతృప్తి

బయోమెట్రిక్‌ హాజరు నమోదు అస్తవ్యస్తంగా ఉండటంతో ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో 68 మంది వైద్యులకు గాను 46 మంది పేర్లు మాత్రమే బయోమెట్రిక్‌లో నమోదు చేశారు. వేలి ముద్రలు రికార్డు అయిన సమయంలో వ్యత్యాసాన్ని గుర్తించి విభాగాల వారీగా వైద్యుల హాజరు పట్టికను తయారు చేయాలని ఆదేశించారు. ప్రసూతి, పిల్లల విభాగంలో కొందరు వైద్యులు లేరనే విషయాన్ని తెలుసుకున్నారు. ఇళ్ల వద్ద ఉన్న కొందరు వైద్యులను అప్పటికప్పుడు అధికారులు పిలిపించడం గమనార్హం. తరుణ వ్యాధులు సమీపిస్తున్నందున వైద్యుల సమయపాలనపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. బయోమెట్రిక్‌ హాజరు విధానం సక్రమంగా అమలు కావడం లేదని, వైద్య బృందం విధులను తక్షణమే గాడిలో పెట్టాలని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ బి. వెంకటేశ్వర్లు, ఆర్‌ఎంవో డాక్టర్‌ కృపా ఉషశ్రీకి సూచించారు. ఆసుపత్రి సేవలను విధిగా పర్యవేక్షించాలని డీఎంహెచ్‌వో కళావతిబాయిని ఆదేశించారు. వైద్యులు మధ్యాహ్నం రెండు గంటల వరకు తప్పనిసరిగా అందుబాటులో ఉంటూ ఔట్‌పేషంట్‌ సేవలందించాలని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.