చరవాణి.. కావొద్దు ‘చోర’వాణి  - Hyderabad - EENADU
close

సోమవారం, సెప్టెంబర్ 16, 2019

ప్రధానాంశాలు

చరవాణి.. కావొద్దు ‘చోర’వాణి 

రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబరు విషయంలో  జాగ్రత్త.. 
నేరస్థులకు చిక్కితే ఖాతాలో సొమ్ముకు రెక్కలు

అంతర్జాలం హవా నడుస్తున్న ప్రస్తుత తరుణంలో అన్ని పనులు అరచేతిలో చరవాణితోనే పూర్తవుతున్నాయి. బస్‌ టికెట్ల కొనుగోలు మొదలుకొని బ్యాంకు లావాదేవీల వరకు అన్నింటినీ చరవాణే చక్కబెడుతోంది. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల విషయంలో బ్యాంకు వరకు వెళ్లకుండానే వన్‌టైం పాస్‌వర్డ్‌(ఓటీపీ)ల ఆధారంగా చకచకా జరిగిపోతున్నాయి. ఈ తరహా పనులన్నింటికీ బ్యాంకులో నమోదై ఉండే రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబరే కీలకం. అంతటి కీలకమైన చరవాణి విషయంలో ఆదమరిచి ఉంటే అంతే సంగతులు అంటున్నారు సైబర్‌క్రైమ్‌ పోలీసులు.

ఈనాడు, హైదరాబాద్‌:

బ్యాంకు ఆధారిత ఏ లావాదేవీకైనా బ్యాంకు ప్రతినిధులు వినియోగదారుడి రిజిస్టర్‌ మొబైల్‌ నంబర్‌కు పంపించే ఓటీపీ ఉంటే పనైపోతుంది. ఆన్‌లైన్‌లోగానీ, ఏటీఎంలో గానీ వినియోగదారుడి డెబిట్‌/క్రెడిట్‌కార్డుతో నగదు లావాదేవీలు నిర్వహించినప్పుడు సదరు వ్యక్తికి బ్యాంకు ప్రతినిధులు పంపించే ఓటీపీని నమోదు చేస్తే లావాదేవీ పూర్తవుతుంది. ఈక్రమంలో డెబిట్‌/క్రెడిట్‌ కార్డు వివరాలతోపాటు చరవాణి గనక అపరిచితుల చేతికి వెళితే చిక్కులు కొని తెచ్చుకున్నట్లే. కొద్దిరోజుల క్రితం మాదాపూర్‌ ఉదంతంలో సరిగ్గా ఇలాగే జరిగింది. బాధితుడి ఫ్లాట్‌కు వచ్చిన అపరిచితుడు ముందుగా బాధితుడి పర్సులోని డెబిట్‌కార్డు పదహారు అంకెల సంఖ్య, సీవీవీ సంఖ్య, గడువుతేదీ లాంటి వివరాల్ని చూసుకున్నాడు. అనంతరం తన ఇంటికి ఓ ఫోన్‌ చేసుకుంటానని చెప్పి బ్యాంకు కస్టమర్‌ కేర్‌కు ఫోన్‌ చేశాడు. రిజిస్టర్డ్‌ మొబైల్‌ నుంచే ఫోన్‌ రావడంతో బ్యాంకు ప్రతినిధులకు అనుమానం రాలేదు. తన పిన్‌ నంబర్‌ను మార్చుకోవాలంటూ కోరడంతో ఓటీపీ పంపించారు. ఆ వెంటనే బయటికి వెళ్లిన అపరిచితుడు ఏటీఎంలో కార్డురహిత లావాదేవీ ద్వారా పిన్‌ నంబరును మార్చేశాడు. అనంతరం మూడు విడతలుగా సుమారు రూ.50వేలను కొట్టేశాడు. అపరిచితులకు చరవాణి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఆ ఉదంతం చాటి చెప్పింది.
 

చరవాణిలో నిక్షిప్తం చేస్తున్నారా..? 
అంతర్జాల సదుపాయం కలిగిన చరవాణితోనే అన్ని రకాల ఆర్థిక లావాదేవీలు జరిగిపోతుండటంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం మరింతగా పెరిగిందనే చెప్పొచ్చు. చాలా మంది అమాయకంగా డెబిట్‌/క్రెడిట్‌కార్డుల నంబరు, పిన్‌నంబర్లనూ చరవాణిలోనే నిక్షిప్తం చేస్తున్నారు. మరిచిపోతామనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారు. ఇది ప్రమాదకరం అని సైబర్‌క్రైమ్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా ఉచిత యాప్‌ల మాటున మాల్‌వేర్లు పంపించే అవకాశాలు మెండుగా ఉండటంతో ఆ వివరాల్ని సైబర్‌ నేరగాళ్లు తస్కరించేందుకు అవకాశాలు ఎక్కువ. అనంతరం ఆ వివరాల ఆధారంగా నేరగాళ్లు ఆర్థిక లావాదేవీల్ని నిర్వహించే ప్రమాదాలు లేకపోలేదు. ఈక్రమంలో రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌కు వచ్చే ఓటీపీనీ హ్యాక్‌ చేసే నేరపద్ధతుల్ని అవలంబిస్తుండటంతో ఈ అక్రమ లావాదేవీలు సులభమైపోయాయి. అందుకే ఆయా డెబిట్‌/క్రెడిట్‌కార్డుల వివరాల్ని అవే పేర్లతో కాకుండా కోడ్‌భాషలో నిక్షిప్తం చేసుకోవడం ఉత్తమమనేది నిపుణుల అభిప్రాయం.

ఎప్పుడూ ఓ కన్నేయడం ఉత్తమం.. 
సాధారణంగా సైబర్‌ నేరస్థులు ఓటీపీలను చెరబట్టేందుకు వినూత్న పద్ధతుల్ని వినియోగిస్తున్నారు. బాధితులకు సంబంధించిన ధ్రువీకరణపత్రాల వివరాలను అంతర్జాలం నుంచే ఒడుపుగా కొట్టేస్తున్నారు. ఇందుకు ఫేస్‌బుక్‌ ఖాతాలాంటి సామాజిక మాధ్యమాల్ని ఆసరాగా చేసుకుంటున్నారు. ఆ ధ్రువీకరణ పత్రాలను ఆధారంగా చూపి బాధితుడి చరవాణి సిమ్‌ను వినియోగదారుల సేవాకేంద్రాల నుంచి కొత్తది తీసుకుంటున్నారు. ఆ సమయంలో సాంకేతికతను వినియోగించి సిమ్‌ను పని చేయనీయకుండా చేస్తున్నారు. అప్పటికే బ్యాంకు ఖాతాల వివరాలను థర్డ్‌ పార్టీ ఏజెన్సీ నిర్వాహకుల నుంచి కొనుగోలు చేసి ఉంచుకుంటున్నారు. అలా బాధితుడి బ్యాంకుతో అనుసంధానమై ఉన్న సిమ్‌ కార్డు చేతికి చిక్కుతుండటంతో ఆన్‌లైన్‌ లావాదేవీలకు పాల్పడుతూ బాధితుడి బ్యాంకు ఖాతాను కొల్లగొడుతున్నారు. అందుకే చాలా సేపు సిమ్‌ పని చేయకుండా ఉంటే అప్రమత్తం కావాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. వెంటనే కస్టమర్‌ కేర్‌కు ఫిర్యాదు చేస్తే సైబర్‌ నేరస్థుల మోసానికి అడ్డుకట్ట వేయొచ్చని చెబుతున్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.