ఇంకెన్నాళ్లు.. నీళ్లు నములుతారు - Kurnool - EENADU
close

సోమవారం, సెప్టెంబర్ 16, 2019

ప్రధానాంశాలు

ఇంకెన్నాళ్లు.. నీళ్లు నములుతారు

● సాగుకు ఎప్పటి నుంచి ఎంత నీరిస్తారో!

  ఆశగా ఎదురుచూస్తున్న ఆయకట్టు రైతులు 

● ఐఏబీ సమావేశంపై అధికారుల తర్జనభర్జన

కేసీ కాల్వ కింద నారు పోసుకుంటున్న రైతులు

కర్నూలు జలమండలి, న్యూస్‌టుడే: జిల్లాలో ఆయకట్టు రైతులకు సాగునీరు ఇస్తారా.. ఇవ్వరా అనే అంశం సందిగ్ధంలో పడింది. ఎప్పటి నుంచి ఎంతవరకు.. ఏయే కాల్వలకు ఎంత పరిమాణంలో నీరిస్తారు. ఏ రకాల పంటలు సాగు చేసుకోవాలనే దానిపై స్పష్టత లేక జిలాల్లోని అన్నదాతలు ఆశగా చూస్తున్నారు. అధికార యంత్రాంగం ఇంతవరకు స్పష్టమైన ప్రకటన చేయకపోవడం కర్షకుల్లో కలవరం రేకెత్తిస్తోంది. జిల్లాలో ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల కింద ఎంత ఆయకట్టుకు ఎప్పటి నుంచి నీరిస్తారనే వివరాలను ఖరారు చేసేందుకు వేదిక అయిన నీటిపారుదల సలహా మండలి (ఐఏబీ) సమావేశం ఎప్పుడు నిర్వహించి.. నీటి విడుదలపై ఎప్పుడు ప్రకటన చేస్తారా? అని ఆయకట్టు రైతులు ఎదురు చూస్తున్నారు.నీటి విడుదలపై ఒకసారి ప్రకటన చేసిన తరువాత రైతుల నుంచి ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నీటిపారుదల అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. తుంగభద్ర వరద తగ్గుముఖం పట్టడంతోపాటు ఇక పోతిరెడ్డిపాడు నుంచి ఎన్ని రోజులు ఎంత నీరు వస్తుందనే అంశంపై అధికారులు ఒక అంచనాకు రాలేకపోతున్నారు. తుంగభద్ర జలాశయం నుంచి ఎల్లెల్సీ కాల్వకు 600 క్యూసెక్కులకుగాను 260 క్యూసెక్కులకు మించి రావడం లేదు. దీంతో అధికారులు అయోమయ పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఆయకట్టుకు నీరిస్తామని చెప్ఫి. ఇవ్వకపోతే ఎదురయ్యే ఇబ్బందులపై చర్చించుకుంటున్నారు.

సుంకేసుల నుంచి 68 టీఎంసీల నీరు శ్రీశైలానికి..

తుంగభద్రమ్మ ఏరులై పారడంతో సుంకేసుల జలాశయానికి వచ్చిన వరదనీటిని శ్రీశైలం జలాశయానికి పంపాల్సి ఉంది. ఈ నెల 6 నుంచి 20వ తేదీ వరకు 68 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేయాల్సి వచ్చింది. ఇంత నీటిలో సుంకేసుల నుంచి కేసీ కాల్వకు 1.750 టీఎంసీలకు మించి విడుదల చేయలేదు. సుంకేసుల జలాశయంలో మాత్రం 1.200 టీఎంసీ (పూర్తిస్థాయి నీటిమట్టం) నిల్వ చేశారు. ఇది కేవలం కర్నూలు నగర ప్రజల దాహార్తి కోసం. కర్నూలు నగర ప్రజలకు తాగునీటి అవసరాలు తీర్చే బాధ్యత జలవనరుల శాఖ మీదే పడుతోంది. పురపాలక అధికారులు మరో ఎస్‌ఎస్‌ ట్యాంకు నిర్మాణం చేసేవరకు... సుంకేసుల బ్యారేజీ నుంచి కేసీ ఆయకట్టుకు నీటివిడుదల.. రైతుల స్థితిగతుల సంగతేమోగాని.. కర్నూలు నగరానికి తాగునీటిని నిల్వ చేయాల్సిన బాధ్యత మాత్రం ఇరిగేషన్‌ ఇంజినీర్ల భుజాలపై ఉందనేది వాస్తవం.

వరుణుడిపైనే భారం

ఈ ఏడాది ఆయకట్టుకు నీరిస్తారా.. లేదా అనేది ప్రశ్నార్థకంగా మారుతోంది. ఒకవైపు ఖరీఫ్‌ సీజన్‌ పూర్తవడంతోపాటు.. తుంగభద్ర, కృష్ణా జలాల ప్రవాహం కూడా తగ్గుముఖం పట్టింది. జిల్లాలో జలశయాల్లోకి వరద నీరు చేరింది. ఇక కాల్వల ద్వారా నీరిస్తారా.. ఇవ్వరా.. ఎప్పటినుంచి ఎంత నీరు ఎంతవరకు ఇస్తారనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. జిల్లా నీటిపారుదల, వ్యవసాయ శాఖ అధికారులకు సమన్వయం లేకపోవడంతోనే రైతులు సగం నష్టపోతున్నారు. ఈ రెండు శాఖల అధికారులు సమావేశమై.. ఏయే కాల్వల కింద ఎంత ఆయకట్టు ఉంది? ఎప్పుడు ఎంత నీరు అవసరమవుతుంది? ఏయే ప్రాంతాల్లో ఏ పంటలు సాగు చేస్తున్నారు? ఏ ప్రాంతంలో ఎంత నీరు అవసరం అనే అంశాలపై చర్చించుకున్న దాఖలాలు లేవు. వీటిపై జిల్లా యంత్రాంగం పర్యవేక్షణ అంతంత మాత్రంగా ఉంది. ఫలితంగా జిల్లాలో ఆయకట్టు రైతులు అధిక శాతం వరుణుడిపై భారం వేయాల్సి వస్తోంది.

ఐఏబీ తేదీ నిర్ణయించాల్సి ఉంది

నీటి పారుదల సలహా మండలి సమావేశం తేదీ నిర్ణయించాల్సి ఉంది. ఈమేరకు సీఈ నిర్ణయం తీసుకోవాలి. ఇప్పటికే పంటల సాగు, నీటి విడుదలపై సీఈకి తెలియజేశాం. కాల్వల్లో నీటి ప్రవాహం ఉండటంతో రైతులు పంటలకు సిద్ధమవుతున్నారు. మేజరు ప్రాజెక్టులకు సాగునీటి విడుదల అంశాన్ని సీఈ నిర్ణయించాల్సి ఉంది. - పి.శ్రీరామచంద్రమూర్తి, కన్వీనరు, ఐఏబీ

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.