శ్రీ గిరి అంత బాధ్యతలున్నాయ్ - Kurnool - EENADU
close

గురువారం, సెప్టెంబర్ 19, 2019

ప్రధానాంశాలు

శ్రీ గిరి అంత బాధ్యతలున్నాయ్

శ్రీశైలంలో అసంపూర్తిగా బృహత్తర ప్రణాళిక

తిరుపతి తరహా ఎన్నటికో?

నత్తనడకన సాగుతున్న ‘ప్రసాదం’ పథకం

 కొత్తగా వచ్చిన ఈవోకు సమస్యల తోరణం

 

కష్టాలు తీర్చమని వేడుకోవడానికి మల్లన్న చెంతకు వెళ్తున్న భక్తులకు అసౌకర్యాలు ఆహ్వానం పలుకుతున్నాయి. నూతన ఈవోనైనా దీనిపై దృష్టి సారించాల్సి ఉంది. శ్రీశైలం ఈవోగా గతంలో పనిచేసిన ఐఏఎస్‌ అధికారి భరత్‌గుప్తా మంచి పేరు సంపాదించుకున్నారు. బృహత్తర ప్రణాళిక అమలు చేసి రహదారులు, దుకాణాల సముదాయం, పాతాళగంగ స్నాన ఘాట్లు, భూగర్భ మురుగు కాలువలు, నీటి సరఫరా వంటి పనులు పూర్తి చేశారు. ఆయన హయాంలో మిగిలిన రూ.25 కోట్లతో శాశ్వత క్యూ కాంప్లెక్సు కార్యరూపం దాల్చే క్రమంలో బదిలీపై వెళ్లిపోయారు. ఆ తర్వాత వచ్చిన శ్రీరామచంద్రమూర్తి క్యూ కాంప్లెక్సుపై దృష్టిపెట్ట లేదు. ప్రస్తుతం శ్రీశైల బృహత్తర ప్రణాళికలో ఇదొక్కటే ప్రధానంగా నిలిచిపోయింది.

ఈనాడు డిజిటల్‌ - కర్నూలు: రద్దీ రోజుల్లో భక్తులకు వసతి కొరత వేధిస్తోంది. దీన్ని అధిగమించేందుకు 200 గదులతో గణేశ్‌ సదన్‌ నిర్మాణం జరుగుతోంది. ఇది భరత్‌గుప్తా కాలంలో శంకుస్థాపన జరిగి పనులు మొదలవ్వగా.. రెండేళ్లు పూర్తవుతున్నా నిర్మాణం నత్తనడకన సాగుతోంది. దీన్ని కొత్త ఈవో వేగవంతం చేయాల్సి ఉంది. వంద గదులు కలిగిన శివసదనం ఉద్యోగులకు నివాస గృహాలుగా కల్పించడంతో భక్తులకు అసౌకర్యంగా మారింది. రూ.100 నామమాత్రపు నగదుతో భక్తులకు అందుబాటులో ఉండాల్సిన శివసదనం ఉద్యోగులకు నిలయంగా మారడంతో భక్తులకు వసతి కొరత ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో సాధారణ భక్తుల కోసం మరోచోట వంద గదులతో వసతి సముదాయాలు నిర్మించాలని భక్తులు కోరుతున్నారు.

రూ.50 కోట్లు వృథాయేనా?

తిరుపతి-తిరుమల తరహా శ్రీశైలం-సున్నిపెంటను తీర్చిదిద్దేందుకు శ్రీకారం చుట్టారు. శ్రీశైలంలో పనిచేసే రెగ్యులర్‌ ఉద్యోగులకు మూడు రకాల బహుళ అంతస్థులతో స్టాఫ్‌ క్వార్టర్స్‌ నిర్మించేందుకు సున్నిపెంటలో శ్రీకారం చుట్టారు. సుమారు రూ.50 కోట్లతో చేపట్టిన ఈ పనులు రెండేళ్లు అవుతున్నా అందుబాటులోకి రాలేదు. అందుబాటులోకి తెచ్చినా ఓ గ్రేడు ఉద్యోగులకు కేటాయించబోయే గదులు మరింత చిన్నవిగా ఉండటంపై ఆది నుంచి అభ్యర్థనలు, విమర్శలు వస్తున్నా... వాటిని లెక్కపెట్టకుండా నిధులు కుమ్మరించి నిర్మాణాలు చేశారు. తీరా ఇవి రేపు అందుబాటులోకి వచ్చినా ఆ స్థాయి ఉద్యోగులు అక్కడి వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. ఈ సమస్యను కొత్త ఈవో పరిష్కారం చూపాలని ఎదురు చూస్తున్నారు. ఒప్పంద ఉద్యోగులకు సైతం ప్రభుత్వం తరఫున సుమారు రెండు సెంట్ల స్థలాన్ని ఉచితంగా పట్టాలిచ్చారు. కాలనీ ఏర్పాటు చేసి మల్లికార్జున నగర్‌ అని పేరు పెట్టారు. ఈ కాలనీలో రోడ్లు, విద్యుత్తు స్తంభాలు, పచ్చదనం కోసం చెట్లు నాటి రూ.కోట్లు ఖర్చు చేశారు. వీరిని శ్రీశైలం నుంచి తరలించి అక్కడ శాశ్వత నిర్మాణాలు చేపట్టాలని కోరినా అమలుకు నోచుకోలేదు. కారణం గృహ నిర్మాణ పథకం కింద వచ్చే రూ.లక్షన్నర కాకుండా అదనంగా ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.10 లక్షల వరకు ఖర్చు అవుతుండటంతో ఒప్పంద ఉద్యోగులు తరలివెళ్లేందుకు ఆసక్తి చూపడంలేదు.

ఆక్రమణలపై దృష్టిపెడితేనే....

అటవీ శాఖ భూమి శ్రీశైలానికి 4,500 ఎకరాలకు పైగా ఇచ్చారు. ప్రస్తుతం 780 ఎకరాల్లోనే శ్రీశైలం అభివృద్ధి చెందింది. తాత్కాలికంగా నివాసాలు ఏర్పర్చుకునే స్థానికులకు కార్యనిర్వాహణ అధికారి అనుమతి లేకుండానే పచ్చజెండా ఊపుతున్నారు. రాజకీయ ఒత్తిళ్లతో కొంత మందికి అధికారులు మద్దతు పలుకుతుండటంతో, మరికొందరు దీన్ని ఆసరాగా ఆక్రమించి ఇళ్లు కట్టేస్తున్నారు. తోపుడు బండి లేదా చిన్న బంకు పెట్టుకునేందుకు టీఎస్‌ఆర్‌ రశీదు ఇస్తారు. ఈ రశీదు అడ్డం పెట్టుకుని 10్ఠ10 సైజులో దుకాణాలు అక్రమంగా ఎక్కడబడితే అక్కడ ఏర్పాటు చేసి వ్యాపారాలు చేస్తున్నారు. సిబ్బంది లంచాల మత్తులో వీటిని పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. ధరల నియంత్రణ లేక హోటళ్లు, దుకాణాల్లో నీటి సీసా కొందామన్నా భారంగానే మారుతోంది.

పూజలు పెట్టి వివాదాలు కొనిపెట్టుకున్నారు....

శ్రీశైలం ఆలయ ఈవోగా వస్తున్న అధికారులు ఆగమ శాస్త్రం విధివిధానాల్లో అర్చకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా సొంత నిర్ణయాలతో వివాదాలకు దగ్గరవుతున్నారు. గతంలో ఈవోలు ప్రవేశపెట్టిన సర్కారీ పూజలు, కమిషనర్‌ అనుమతి లేని పూజలు తెరపైకి తెచ్చి అమలుపరిచి వివాదాలు కొనితెచ్చుకున్నారు. గత ఈవో శ్రీరామచంద్రమూర్తి బాధ్యతలు చేపట్టగానే నందిశ్వీర పూజ, పరివార దేవుళ్లకు ప్రత్యేక పూజలు, గోసేవ, పల్లకీ సేవ, అమ్మవారి దీక్ష వంటివి ప్రవేశపెట్టారు. అంతటితో ఆగకుండా పూజల విషయంలో అర్చకుల మధ్య తలదూర్చి సమస్యలు కొనితెచ్చుకున్నారు.

కార్డు స్వైపింగ్‌.. ఏటీఎంలు ఉంటే చాలు

భక్తులు ఎక్కువగా నగదు కంటే వెంట ఏటీఎం కార్డులు తెచ్చుకుంటున్నారు. తీరా శ్రీగిరి చేరగానే అక్కడ ఏటీఎంలలో డబ్బులు నిల్వల్లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్రీశైలంలో ప్రతి నెలా వచ్చే హుండీ నగదును రొటేషన్‌గా కొండపై ఉన్న నాలుగు బ్యాంకుల్లో డిపాజిట్‌ చేస్తున్నారు. అయినా ఏటీఎంలను కొన్ని బ్యాంకులు సక్రమంగా నిర్వహించకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. వసతి గృహాలు, పెట్రోలు బంకు, ఆర్జిత సేవల కౌంటర్ల వద్ద సైతం కార్డు స్వైపింగ్‌ పద్ధతి లేక ఇబ్బందులు పడుతున్నారు. గతంలో స్వైపింగ్‌ యంత్రాలను తెచ్చి కొన్ని రోజులకే మూలకు పడేశారు. ఇది అమలు చేస్తే సమయం ఆదా అవుతుందని భక్తులు కోరుతున్నారు.

నడిచి..నడిచి అలసి వచ్చే భక్తులకు....

శివయ్యపై భక్తితో వందల కి.మీ. నడిచి వచ్చే భక్తులకు అసౌకర్యాలు అసహనాన్ని పెంచుతున్నాయి. శివరాత్రి, ఉగాది పర్వదినాన కన్నడ భక్తులతో శ్రీశైలం కిటకిటలాడుతుంది. అలాంటి సమయంలో భక్తులు కాలినడకన కేజీ రోడ్డులోని వెంకటాపురం గ్రామం నుంచి కొండల నడుమ శ్రీశైలం చేరుకుంటారు. చివరి దశలో కొండ వాలుగా ఉండటంతో రోప్‌ లేదా మెట్లు ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నా దానిపై దృష్టిపెట్టడం లేదు. ఇక రూ.25 కోట్లతో చేపట్టిన సిద్ధరామప్ప సముదాయం నిర్మించారు. గ్రౌండ్‌ఫ్లోర్‌ అంతా పాత వ్యాపారులకే కేటాయించారు. మొదటి అంతస్తులో టెండరు పెట్టి వేలం నిర్వహించారు. రెండో అంతస్తులో బ్యాంకులకు భవనాలు కేటాయించారు. మొదటి అంతస్తులో భక్తులకై ఆర్జిత సేవల టిక్కెట్లు, వసతి గదుల కేటాయింపునకు సెంట్రల్‌ రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు. దీనికి లిఫ్ట్‌ సౌకర్యం లేక ర్యాంపుల్లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.

నత్తనడకన సాగుతున్నాయ్‌...

గత ఈవో భరత్‌గుప్తా రూ.49 కోట్లతో ప్రసాదం పథకం ప్రవేశపెట్టారు. దీనిలోభాగంగా ఆ నిధులతో శ్రీశైలం, హఠకేశ్వరం, శిఖరేశ్వరం వద్ద సౌకర్యాల కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. ఆలయ ప్రాంగణంలో నాగులకట్ట వద్ద సౌండ్‌, లైటింగ్‌ సిస్టమ్‌ కొంత నిర్మాణం జరిగి నిలిచి పోయింది. గోశాల వద్ద యాంఫీ థియేటర్‌(భక్తులు వీక్షించేందుకు) నిర్మాణ దశలో నత్తనడకన ఉంది. ఈ పనులను పర్యాటక, దేవస్థాన అధికారులు సంయుక్తంగా పర్యవేక్షించి వేగంవంతం చేయాల్సి ఉన్నా ఆ దిశలో అడుగులు పడటం లేదు.

ముందస్తుగా మేల్కొంటేనే...

పాతాళగంగ 2016 పుష్కరాల సమయంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఆ కొండ చరియలు కింద పడకుండా ఇంటర్‌ లాకింగ్‌ సిస్టమ్‌ పేరుతో ఐరన్‌ రోప్స్‌తో చేపట్టిన పనులు నాణ్యతగా చేయకపోవడంతో మళ్లీ కొండచరియలు విరిగిపడే ప్రమాదం పొంచి ఉంది. ముందస్తుగా దీనిపై అధికారులు మేల్కోవాల్సి ఉంది. శ్రీశైలంలో ఉత్సవాల సమయంలో దారి తెలిపేందుకు ఏర్పాటు చేస్తున్న సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. వీటిని తాత్కాలికంగా ప్రతి ఏటా రూ.లక్షలు కుమ్మరించి ఏర్పాటు చేస్తున్నారు. అవి కొన్ని రోజులకే గాలికి పడిపోవడం, వంగిపోవడం వంటివి జరుగుతున్నాయి. ఉపయోగం లేదని తెలిసినా మరో ఏడాది సైతం అదే పద్ధతిలో గుత్తకు ఇస్తున్నారు. ఇలా పదేళ్లుగా నిధులు దుర్వినియోగం చేస్తున్నారే కానీ శాశ్వతంగా నగరాల్లో ఏర్పాటు చేసేవిధంగా డిజిటల్‌, సాధారణ వంటి ఆర్చి తరహా బోర్డులు ఏర్పాటుపై దృష్టి సారించడం లేదు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.